మిత్రపక్షం జెడియు డిమాండ్
న్యూఢిల్లీ: వంటగ్యాసు సిలిండర్ల పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని జనతాదళ్ యునైటెడ్ (జెడియు) బుధవారం డిమాండ్ చేసింది. కేంద్రంలోని బిజెపి సారథ్యపు ఎన్‌డిఎలో జెడియు మిత్రపక్షంగా ఉంది. ఇంటింటి వంటింటి బడ్జెట్‌ను ఈ విధంగా దెబ్బతీయడం భావ్య కాదని జెడియు ముఖ్య ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి బుధవారం ఓ టీవీఛానల్‌తో అన్నారు. జెడియు బీహార్‌లో బిజెపితో కలిసి ప్రభుత్వం సాగిస్తోంది. వచ్చే కొద్ది నెలల తరువాత పలు రాష్ట్రాలు ప్రత్యేకించి యుపి వంటి ప్రధాన రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ దశలో ఇటువంటి పెంపుదలను రాజకీయ ప్రత్యర్థులు మిత్రపక్షాల కూటమి విజయావకాశాలను దెబ్బతీసేందుకు వాడుకుంటారని త్యాగి ఆందోళన వ్యక్తం చేశారు. చమురు సంస్థలు పెంచిన ధరలను వెనకకు తీసుకోవల్సి ఉందని కేంద్రానికి డిమాండ్ చేశారు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. వీటితో బజారులలో వాహనాలపై తిరిగే వారికి బ్రేక్ పడింది. ఇప్పుడు కిచెన్ బడ్జెట్ పెరగడంతో ఇంట్లో శాంతి దెబ్బతిందని త్యాగి వ్యాఖ్యానించారు.