భువనేశ్వర్ : రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఒడిశా నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అశ్వినీ వైష్ణవ్‌కు రాష్ట్ర అధికార పార్టీ బిజూ జనతా దళ్ (బీజేడీ) మద్దతు ప్రకటించింది. కేంద్ర మంత్రి వైష్ణవ్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ బుధవారం ఉదయం ప్రకటించింది. ఈ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒక ప్రకటనలో రాష్ట్ర రైల్వేస్, టెలికం విభాగానికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాల దృష్టా ఈ మద్దతు తెలియజేస్తున్నట్టు ప్రకటించారు.
2019లో బీజేడీ మద్దతు తోనే వైష్ణవ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. మంగళవారం బీజేడీ అభ్యర్థులు దేవాశీష్ సమంతరాయ్, శుభాషీష్ ఖుంతియా రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అయితే మూడో సీటును బీజేడీ ఖాళీగా ఉంచింది. బుధవారం సరస్వతీ పూజ సందర్భంగా శెలవు రోజు అయినందున వైష్ణవ్ గురువారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. ఒడిశాలో మూడు రాజ్యసభ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.