న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆదివారం ‘ఇండియా’ కూటమి ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన‘మ్యాచ్ ఫిక్సింగ్’ ఆరోపణలు, ఇతర వ్యాఖ్యలకు గాను ఆయనపై ‘కఠిన చర్య’ తీసుకోవలసిందిగా ఎన్నికల కమిషన్ (ఇసి)కి భారతీయ జనతా పార్టీ (బిజెపి) సోమవారం విజ్ఞప్తి చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్‌తో కూడిన పార్టీ ప్రతినిధివర్గం రాహుల్ గాంధీపై ఇసికి ఫిర్యాదు దాఖలు చేసింది.
ఇసి అధికారులతో సమావేశం అనంతరం మంత్రి పూరి మీడియాతో మాట్లాడుతూ, బహిరంగ సభలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుని వ్యాఖ్యలు ‘అత్యంత అభ్యంతరకరం’ అని, అవి ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమైనవే కాకుండా తీవ్ర విపరిణామాలకు దారి తీయగలవని అన్నారు. ‘ఆదివారం బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, ఇవి (లోక్‌సభ ఎన్నికలు) ఫిక్స్‌డ్ మ్యాచ్ అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తమ మనుషులను ఇసిలో నియమించిందని కూడా ఆయన అన్నారు.
ఇవిఎంల విశ్వసనీయతను కూడా ప్రశ్నించిన రాహుల్ ఎన్నికల అనంతరం రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు (మారుస్తారు) అని ఆరోపించారు’ అని పూరి విలేకరులతో చెప్పారు. ‘రాహుల్ గాంధీపైన, ఇతర కాంగ్రెస్ నేతలపైన, ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఇతర నేతలపైన కఠిన చర్య తీసుకోవలసిందిగా ఎన్నికల కమిషన్‌ను మేము అభ్యర్థించాం’ అని పూరి తెలియజేశారు. రాహుల్ గాంధీ పదే పదే అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అరుణ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ నేత అటువంటి వ్యాఖ్యల చేయడం మానరు కనుక లోక్‌సభ ఎన్నికల సమయంలో మాట్లాడకుండా ఆయనను అభిశంసించే విషయాని ఎన్నికల కమిషన్ పరిశీలించాలని అరుణ్ కుమార్ సూచించారు.