Monday, December 23, 2024

నేరాంగీకారమే అది

- Advertisement -
- Advertisement -

కేజ్రీ రాజీనామా ప్రకటనపై బిజెపి
అది ఎత్తుగడ అన్న కాంగ్రెస్

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటనను ‘నేరం ఒప్పుకోవడం’గా బిజెపి ఆదివారం అభివర్ణించింది. తన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో అంతర్గత పోరు కారణంగా పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రతిపాదించారా అని బిజెపి ప్రశ్నించింది. కేజ్రీవాల్ ప్రకటన ఒక ‘నాటకం’ అని కూడా పార్టీ పేర్కొన్నది. ఎక్సైజ్ విధానం కేసులో ఆయనకు సుప్రీం కోర్టు ‘షరతులతో కూడిన బెయిల్’ మంజూరు చేసి, తన కార్యాలయానికి వెళ్లకుండా, ఏ ఫైల్‌పైనా సంతకం చేయకుండా నిరోధించినందున అవసరానుగతంగా ఆయన ‘భావోద్వేగ వ్యూహం’ అనుసరిస్తున్నారని పార్టీ విమర్శించింది.

బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, ‘అర్వింద్ కేజ్రీవాల్ రాజీనామా గురించి మాట్లాడినప్పుడు తన నేరాన్ని అంగీకరించినట్లు అయింది. ఆయనపై మోపిన అభియోగాలు ఎటువంటివి అంటే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగే వీలు లేదు’ అని వ్యాఖ్యానించారు. కుంభకోణం సందర్భంగా అరెస్టు అయినప్పుడు కేజ్రీవాల్ ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన అడిగారు. ‘ఆయన జైలులో నుంచి బయటకు వచ్చిన తరువాత రాజీనామా గురించి మాట్లాడడం, ఢిల్లీలో సత్వరమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతుండడం అనుమానాలను రేకెత్తిస్తున్నది’ అని త్రివేది చెప్పారు.

‘తన పార్టీలో ఏదో వివాదం సాగుతుండవచ్చు. అందుకే దానిని సర్దుబాటు చేయడం కష్టంగా ఆయన భావిస్తుండవచ్చు’ అని త్రివేది అన్నారు. కేజ్రీవాల్ తన తత్వానికి భిన్నంగా ‘నిరర్థకమైనవి మాట్లాడుతున్నారు’ అని బిజెపి నేత విమర్శించారు. ‘ఆయన ఇప్పటికీ ముఖ్యమంత్రి. ఆయన పార్టీకి ఢిల్లీ అసెంబ్లీలో అఖండ ఆధిక్యం ఉంది. ఆయన ఎన్నికలను కోరుకుంటుంటే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి, అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయవచ్చు’ అని త్రివేది సూచించారు. ఇది ఇలా ఉండగా, కేజ్రీవాల్ ప్రకటనను ‘కేవలం ఒక ఎత్తుగడ’ అని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అభివర్ణించారు. కేజ్రీవాల్ చాలా కాలం క్రితమే రాజీనామా చేసి ఉండవలసిందని దీక్షిత్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News