Monday, December 23, 2024

రాజస్థాన్‌లో రెండు కీలక ఎన్నికల కమిటీలను ప్రకటించిన బిజెపి

- Advertisement -
- Advertisement -

జైపూర్: కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కోసం భారతీయ జనతా పార్టీ రెండు కీలక ఎన్నికల కమిటీలను ప్రకటించింది. అయితే ఈ రెండు కమిటీల్లోను మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె సింధియాకు చోటు కల్పించక పోవడం గమనార్హం.21మంది సభ్యులుండే ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీకి మాజీ ఎంపి నారాయణ్ పంచారియా నేతృత్వం వహించనున్నారు. అలాగే సంకల్ప్ పత్ర కమిటీగా పిలవబడే ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ నేతృత్వం వహిస్తారు. కాగా ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రం కోసం పార్టీ మరి కొద్ది రోజుల్లోనే మరో కమిటీ ఎన్నికల ప్రచార కమిటీని ప్రకటించనుంది.

ఈ రెండు ఎన్నికల కమిటీల్లోను వసుంధరా రాజెకు చోటు కల్పించకపోవడం గురించి బిజెపి రాష్ట్ర ఇన్‌చార్జి అరుణ్ సింగ్‌ను ప్రశ్నించగా, ఆమె ఎన్నికల్లో ప్రచారం చేస్తారని చెప్పారు. ‘ఆమె పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు. ఆమె పెద్ద పాత్ర పోషించాల్సి ఉంది, ఆమె రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు.ఆమె ఎన్నికల్లో ప్రచారం చేస్తారు. మేమంతా ఆమెను గౌరవిస్తాం’ అని అరుణ్ సింగ్ విలేఖరులతో అన్నారు. కాగా అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో రాష్ట్ర, జాతీయ నాయకులంతా కూడా ప్రచారం చేస్తారని బిజెపి రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. రాష్ట్ర ప్రజలు బిజెపికి అనుకూలంగా తీర్పు ఇస్తారని, తాము చరిత్రాత్మక విజయం సాధిస్తామన్న నమ్మకం తనకు ఉందని ప్రహ్లాద్ జోషీ చెప్పారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఈ ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News