హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతా పార్టీ మిషన్ 90(90 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం)లో భాగంగా వివిధ కార్యక్రమాలను త్వరలో తెలంగాణ వ్యాప్తంగా చేపట్టనున్నది. ఏప్రిల్ నెలలోగా 10 వేల గ్రామస్థాయి సభలను నిర్వహించడం కూడా ఇందులో భాగమని బిజెపి రాజ్యసభ సభ్యుడు, పార్టీ ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ తెలిపారు. బుధవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల నగరంలో జరిగిన పార్లమెంటరీ విస్తారక్ సమావేశంలో మిషన్ 90 పేరిట ఒక కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పాల్గొన్న ఈ సమావేశంలో తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలలో 90 స్థానాలను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చేజిక్కించుకోవాలని తీర్మానించారు.
కెసిఆర్‌కో హఠావో తెలంగాణకో బచావో నినాదంతో జనవరి 15 సంక్రాంతి తర్వాత 10 వేల గ్రామస్థాయి సభలను నిర్వహించాలని తీర్మానించినట్లు లక్ష్మణ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ అవినీతి, కుటుంబ పాలనను అంతం చేయాలన్నదే బిజెపి లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో చేపట్టిన వివిధ పథకాలను ఈ గ్రామసభలలో ప్రజలకు వివరించనన్నట్లు ఆయన చెప్పారు. ఇదే తరహా ప్రచారంతో రెండవ దశల అసెంబ్లీ స్థాయి బహిరంగ సభలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
కెసిఆర్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు, ప్రభుత్వ వైఫల్యాలను పేర్కొంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక చార్జిషీట్ విడుదల చేస్తారని కూడా ఆయన చెప్పారు. జనవరి 7న 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బూత్ స్థాయి కమిటీ సభ్యులనుద్దేశించి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వర్చువల్ విధానంలో ప్రసంగిస్తారని లక్ష్మణ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేత ఏప్రిల్‌లో ఒక సభను నిర్వహించాలని కూడా పార్టీ యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. దాదాపు 2 లక్షల మంది పార్టీ కార్యకర్తలు ఈ సభలో పాల్గొంటారని ఆయన తెలిపారు.