రెండు ఎంఎల్‌సిలలో
విజయభేరి సోమవారం
కరీంనగర్ టీచర్స్ ఎంఎల్‌సిని
కైవసం చేసుకున్న బిజెపి
బుధవారం నాడు హోరాహోరీగా
జరిగిన కరీంనగర్ పట్టభద్రుల
స్థానాన్ని గెలుచుకున్న
కమలనాథులు రాష్ట్ర
బిజెపిలో విజయోత్సాహం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలోని ఏ డు ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగిన ఎమ్మెల్సీ ఎ న్నికల్లో బిజెపి మద్దతు ఇచ్చిన అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేయడం ఆ పార్టీలో జోష్ నిం పింది. బిజెపి అనుసరించిన వ్యూహాత్మక ఎత్తుగడ ఫలించడంతో ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలలో ఉహించని విధంగా 8 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ అదే వరవడిని క నబర్చడం భవిష్యత్‌లో ఇక తమకు ఎదురు ఉండదని ఆ పార్టీలో ధీమా వ్యక్తం అవుతోంది. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కంటే బీజేపీనే సీరియస్‌గా తీసుకుంది. విజయం సాధించడమే ఏకైక లక్షంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాకరంగా తీసుకుంది. ఆ పార్టీ టార్గెట్‌గా పెట్టుకున్నట్టుగానే అధికార పార్టీపై పై చేయి సాధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ బరిలో లేకపోవడాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకోగలిగింది.
బీఆర్‌ఎస్ నాయకత్వం కూడా తా ము బరిలో లేకపోయినా బీజేపీ గెలిచినా ఫర్వాలే దు, అధికార కాంగ్రెస్ గెలువకూడదని భావించిం ది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బిజెపిలో జోష్‌ను పెంచగా, గుడ్డిలో మెల్లగా కాంగ్రెస్ మాత్రం గెలువలేదని బీఆర్‌ఎస్ సరిపెట్టుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు ఎంపిలు, ఎమ్మెల్యేలు సైతం ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి బాగా కలిసొచ్చింది. మూడు చోట్ల అభ్యర్థులను నిలిపి, ప్రతి 20 నుంచి 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించడం వంటి వ్యూహం బీజేపీ అభ్యర్థుల గెలుపునకు దోహదపడ్డాయని భావిస్తున్నారు. ఇక జీవో 317 అంశంలో ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయుల వ్యతిరేకతను బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకోవడంలో సఫలికృతం అయిందని చెప్పవచ్చు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ మినహా మిగిలిన ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం, బిజెపి బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించడంతో రాష్ట్రంలో చాపకింద నీరులా బిజెపి తన బలం పెంచుకుంటున్నట్టుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎంపి, ఎమ్మెల్సీ ఎన్నికలలో వరుస విజయాలు బీజేపీ శ్రేణులలో మరింత జోష్ పెంచడానికి దోహదంచేస్తున్నదన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.
ఎన్నికలకు ముందే అభ్యర్థులను ప్రకటించిన బిజెపి
రాష్ట్రంలో జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బిజెపి మద్దతు ఇస్తున్న అభ్యర్థులను ముందే ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది. ఇక బిఆర్‌ఎస్ అయితే అసలు పోటీ చేయడం లేదని ముందుగానే కాడి దించేసిన విషయం తెలిసిందే. ఈ రెండు అంశాలను బిజెపి రాష్ట్ర నాయకత్వం తనకు అనుకూలంగా మలుచుకొని పకడ్బందీ వ్యూహంతో తన అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. అలాగే ఉపాధ్యాయుల పాలిట శరాఘాతంగా మారిన 317 జివోను గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చింది.
ఆ జివోను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది మూడు నెలలు దాటినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం తమకు కలిసివచ్చిన అంశంగా బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. మరో వైపు ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్ బరిలో లేకపోవడం బిజెపికి కలిసి వచ్చిందని చెబుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ విజయం ఎంతో ఉపయోగపడుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. భవిష్యత్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అవుతామన్న ధీమా ను బీజేపీ వ్యక్తం చేస్తోంది.