హిమాచల్‌లో ఆరుగురు కాంగ్రెస్ రెబల్స్‌కు టికెట్లు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు బిజెపి తన అభ్యర్థులను మంగళవారం ప్రకటిచంఇంది. అనర్హతకు గురై కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్‌ను వీడి తమ పార్టీలో చేరిన హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలకు బిజెపి టిక్కెట్లు ఇచ్చింది. అదే విధంగా ఇటీవలే బిజెపిలో చేరిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా కమలం పార్టీ టిక్కెట్లు ఇచ్చింది.
హిమాచల్ ప్రదేశ్‌లో సుధీర్ శర్మ(ధర్మశాల), రవి ఠాకూర్(లహోల్, స్పితి), రాజీందర్ రాణా(సుజన్‌పూర్), ఇందర్ దత్ లఖన్‌పాల్(బర్సార్), చేతన్య శర్మ(గాగ్రెట్), దేవీందర్ కుమార్ భుట్టో(కుట్లేహార్)ను తమ అభ్యర్థులుగా బిజెపి ప్రకటించింది. పార్టీ విప్‌ను ధక్కరించి రాజ్యసభ ఎన్నికలలో బిజెపి అభ్యర్థికి ఓటేసినందుకు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురయ్యారు. గుజరాత్‌లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో జరిగే ఉప ఎన్నికల కోసం రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా బిజెపి తన అభ్యర్థులను ప్రకటించింది. కర్నాటకలో ఉప ఎన్నికల జరిగే ఒక అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని బిజెపి ప్రకటించింది. సిక్కింలోని 9 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికలకు బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు సిక్కిం అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి.