కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేకిగా వర్ణించిన బిజెపి
న్యూఢిల్లీ: అయోధ్యలో జనవరి 22న జరిగే రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సానికి తమ పార్టీ అగ్ర నాయకులెవరూ వెళ్లడం లేదని కాంగ్రెస్ పార్టీ బుధవారం చేసిన ప్రకటనపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి ఈ నెల 22న అయోధ్యకు వెళ్లబోరని కాంగ్రెస్ చేసిన ప్రకటనను తప్పుపట్టిన బిజెపి కాంగ్రెస్ పార్టీని రామ వ్యతిరేకిగా అభివర్ణించింది. రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఆర్‌ఎస్‌ఎస్/బిజెపి కార్యక్రమంగా కాంగ్రెస్ బుధవారం ఒక ప్రకటనలో అభివర్ణించింది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్), బిజెపి అయోధ్యలో ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చివేశాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై బిజెపి గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తరచు హిందువులను, సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారని బిజెపి మండిపడింది. కాగా..అయోధ్య ఆలయంలో ఈ నెల 22న జరిగే మహోత్సవానికి హాజరుకాకూడదని పార్టీ అగ్రనేతలు తీసుకున్న నిర్ణయాన్ని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సమర్థించారు. ఒక మతపరమైన కార్యక్రమాన్ని రాజకీయ వ్యవహారంగా బిజెపి మార్చివేసిందని ఆయన విమర్శించారు. సిద్దరామయ్య వ్యాఖ్యలపై బిజెపి నాయకులు ఘాటుగా స్పందించారు.
కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ను కట్టడి చేసేందుకు సిద్దరామయ్య కొందరు వ్యక్తులను రెచ్చగొడుతున్నారని, ఇది ఆయన వ్యూహమని కేంద మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. గడచిన 14 సంవత్సరాలలో గణతంత్ర దినోత్సవాలలో పాల్గొనేందుకు కర్నాటక శకటానికి 10 సార్లు అవకాశం లభించిందని ఆయన చెప్పారు. 2006, 2007, 2009, 2010లో కర్నాటక శకటానికి అనుమతి లభించలేదని, అప్పుడు కేంద్రంలో ఎవరి ప్రభుత్వం ఉందని ఆయన ప్రశ్నించారు. మొదటి నుంచి రామ జన్మభూమిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, అవాంతరాలు సృష్టించడానికి చేతనైన ప్రయత్నాలన్నీ చేస్తోందని మరో బిజెపి ఎంపి హరనాథ్ సింగ్ యాదవ్ ఆరోపించారు.
హొందూత్వానికి కాంగ్రెస్ వ్యతిరేకమని కర్నాటక బిజెపి అధ్యక్షుడు సిటి రవి అన్నారు. సోమనాథ్ ఆలయాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్, కెఎం మున్షీ నిర్మించారని, అప్పుడు ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ ఉన్నారని ఆయన చెప్పారు. సోమనాథ్ ఆలయాన్ని జవహర్‌లాల్ సందర్శించలేదని, ఇప్పుడు నాయకులు అయోధ్యను ఎలా సందర్శించగలరని ఆయన ప్రశ్నించారు.
మొదట తమకు అయోధ్యకు ఆహ్వానం రాలేదని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు దాన్ని తిరస్కరిస్తున్నామని చెబుతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని, జి20 సదస్సును కూడా బహిష్కరించిందని బిజెపి ఎంపి సుధాంశు త్రివేది గుర్తు చేశారు. 2004 నుంచి 2009 వరకు కార్గిల్ విజయ్ దివస్‌ను కాంగ్రెస్ బహిష్కరించిందని, అటల్ విహారీ వాజ్‌పేయి నాయకత్వంలో 1998 మేలో పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన తర్వాత 10 రోజుల వరకు కాంగ్రెస్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదని త్రివేది తెలిపారు.