Sunday, December 22, 2024

బిజెపి, కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వాలే

- Advertisement -
- Advertisement -
  • మేడ్చల్ పట్టణంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
  • ధర్నాలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ : కేంద్రంలో అధికారం ఉన్న బిజెపి గతంలో పాలించిన కాంగ్రెస్ రెండు రైతు వ్యతిరేక ప్రభుత్వాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ విద్యుతు రద్దు చేయాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విచక్షణ లేనివని అన్నారు. తెలంగాణ రైతాంగంపై కాంగ్రెస్ కక్ష కట్టిందని 70 ఏళ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని తెలిపారు. దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదగాలని, 24 గంటల ఉచిత కరెంటు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.

కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి ఉండేదని, ఇప్పుడు స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రైతులకు భరోసాగా రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ భారతదేశానికి రోల్ మోడల్‌గా నిలిచింది తెలంగాణ ప్రభుత్వమని అన్నారు.

మొదటి నుంచి కాంగ్రెస్‌కు రైతులంటే చిన్న చూపే, మొన్న ధరణి వద్దన్నారు ఇప్పుడు వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని అంటున్నారని ఎద్దేవా చేశారు. 5 మినిషాలలో భూమి రిజిస్ట్రేషన్ అవుతున్న ధరణి పోర్టల్ ను కూడా వద్దంటున్నారని తెలిపారు. రైతులతో పెట్టుకున్న బిజెపి ప్రభుత్వమే గద్దె దిగే పరిస్థితి వచ్చిందని అన్నారు. దేశానికి వెన్నుముకనై రైతును రాజు చేయాలని సిఎం కెసిఆర్ రైతుల కోసం మరే రాష్ట్రంలోనూ లేని విధంగా రైతుల సంక్షేమం కోసం 30 వరకు రకరకాల పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.

మరోకసారి మూడు గంటల మాట ఎత్తితే రైతుల చేతుల్లో మాడు పగలడం ఖాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం, తెలంగాణ రైతులంతా ఇదంతా దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడగొట్టి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గ దయాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, జవహర్ నగర్ మేయర్ కావ్య, మున్సిపాలిటీ చైర్మన్లు దీపికా నర్సింహా రెడ్డి, ప్రణిత శ్రీకాంత్ గౌడ్, మద్దుల లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, కొండల్ రెడ్డి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ మండల, మున్సిపాలిటీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, శేఖర్ గౌడ్, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News