Tuesday, March 4, 2025

ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదికలపై బిజెపి, ఆప్ వాగ్వాదం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో ప్రజారోగ్య మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన కాగ్ నివేదికపై సోమవారం చర్చలో అధికార బిజెపి, ఆప్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. కొత్తగా ఏర్పాటైన ఢిల్లీ శాసనసభ మొదటి సెషన్ చివరి రోజు ఆ పరిణామం సంభవించింది. స్పీకర్ విజేందర్ గుప్తా మార్షల్స్ సాయంతో ముగ్గురు ప్రతిపక్ష ఎంఎల్‌ఎలను బయటకు పంపించారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతున్న సమయంలో ఆప్ ఎంఎల్‌ఎ జర్నెయిల్ సింగ్ ఢిల్లీ మహిళలకు రూ. 2500 చెల్లిస్తామన్న బిజెపి వాగ్దానంపై నినాదాలు చేసినప్పుడు స్పీకర్ మార్షల్స్ సాయంతో ఆయనకు బయటకు పంపించారు. ఆ తరువాత ప్రతిపక్ష నాయకురాలు ఆతిశీ సహా తక్కిన ఆప్ ఎంఎల్‌ఎలు వాకౌట్ చేశారు.

అంతకు ముందు స్పీకర్ చర్చ సమయంలో ‘పార్లమెంటరీ విరుద్ధ’ భాష వాడినందుకు ఆప్ ఎంఎల్‌ఎలు అనిల్ ఝా, కుల్దీప్ కుమార్‌లను మార్షల్స్ సాయంతో బయటకు పంపించారు. మార్షల్స్ సాయంతో పంపివేసిన, సస్పెండైన ఏ సభ్యుడైనా వెంటనే అసెంబ్లీ ప్రాంగణంలో నుంచి వెళ్లిపోవలసి ఉంటుందని గుప్తా ఆ తరువాత ‘పిటిఐ’తో చెప్పారు. అటువంటి ఏ సభ్యుడైనా అసెంబ్లీ ప్రాంగణంలో నుంచి వెళ్లిపోకపోతే, సెషన్ తక్కిన కాలానికి ఆటోమేటిక్‌గా సస్పెండ్ అవుతారని గుప్తా తెలిపారు. ఢిల్లీలో ప్రజారోగ్య మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య సేవల నిర్వహణకు సంబంధించిన కాగ్ నివేదికను ఫిబ్రవరి 28న అసెంబ్లీకి సమర్పించారు. ఆప్ పది సంవత్సరాల పాలన కింద ఢిల్లీలో ఆరోగ్య సేవల పరిస్థితిపై ఆప్‌ను ముఖ్యమంత్రి తూర్పారబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News