న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి) శని, ఆదివారాలలో కీలక భేటీ జరుపుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో భాగంగా ఈ సమావేశాలు జరుగుతాయి. ఎన్నికల ప్రక్రియ ఆరంభానికి ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంప్రదింపులు పూర్తి చేయాలని, తొందరగా అభ్యర్థుల జాబితాలను వెలువరించాలని పార్టీ సంకల్పించింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగాల్సి ఉంది. సిఇసిలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ అధ్యక్షులు జెపి నడ్డా ఉన్నారు. అభ్యర్థుల ఎంపికలో సిఇసినే తుది నిర్ణాయాత్మక పాత్ర పోషిస్తుంది. దీనితో రెండురోజుల బిజెపి సిఇసి భేటీపై సీట్ల పోటీదారులలో ఆసక్తి నెలకొంది.
అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో బిజెపి 79 మంది సభ్యులతో ఓ జాబితా వెలువరించింది. చత్తీస్‌గఢ్‌లో 21 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మధ్యప్రదేశ్ బరిలోకి ఇప్పటికే ముగ్గురు కేంద్ర మంత్రులను దింపుతున్నారు. కాగా ఈసారి తొలిసారిగా సిఇసి రాజస్థాన్‌పై దృష్టి సారిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణలో బిఆర్‌ఎస్ అధికారంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రాలలో పార్టీ అభ్యర్థుల ఎంపికను విస్తృతస్థాయి చర్చలు, వడబోతల తరువాత చేపట్టాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఏ రాష్ట్రంలోనూ బిజెపి తమ పార్టీ సిఎం అభ్యర్థి పేరును ప్రచారంలోకి తీసుకురాలేదు. ఇది తమ పార్టీ పద్థతి కాదని పార్టీ నేతలు తెలిపారు.