హైదరాబాద్: గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దీంతో నగరంలో పూర్తిగా రాజకీయ వేడి రగులుకుంది. ఇప్పటీ వరకు అధికార బిఆర్‌ఎస్, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడంతో పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాద యాత్రల పేరుతో బస్తీల బాట పట్టిన బిఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమైయ్యారు. ఇదంతా చూస్తున్న ఇతర పార్టీలకు చెందిన అశావాహులు తమకే టికెట్ వస్తుందన్న నమ్మకం ఉన్న పలువురు సైతం ప్రచారాన్ని ప్రారంభించారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారం బిజెపి పార్టీ పూర్తిగా వెనకబడింది. ఆ పార్టీ ఇప్పటీ వరకు అధికారికంగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేయకపోవడంతో టికెట్ తమకే వస్తుందన్న నమ్మకమున్న పలువురు ఆశావాహులు తమ అనుచరగణంలో కలిసి కొంత మేర ప్రచారం కొనసాగిస్తున్నారు. దీంతో బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల కంటే బిజెపి ఎన్నికల ప్రచారం పూర్తిగా వెనుకబడింది. అయితే గురువారం బిజెపి అధిష్టానం తొలి జాబితా ప్రకటించే అవకాశాలుండడంతో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు దానికి ఎదురుచూస్తున్నారు.
మరో వైపు టిడిపి సైతం ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేయనున్నామని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించడం, ఆ పార్టీ అభ్యర్థులు సైతం తర్వలోనే ఖరారు కానున్నారు. అంతేకాకుండ బిఎస్‌పి ఇప్పటికే పలువురు అభ్యర్థుల ప్రకటించడమే కాకుండా మంగళవారం ఆ పార్టీ మేనిఫెస్టోను సైతం విడుదల చేసింది. దీంతో ఆపార్టీ చెందిన పలువురు అభ్యర్థులు ప్రచారాన్ని అంతా సిద్దం చేసుకుంటున్నారు.