Sunday, December 22, 2024

ఒడిశాలో పొడవని పొత్తు.. బిజెపి, బిజెడి సొంతంగానే పోటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో కలసి పోటీ చేయడానికి సంబంధించి అధికార బిజూ జనతా దళ్(బిజెడి), భారతీయ జనతా పార్టీ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలలో అనూహ్యంగా ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ రెండు పార్టీలు రానున్న ఎన్నికలలో ఎవరికి వారే ఒంటరిగా పోటీ చేసే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. రెండు కీలక నియోజకవర్గాలైన భువనీశ్వర్, పూరీపై ఏర్పడిన విభేదాలను పరిష్కరించడంలో శనివారం ఢిల్లీలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఒడిశాలోని మొత్తం 147 అసెంబ్లీ నియోజకవర్గాలు, 21 లోక్‌సభ నియోజకవర్గాలలో బిజెపి తన అభ్యర్థులను నిలబెడుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ శుక్రవారం సాయంత్రం భువనేశ్వర్‌కు తిరిగివచ్చిన అనంతరం విలేకరులకు సూచనప్రాయంగా వెల్లడించారు.

ఢిల్లీలో చర్చలు కేవలం ఎన్నికల సన్నాహాలకు సంబంధించి మాత్రమే జరిగాయని, సీట్ల పొత్తు లేదా కూటమి గురించి కాదని ఆయన స్పష్టం చేశారు. పొత్తులపై ఎటువంటి చర్చ జరగలేదని, తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని సమాల్ చెప్పారు. రానున్న లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తాము చేస్తున్న ఏర్పాట్ల గురించి కేంద్ర నాయకులతో చర్చించేందుకు తాము ఢిల్లీకి వెళ్లామని ఆయన తెలిపారు. కాగా..సీట్ల పంపకాలపైనే రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయని వర్గాల ద్వారా తెలిసింది.

ఎన్నికలకు ముందుగానే సీట్ల సర్దుబాటు చేసుకోవాలని రెండు పార్టీలు తొలుత భావించినప్పటికీ సీట్ల పంపకాల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. 147 అసెంబ్లీ స్థానాలలో 100కి పైగా స్థానాలలో పోటీ చేస్తామన్న బిజెడి ప్రతిపాదనను బిజెపి వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఒడిశాలోని 21 లోక్‌సభ స్థానాలలో 14 స్థానాలను తమకు కేటాయించాలని బిజెపి పట్టుపట్టినట్లు తెలుస్తోంది. దీనికి బిజెడి ససేమిరా అన్నట్లు వర్గాలు తెలిపాయి. రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం రానందున చర్చలలో ప్రతిష్ఠంభన ఏర్పడినట్లు వారు చెప్పారు. కాగా..2019 లోక్‌సభ ఎన్నికలలో బిజెడి 12 స్థానాలలో గెలుపొందగా బిజెపి 8 స్థానాలను గెలుచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News