మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠను రేపుతోంది. వాలిడ్.. ఇన్వాలిడ్ ఓట్ల లెక్కింంపు ప్రక్రియ ముగిశాక సోమవారం ఉదయం 11 గంటల 30 నిమిషాల తర్వాత అసలైన పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కాంగ్రెస్ అభ్యర్థి, ఆల్‌ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి, బిఎస్‌పి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. సోమవారం రాత్రి ఐదో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి 7,323 లీడ్‌లో ఉన్నారు. 5 రౌండ్ వరకు అంజిరెడ్డి మొత్తం సాధించిన ఓట్లు 38,967, నరేందర్ రెడ్డి సాధించిన మొత్తం ఓట్లు 31,644, ప్రసన్న హరికృష్ణ సాధించిన మొత్తం ఓట్లు 26,562 ఉండగా మిగతా 53 అభ్యర్థులు కూడా ఓట్లు వచ్చిన వారిలో ఉన్నారు.
లెక్కింపు పూర్తయిన ఓట్లు సుమారు 1,05,000 దాటాయి. 12 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తున్నారు. మంగళవారం రాత్రి 10:00 దాటాక ఐదు రౌండ్లు పూర్తికాగా ఇంకా ఏడు రౌండ్ల ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది. 21 వేల బ్యాలెట్ పేపర్ ఓట్లను లెక్కిస్తున్నారు. పట్టభద్రుల మొత్తం 3,55,159 ఓట్లకు గాను 2,50,628 పోల్ అయ్యాయి. ఇంకా దాదాపు లక్షా 19 వేల ఓట్లను లెక్కించలిసి ఉంది. రాత్రి వరకు దాదాపు 26 వేల పైగా ఓట్లు చెల్లుబాటు కాలేదు. పట్టభద్రుల తీర్పు ఎలా ఉంటుందో అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోలైన ఓట్లలో చెల్లుబాటైన ఓట్లలో సగానికంటే ఎక్కువ వస్తేనే విజేత ఎవరో తేలనుంది. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజేత తేలకకుంటే రెండో ప్రాధాన్యతకు వెళ్ళవలసి ఉంటుంది. ఎవరు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచే అవకాశం లేదు కనుక బుధవారం జరిగే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది. అప్పటివరకు ఓట్ల లెక్కింపు ఫలితంపై వేచి చూడాల్సిందే.