Thursday, January 16, 2025

తొందర లేదు

- Advertisement -
- Advertisement -

లోక్ సభకు, శాసన సభలకు ఒకే సారి ఎన్నికలు, ప్రధాని మోడీ మాటల్లో చెప్పాలంటే ఒకే దేశం, ఒకే ఎన్నికల అమలు సాధ్యమే గాని, వచ్చే (2024) లోక్ సభ ఎన్నికలకు అమల్లో పెట్టడం వీలు కాదని లా కమిషన్ చెప్పినట్టు వచ్చిన సమాచారం వాస్తవికంగా ఉంది. 2029 ఎన్నికల నాటికి దీనిని ఆచరణలో పెట్టవచ్చునని కమిషన్ పేర్కొన్నట్టు కూడా ఆ సమాచారం తెలియ జేసింది. ఇంకా పదవీ కాలం మిగిలి ఉన్న శాసన సభల వ్యవధిని కుదించడం, ముగిసిపోతున్న శాసన సభలను పొడిగించడం ద్వారా లోక్ సభతో బాటు ఒకేసారి శాసనసభలన్నింటి ఎన్నికలు జరిపించడం సాధ్యమేనని లా కమిషన్ వివరించింది. ఇందులో సైతం ప్రజల తీర్పులకు కొంత కాలం విఘాతం కలిగే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే లోక్ సభతో బాటు ఎన్నిక జరిపించడానికి అప్పటికింకా వ్యవధి మిగిలి ఉన్న శాసన సభను ముందుగానే త్రుంచివేయడమవుతుంది.

అలాగే వ్యవధి ముగిసిపోయిన సభలను పొడిగించడం వల్ల వాటికి అంతరించిపోయిన ప్రజామోదాన్ని ఎన్నికలు జరుపకుండానే కట్టబెట్టడం అవుతుంది. పోనీ ఇదేదో ఒకసారితో ముగిసిపోతుందా అంటే అదీ కాదు. మధ్యలో ఏ శాసనసభలో అయినా పాలకపక్షం మెజారిటీని కోల్పోయి ప్రభుత్వం పడిపోతే ఏమి చేయాలి? ఎన్నికలు జరుపకుండానే తదుపరి లోక్ సభ ఎన్నికలు జరిగేవరకు రాష్ట్రపతిపాలనను కొనసాగిస్తారా? అది ఆ రాష్ట్రంలో దీర్ఘ కాలం ప్రాతినిధ్య ప్రభుత్వం లేని పరిస్థితిని కలిగించదా? ఈ జమిలి ఎన్నికల విధాన ప్రస్తావనను భారతీయ జనతా పార్టీ 2014 నుంచే చేస్తున్నది.ఇతర పార్టీలతో మాట్లాడి జమిలి ఎన్నికల కు ఒక పధ్ధతిని రూపొందిస్తామని 2014 ఎన్నికల మానిఫెస్టోలో బిజెపి పేర్కొన్నది. జమిలి ఎన్నికలవల్ల ప్రభుత్వానికి, పార్టీలకు కూడా ఖర్చు బాగా తగ్గుతుందని అభిప్రాయపడింది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అనేక సార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ఈ మధ్య అయిదు రోజులపాటు పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పరచనున్నట్టు ప్రకటన వెలువడినప్పుడు జమిలి ఎన్నికల బిల్లు అమోదింప జేసుకోడానికే అని ఊహాగానాలు దేశమంతటా ముమ్మరంగా సాగాయి. దానితోబాటు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన జమిలి పై ప్రత్యేక కమిటీ ని సైతం నియమించారు. జమిలి 2024 లో సాధ్యపడదని లా కమిషన్ నిర్ధారించినదే నిజమైతే కోవింద్ కమిటీ ఏమి చేయనున్నది? లోక్ సభ, శాసనసభలకే జమిలి ఎన్నికలు జరిపించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా లా కమిషన్ ను కోరిన కేంద్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల ఎన్నికలను కూడా పై రెండింటితో కలిపి జరిపించే అంశాన్ని శోధించవలసిందిగా కోవింద్ కమిటీని కోరినట్టు కొన్ని వార్తలు చెబుతున్నాయి. ఇలా జరిపించడం వల్ల ఖర్చు తగ్గుతుంది అని వాదించేవారికి ఈ మూడు స్థాయిల్లో నిత్యం ప్రాతినిధ్య వ్యవస్థలు ఉండాలని లేదా? మొక్కుబడిగా ఒక సారి ఎన్నికలు జరిపించి ఆ తర్వాత ఆ సభలు ఉండినా ఊడినా అధికారం చలాయించడమేనా వీరికి కావలసింది? పైపెచ్చు

నిజమైన అక్షరాస్యులు, ప్రజా స్వామ్య విధివిధానాలు తదితర విషయాల మీద లోతైన అవగాహన గలవారు అరుదుగా ఉన్న మనవంటి దేశంలో ఇన్ని ఎన్నికలు ఏక కాలంలో జరపడం వల్ల ప్రజల తీర్పు మొద్దుబారిపోయే ప్రమాదమున్నది, వారు తీవ్ర గందరగోళానికి గురి అయి ఎవరికి ఎందుకు వేయాలో సరైన నిర్ణయం తీసుకోలేని స్థితి తలెత్తుతుంది. ఇది ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు తెస్తుంది. ఏక కాల ఎన్నికలు అధ్యక్ష పాలన గల చోటనే సబబు అవుతుందని, మన వంటి దేశాలకు కుదరదని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ప్రజల పాత్రను వీలైనంతగా తగ్గించి పాలకులు ఇష్టా విలాసంగా నడిపించుకోడానికే జమిలి ఎన్నికలు తోడ్పడతాయన్న విమర్శను సులభంగా త్రోసిపుచ్చలేరు. తరచూ ఎన్నికల వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయన్న వాదన కూడా నిలబడదు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన గత తొమ్మిదేళ్లకు పైబడిన కాలంలో ఎంత గొప్ప అభివృద్ధిని సాధించారో,

ప్రజలను ఎంతగా సుఖపెట్టారో చూసు కుంటే తెలుస్తుంది. జమిలి ఎన్నికలు జరిపించాలంటే అయిదు రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి ఒక సవరణ చేయవలసి ఉంటుంది. అంటే ప్రజాస్వామ్య రాజ్యాంగ మౌలిక లక్షణమైన ప్రజాభీష్టం అనే దానికి తిలోదకాలు ఇవ్వడమే అనుకోవాలా? ఏమైనప్పటికీ జాతి గతిని పూర్తిగా మార్చివేసి, పాలక నియంత్రత్వాన్ని పెంచడానికి దోహదం చేసే అవకాశాలే ఎక్కువగా గల జమిలి ఎన్నికలకు తొందర పడకపోదమే హితవు. లా కమిషన్ చెప్పిందంటున్న ప్రస్తుతానికి పాత పద్ధతే అనేది సబబుగా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News