Friday, January 17, 2025

బిజెపికి 400కి పైగా సీట్లు ఖాయం: శామ్ పిట్రోడా

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా అనుమానం

న్యూఢిల్లీ: ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఇవిఎం)పై కీంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. ఇవిఎంలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించని పక్షంలో 2024 సార్వత్రిక ఎన్నికల లో బిజెపి 400కి పైగా స్థానాలను గెలుచుకుంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను భారత్ భవిష్యత్తును నిర్ణయించేవిగా ఆయన అభివర్ణించారు. ఇవిఎంలపై వస్తున్న భాయందోళనలను ఎన్నికల కమిషన్ మాత్రం నిత్యం కొట్టివేస్తూ అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తోంది.

అయితే కాంగ్రెస్‌తోసహా కొన్ని ప్రతిపక్షాలకు చెందిన నాయకులు మాత్రం ఇవిఎంలద్వారా అక్రమాలకు పాల్పడడం సాధ్యమేనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 100 శాతం ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్(వివిపాట్) ఉండాలని, ఆ స్లిప్పులను బాక్సులలో వేయడానికి బుదులుగా ఓటర్లకు అందచేయాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఇవిఎంలకు సంబంధించిన లోపాలను వెంటనే సరిచేయని పక్షంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి 400కిపైగా సీట్లను గెలుచుకుంటుందని వ్యాఖ్యానించారు.

అయోధ్య రామాలయంపై తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, మతం అన్నది వ్యక్తిగతమని, దాన్ని రాజకీయాలతో మిళితం చేయకూడదని పిట్రోడా అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టనున్న మణిపూర్-ముంబై భారత్ న్యాయ యాత్ర గురించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు భారతదేశ భవిష్యత్తుకు సంబంధించినవని, ఎటువంటి దేశాన్ని నిర్మించాలనుకుంటున్నామో ఈ ఎన్నికలు నిర్ణయిస్తామని ఆయన అన్నారు. అన్ని మతాలను గౌరవించాలని, రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలని, పౌర సమాజం స్వేచ్ఛగా పనిచేయాలని చెప్పే మన రాజ్యాంగ నిబంధనలకు లోబడి నిర్మించే దేశమా లేక ఒక మతాధిపత్యం ఆధారంగా నిర్మంచే దేశమా అని పిట్రోడా ప్రశ్నించారు.

ఇవిఎంలపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ అధ్యక్షతలోని సిటిజన్స్ కమిషన్ ఆన్ ఎలెక్షన్స్ అనే ఎన్‌జిఓ విడుదల చేసిన ఒక నివేదికను ఉటంకించారు. ఓటరు ధ్రువీకరించుకునే విధంగా వివిపాట్ విధానాన్ని పూర్తిగా మార్చాలని ఆ నివేదికలో సిఫార్సు చేశారని ఆయన తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందిస్తుందని ఎదురుచూశానని, కాని అది జరగకపోవడంతోనే తాను మాట్లాడాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయాయని, ఇక జరగనున్నది 2024 సార్వత్రిక ఎన్నికలేనని ఆయన తెలిపారు. ఆ ఎన్‌జిఓ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇవిఎంలపై విశాసం కొరవడుతోందని, విశ్వాసం పాదుగొల్పడానికి ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా స్పందించాల్సి ఉంటుందని పిట్రోడా చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం గాడి తప్పిందని తాను నమ్ముతున్నానని, మన దేశం రోజురోజుకూ నియంతృత్వంలోకి జారుకుంటోందని ఆయన అన్నారు.

ఇప్పుడు ఏక వ్యక్తి పాలనే నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో 400కి పైగా స్థానాలను గెలుయుకుంటామన్న బిజెపి విశ్వాసం గురించి ప్రశ్నించగా అలా చేయగలమని వారు(బిజెపి) భావిస్తే వారికి గల అధికారాలేనని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఇకనిర్ణయం తీసుకోవలసింది ప్రజలేనని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల లోపు ఇవిఎం లోపాలను సరిదిద్దాల్సి ఉంటుందని, అలా జరగని పక్షంలో 400 స్థానాలపై బిజెపి ధీమా నిజం కావచ్చని ఆయన చెప్పారు. ఒకవేళ ఇవిఎంలను సరిదిద్దితే 400 స్థానాలు వారికి దక్కకపోవచ్చని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News