Wednesday, January 22, 2025

కమలానికి కొత్త తలనొప్పి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఆ పార్టీలో అసమ్మతి సెగ రాజేసింది. అవినీతి ఆరోపణలు, అసంతృప్తిని తగ్గించుకునేందుకు పార్టీ చేపట్టిన ప్రక్షాళన తిరుగుబాటును లేవనెత్తిం ది. టికెట్లపై గంపెడాశలు పెట్టుకున్న సీనియర్లు భంగపాటుకు గురై రాజీనామాల పర్వానికి దిగడం కాషాయానికి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది. దీంతో పరిష్కారం కోసం బీజేపీ ఇప్పుడు యడియూరప్ప వైపు చూస్తోంది. రెబల్స్‌ను బుజ్జగించడానికి మాజీ సిఎం యడియూరప్పను రంగం లోకి దింపింది.
రెండోజాబితాలో ఏడుగురికి మొండిచేయి
దక్షిణాదిలో తమ ఏకైక అధికార కేంద్రమైన కర్ణాటకను నిలబెట్టుకునేందుకు కాషాయ పార్టీ ఈసారి కఠిన నిర్ణయాలే తీసుకుంది. సీనియర్లకు ఉద్వాసన పలుకుతూ చా లా మంది కొత్తవారికి అవకాశాలు కల్పించింది. 189 మందితో విడుదలైన తొలి జాబితాలో 52 మంది కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇవ్వగా, బుధవారం విడుదల చేసిన రెండో జాబితాలోనూ ఏడుగురు సిట్టింగ్ ఎమ్‌ఎల్‌ఎలకు మొండిచేయి చూపించింది. 23 మందితో బీజేపీ బుధవారం రెండో జాబితా విడుదల చేసింది. అందులో ఏడుగురు కొత్తవారు. ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న విరూపాక్షప్ప సహా ఏడుగురు సిట్టింగ్ ఎమ్‌ఎల్‌ఎలకు పార్టీ టికెట్లు నిరాకరించింది.
మరో ఎమ్‌ఎల్‌ఎ రాజీనామా
తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత బీజేపీ కీలక నేత ఎమ్‌ఎల్‌సి లక్ష్మణ్ సవది పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎమ్‌ఎల్‌ఎ కూడా అదేబాట పట్టారు. టికెట్ దక్కక పోవడంతో అసం తృప్తికి గురైన ముదిగెరె ఎమ్‌ఎల్‌ఎ కుమారస్వామి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
కాంగ్రెస్‌లో చేరిన మరో నేత
బెంగళూరు రాజాజీనగర్‌కు చెం దిన సీనియర్ బీజేపీ నేత పద్మరాజ్ తన మద్దతుదారులతో సహా బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పద్మరాజ్‌కు పార్టీ పతాకం అందజేసి స్వయంగా కేపీసీసీ అధ్యక్షుడు డికె శివకుమార్ ప్రతిపక్ష నేత సిద్ద రామయ్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బివి శ్రీనివాస్, ఎమ్‌ఎల్‌ఎ భైరతి సురేష్, మాజీ మేయర్ పద్మావతి తదితరులు హాజరయ్యారు. రాజాజీనగర్‌లో బీజేపీ టికెట్ ఆశించిన పద్మరాజ్ మళ్లీ అక్కడ సిట్టింగ్ ఎమ్‌ఎల్‌ఎ సురేశ్ కుమార్‌కే టికెట్ ఇవ్వడంతో ఇందుకు నిరసనగా పార్టీకి రాజీనామా చేశారు. పద్మరాజ్‌తోపాటు దాదాపు 450 మంది కాంగ్రెస్‌లో చేరారు. రాజాజినగర్ కాంగ్రెస్ అభ్యర్థి పుట్టణ్ణ కూడా ఉన్నారు.
జె(ఎస్) లోకి బిజెపి నేత దొడ్డప్ప గౌడ?
జేడీ(ఎస్) లోకి శుక్రవారం చాలామంది నేతలు రాబోతున్నారని, బీజేపీ నేత దొడ్డప్ప గౌడ పాటిల్ నరిబోబ్ చేరిక దాదాపు ఖాయమైందని జేడీ (ఎస్) అధినేత కుమారస్వామి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తర కర్ణాటక నుంచే తాము 30 నుంచి 40 స్థానాల్లో గెలవబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జేడీఎస్ ఇప్పటికే తొలి జాబితా అభ్యర్థులను ఖరారు చేసిందన్నారు. శుక్రవారం రెండో జాబితాను విడుదల చేయనున్నట్టు కుమారస్వామి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News