Monday, November 25, 2024

బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు రూ.4వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ మాజీ ఎంపి, చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించారు. ఏకంగా వేల కోట్ల ఆస్తులు అఫిడవిట్‌లో పొందుపర్చారు. నామినేషన్‌లో భాగంగా కొండా విశ్వేశ్వరరెడ్డి సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్ హాట్ టాపిక్‌గా నిలిచింది. విశ్వేశ్వర్‌రెడ్డి, ఆయన భార్య, కొడుకుకు కలిపి మొత్తం రూ.4,488 కోట్లు చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

వీటికి స్థిరాస్తులు కలిపితే మొత్తం ఆస్తులు రూ.4,564.21 కోట్లు. ఈ ఆస్తులతో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దేశంలోనే శ్రీమంతులైన రాజకీయ నాయకుల్లో నెంబర్‌వన్‌గా నిలిచే చాన్స్ ఉంది. ఇక చరాస్తుల వివరాల్లోకి వెళితే.. విశ్వేశ్వర్‌రెడ్డికి రూ.1178 కోట్లు, విశ్వేశ్వర్‌రెడ్డి భార్య సంగీతా రెడ్డికి 3203 కోట్లు, విశ్వేశ్వర్‌రెడ్డి కొడుకు విరాజ్ మాధవ్‌కు రూ.107 కోట్లుగా చూపారు.

ఇక స్థిరాస్తుల వివరాల్లోకి వెళితే.. విశ్వేశ్వర్‌రెడ్డికి రూ.71.34 కోట్లు, విశ్వేశ్వర్‌రెడ్డి భార్య సంగీతారెడ్డికి రూ.3.6 కోట్లు, విశ్వేశ్వర్‌రెడ్డి కొడుకు విరాజ్ మాధవ్‌కు రూ.1.27 కోట్లుగా చూపారు. ఇక అప్పుల విషయానికొస్తే.. విశ్వేశ్వర్‌రెడ్డికి అప్పులు రూ.1.76 కోట్లు, విశ్వేశ్వర్‌రెడ్డి భార్య సంగీతారెడ్డికి అప్పులు రూ.12 కోట్లుగా చూపారు. ఇక విశ్వేశర్‌రెడ్డికి, ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తుల్లో ఎక్కువ భాగం అపోలో హాస్పిటల్స్ గ్రూపునకు సంబంధించిన షేర్లే, విశ్వేశ్వర్‌రెడ్డికి అపోలో లో రూ.973 కోట్ల విలువైన షేర్లు ఉండగా, ఆయన భార్యకు రూ.1500 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి.

గత లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి ఇప్పటివరకు అపోలో గ్రూపు షేర్లు స్టాక్ మార్కెట్లో దూసుకెళుతుండటంతో మాజీ ఎంపి ఆస్తుల విలువ భారీగా పెరిగినట్లు సమాచారం. ఇక భూముల విషయానికొస్తే విశ్వేశ్వర్‌రెడ్డికి హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల మొత్తం 70 ఎకరాల భూమి ఉంది. ఆయన భార్యకు 14 ఎకరాల భూమి ఉంది. ఇవే కాకుండా 45432 స్కేర్ ఫీట్ల విస్తీర్ణం గల నివాస భవనాలున్నాయి. ఇక వాణిజ్య భవనాల విషయానికొస్తే బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఒకటి, ఉస్మాన్‌గంజ్‌లో 14 షాపులు, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 86లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News