న్యూఢిల్లీ : శివసేన నేతృత్వం లోని మహావికాస్ అఘాడీ (ఎంవిఎ) మహారాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ అత్యంత అవినీతి, అవకాశవాదం, ప్రజావ్యతిరేకం, పనికిమాలిన ప్రభుత్వంగా మారిందని, ఉద్ధవ్ ఠాకరే అనుకోని, విధులకు హాజరు కాని ముఖ్యమంత్రిగా మిగిలారని బిజెపి ఆదివారం ధ్వజమెత్తింది. సీనియర్ బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్‌సిపి, శివసేన నేతలపై నమోదైన అవినీతి కేసుల జాబితాను వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తన రెండేళ్ల పాలనా కాలంలో రాజకీయాలను నేరమయం చేసిందని, అంతకు తప్ప చెప్పుకోడానికి ఇంకేమీ లేదని వ్యాఖ్యానించారు.
థాకరేను ఉద్దేశిస్తూ మహారాష్ర ప్రజలు 2019 ఎన్నికల్లో శివసేన బిజెపి పొత్తుకు తమ మద్దతు తెలిపినా, శివసేన అధినేత ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికతో విపక్షాలు ఎన్‌సిపి, కాంగ్రెస్‌లతో చేతులు కలిపారని ఆరోపించారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మహా వసూలియా అఘాదీ సర్కార్ ( మహా దోపిడీ ప్రభుత్వం) అని పిలుస్తుండగా, తాను మాత్రం కొత్త పేరు మహా విశ్వాస్‌ఘాతి అఘాడీ సర్కారు ( అవిశ్వాస ప్రభుత్వం ) గా పిలుస్తానని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి థాకరే ముంబై లోని వేరే కార్యక్రమంలో తన రెండేళ్ల పాలన గురించి మాట్లాడుతూఏ తమ ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఎక్కువ బాగం కొవిడ్ నివారణతోనే గడిపిందని, ఈ సంక్షోభాన్ని తగ్గించడంలో తమ ప్రభుత్వ సఫలీకృతం అయిందని పేర్కొన్నారు. తాము చేసిన ప్రయత్నాలన్నిటికీ ప్రజలు మద్దతు ఇచ్చారని ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.