రాష్ట్ర ప్రభుత్వాలను అంతం చేయడమే దాని పని
ఎక్సైజ్ పాలసీపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ ఫేక్
మనీష్ సిసోడియా తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలను అంతం చేయడానికి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీరియల్ కిల్లర్‌లా వ్యవహరిస్తోందని ఢిల్లీ డిప్యుటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. తనపై సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ పూర్తిగా కల్పితమని, కేవలం ఏవో వర్గాల సమాచారం ఆధారంగా తయారు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీలో సిసోడియా మాట్లాడుతూ ఢిల్లీ ప్రభుత్వ ఎక్సయిజ్ విధానంలో అవినీతి జరిగినట్లు సిబిఐ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతుండడంతో ఓర్వలేకనే సిబిఐ తన ఇంటిపై దాడులు చేసిందని ఆయన ఆరోపించారు. ఇతరులు చేసే మంచి పనులు చూస్తే ప్రధాని నరేంద్ర మోడీకి అభద్రతాభావం కలుగుతుందని ఆయన ఆరోపించారు. ఆయనలాంటి అభద్రతాభావం ఉన్న వ్యక్తిని తాను ఎన్నడూ చూడలేదని సిసోడియా వ్యాఖ్యానించారు.
అరవింద్ కేజ్రీవాల్ ప్రధానిగా ఉండి.. తాను రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా ఉండి ఉంటే కేజ్రీవాల్ ఇటాంటి పని చేసి ఉండేవారు కాదని ఆయన చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సయిజ్ విధానంపై సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మనీష్ సిసోడియా ఎ1 నిందితుడిగా ఉన్నారు. కేంద్రం చేపట్టిన మంచి కార్యక్రమాలన్నిటికీ కేజ్రీవాల్ సంపూర్ణ మద్దతు ఇచ్చారని, కాని ప్రధాని మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తన ఇంట్లో 14 గంటల పాటు సోదాలు జరిపిన సిబిఐ అధికారులు తన దుస్తులతోపాటు తన పిల్లల దుస్తులను కూడా తనిఖీ చేశారని, కాని వారికి ఏమీ లభించలేదని సిసోడియా చెప్పారు. తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఖూనీ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించడానికి కేంద్రం చేస్తే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు.