అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, తెలంగాణ శాసన మండలి నాలుగు గ్రాడ్యుయేట్స్ , టీచర్చ్ నియోజకవర్గాలకు భారతీయ జనతా పార్టీ(బిజెపి) మంగళవారం నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికలు మార్చి 13న జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు గ్రాడ్యుయేట్ సీట్లకు, తెలంగాణలోని ఒక టీచర్ సీటుకు వారి పేర్లను బిజెపి ప్రకటించింది.
ప్రకాశం, నెల్లూరు,చిత్తూరు నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థిగా సన్నారెడ్డి దయాకర్ రెడ్డి పోటీచేస్తున్నారు. కడప,అనంతపూర్, కర్నూల్ నియోజకవర్గానికి నాగరూరు రాఘవేంద్రను, శ్రీకాకులం, విజయనగరం,విశాఖపట్నం నియోజకవర్గానికి పి.వి.ఎన్. మాధవ్‌ను బిజెపి నిలబెట్టింది.
ఇక తెలంగాణలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ సీటుకు ఏ. వెంకట నారాయణ రెడ్డిని బిజెపి బరిలో నిలిపింది. కాగా రెండు తెలుగు రాష్ట్రాలలో మిగతా ఎంఎల్‌సి సీట్ల అభ్యర్థులను కూడా తర్వాత ప్రకటించనుంది. భారత ఎలక్షన్ కమిషన్(ఈసిఐ) ఏపి, తెలంగాణలోని 15 ఎంఎల్‌సి సీట్ల ద్వై వార్షిక ఎన్నికలకు గత వారం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఎన్నికలు మార్చి 13న జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రకటనను ఈసిఐ ఫిబ్రవరి 16న జారీచేయనున్నది. నామినేషన్లు దాఖలు చేయడానికి తుది తేది ఫిబ్రవరి 23. నామినేషన్ల పరిశీలన మరునాడే జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ తుది తేది ఫిబ్రవరి 27. పోలింగ్ మార్చి 13న జరిగితే, ఓట్ల లెక్కింపు మార్చి 16న జరుగనున్నది.