అలప్పుజలో 144 సెక్షన్
అలప్పుజ: కేరళలోని అలప్పుజ జిల్లాలో రెండు పార్టీలకు చెందిన ఇద్దరు నేతల వరుస హత్యలు ఉద్రిక్తతకు కారణమయ్యాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్‌డిపిఐ) కేరళ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ షాన్‌ను శనివారం రాత్రి కొందరు దుండగులు కారుతో ఢీకొట్టి చంపారు. పార్టీ కార్యాలయం నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్న షాన్‌ను కారుతో ఢీకొట్టారు. కింద పడిపోయిన ఆయణ్ని దుండగులు తీవ్రంగా కొట్టడంతో మరణించారు. షాన్ హత్య జరిగిన గంటల వ్యవధిలోనే బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ హత్యకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఆయన ఇంట్లోకి చొరబడి హత్యగావించారు. షాన్ హత్యకు ప్రతీకారంగానే శ్రీనివాసన్ హత్య జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ రెండు హత్యల నేపథ్యంలో అలప్పుజ జిల్లా అంతటా 144 సెక్షన్ కింద ఆంక్షలు విధించారు. ఎస్‌డిపిఐ, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన 50మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు ఐజి హర్షిత అట్టలూరి తెలిపారు. తమ అదుపులో ఉన్నవారంతా నిందితులని కాదు, రెండు హత్యలకు సంబంధించిన సమాచారం కోసం ప్రశ్నిస్తున్నామని ఆమె తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తోపాటు ఇతర పార్టీల నేతలు ఈ హత్యలను ఖండించారు. ఈ హత్యల వెనుక ఉన్నవారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని ఆయన తెలిపారు. విద్వేషాలను రగిలించే ఇలాంటి బృందాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయన్ విజ్ఞప్తి చేశారు. ఇటువంటి హత్యలు అమానవీయమని ఆయన అన్నారు.