Sunday, December 22, 2024

ఇది బిజెపి, సంఘ్ పరివార్ పిరికిపంద చర్య

- Advertisement -
- Advertisement -

గుజరాత్ కాంగ్రెస్ ఆఫీసుపై దాడిని ఖండించిన రాహుల్

న్యూఢిల్లీ: గుజరాత్ కాంగ్రెస్ కార్యాలయంపై జరిగిన దాడిని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం తీవ్రంగా ఖండించారు. బిజెపి, సంఘ్ పరివార్ పిరికిపందలా హింసకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. అహ్మదాబాద్‌లోని రాజీవ్ గాంధీ భవన్‌పై సోమవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గుజరాత్‌కాంగ్రెస్ ఆఫీసుపై జరిగిన దాడిని పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణిస్తూ బిజెపి, సంఘ్ పరివార్‌పై తాను తాను గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయానికి తాజా చర్య మరింత బలం చేకూర్చిందని ఆయన అన్నారు.

హింసను, ద్వేషాన్ని వ్యాప్తి చేసే బిజెపి మనుషులకు హిందూత్వం మౌలిక సిద్ధాంతాలు అర్థం కావని రాహుల్ వ్యాఖ్యానించారు. వారి అబద్ధాలను స్పష్టంగా చూడగల గుజరాత్ ప్రజలు బిజెపి ప్రభుత్వానికి నిర్ణయాత్మక గుణపాఠం నేర్పుతారని ఆయన అన్నారు. గుజరాత్‌లో ఇండియా కూటమి గెలిచి తీరుతుందని తాను మరోసారి చెబుతున్నానని ఎక్స్ వేదికగా రాహుల్ ప్రకటించారు. ఇలా ఉండగా..పార్లమెంట్‌లో హిందువుల గురించి రాహుల్ గాంధఋ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అహ్మదాబాద్‌లోని కాంగ్రెస్ కార్యాలయంపై బిజెపి, బజరంగ్ దళ్, విహెచ్‌పితో సంబంధం ఉన్న వ్యక్తులు రాళ్లు రువ్వారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హేమంగ్ రావల్ ఆరోపించారు.

మంగళవారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని రాజీవ్ గాంధీ భవన్ వెలుపల బిజెపి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బిజెపి కార్యకర్తలు రాజీవ్ గాంధీ భవన్ వెలుపల నిరసనకు దిగారు. రాళ్ల దాడి ఘటనలో ముగ్గురు పోలీసులతో సహా ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. రాజీవ్ గాంధీ భవన్ ప్రహరీ గోడ దూకి చొరబడిన బరంగ్ దళ్ సభ్యులు రాహుల్ గాంధీ పోస్టర్లకు నల్ల రంగు పూశారు. కాగా..గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు ఈ సంఘటన దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News