హైదరాబాద్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో అమరవీరులకు నివాళులు అర్పించే అర్హత బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు లేదని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు నేపథ్యంలో ఈ మేరకు గురువారం హైదరాబాద్ అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరులకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, బిఆర్‌ఎస్‌వి నేతలు, కార్యకర్తలతో కలిసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి వల్లే 1200 మంది అమరులైనారన్నారు. ఉద్యమనేత కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణను సాధించుకున్నామన్నారు. రాష్ట్రం సాధించుకుని 9సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో అమరులను తాము స్మరించుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులను స్మరించుకుంటు ఘనంగా నివాళ్లు అర్పిస్తున్నామన్నారు. అమరులకు నివాళి అర్పించే అర్హత తెలంగాణ ఉద్యమకారులకు మాత్రమే ఉందన్నారు. ఉద్యమకారులను గుర్తించిన పార్టీ కూడా తమ బిఅరెస్ పార్టీయేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన విద్యార్థులందరికి పలు రకాలుగా సిఎం కెసిఆర్ అవకాశాలు కల్పించారన్నారు.