Monday, January 20, 2025

ప్రత్యామ్నాయం వైపు దక్షిణాది చూపు

- Advertisement -
- Advertisement -

BJP concentrate on South India

మతం పేరుతో విభజన, ప్రజల్లో విద్వేషాలు, మైనారిటీల, పౌరసత్వం పేరుతో అణచివేత, గుజరాత్ అల్లర్లను గుర్తుచేస్తూ మధ్య యుగాల్లా మత ఘర్షణలకు ప్రేరేపణ, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం, రైతులనూ వదలకపోవడం, లఖింపూర్ ఖేరిలో వలే వాహనాలతో తొక్కిం చేయడం, పశ్నిస్తే రాజద్రోహం, ఎదిరిస్తే దేశద్రోహం, అదేమంటే ‘అర్బన్ నక్సలైట్’, మేధావులను జైళ్ళలో కుక్కడం, ప్రస్తుతం ఉన్న ఈ స్థితిని తలుచుకుంటే దేశానికి అసలు ఊపిరాడడం లేదు. ఏడున్నరేళ్ళుగా ఎన్‌డిఎ పాలనతో దేశం అతలాకుతలమైపోతోంది. ఏం చేయాలో ప్రజలకు దిక్కుతోచడం లేదు. ఈ సందిగ్ధావస్థలో అయిదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. దక్షిణాది రాష్ట్రాల ఆలోచన ప్రత్యామ్నాయం వైపు మళ్ళింది.
ఇప్పుడేం చేయాలి? అందరిలో అదే సందేహం. మధ్యయుగాలలో ఖైబర్ కనుమల నుంచి భారత ఉపఖండంలోకి విదేశీ చొరబాట్లు జరిగాయి. ఇప్పుడు ఉత్తరాది నుంచి వింద్య పర్వతాలుదాటి మతం పేరుతో ఫ్యాసిజం ముంచెత్తే ప్రమాదం ముంచుకొస్తోంది. మోడీ, అమిత్ షాల నాయత్వంలోని ఎన్‌డిఎ పాలన కర్ణాటకలో అతికష్టంపైన తిష్టవేసింది. దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలకు విస్తరించాలని ఎదురు చూస్తోంది. కేంద్రంలో ఉన్న ఎన్‌డిఎ పాలనా వ్యవహార శైలి పై అన్ని రాష్ట్రాలలోనూ అసంతృప్తి నెలకొంది. కేంద్ర, రాష్ర్ట సంబంధాల గురించి బిజెపి పాలిత రాష్ట్రాలలో కూడా అసమ్మతి గూడుకట్టుకుంది. మోడీ నాయత్వంలో ఎన్‌డిఎ 2014లో అధికారంలోకి వచ్చినప్పటికంటే, రెండవ విడత 2019లో అధికారం చేపట్టాక దాని అసలు రూపాన్ని దేశం చవిచూస్తోంది. మళ్ళీ మూడవ విడత ఎన్‌డిఎ అధికారం చేపడితే పాలన మరింత దారుణంగా తయారవుతుందని దేశం భయపడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్‌డిఎయేతర రాజకీయ శక్తులు పత్య్రామ్నాయంవైపు ఆలోచించడం మొదలు పెట్టాయి. హైదరాబాదులో తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును శనివారం సిపిఐ, సిపిఎం నాయకులు విడివిడిగా కలిసి జాతీయ రాజకీయాలపై చర్చించాయి. కెసిఆర్ ఇదివరకే కాంగ్రెస్, బిజెపియేతర శక్తులతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చాయి. ఈ కొత్త ఫ్రంట్ అవసరం ఎందుకు ఏర్పడింది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
భారత రాజ్యాంగాన్ని ఫెడరల్ స్ఫూర్తితో లిఖించారు. ఈ స్ఫూర్తికి భిన్నంగా తొలి నుంచి రాష్ట్రాల అధికారాలపై కేంద్రం కత్తెర విధిస్తూ పెత్తనం చెలాయిస్తోంది. కేంద్ర రాష్ట్రాల అధికారాలు, కర్తవ్యాలు, పాలనా నిర్వహణపై నాటి ప్రధాని రాజీవ్ గాంధీ వేసిన సర్కారియా కమిషన్ 1987లో నివేదికను సమర్పించింది. ఈ నివేదిక సమర్పించే నాటికి రాజ్యాంగంలోని 356 వ అధికరణం ప్రకారం రాష్ట్రాలలో వంద సార్లు రాష్ర్టపతి పాలన విధించారు. వీటిలో 90 సార్లు తమ రాజకీయావసరాల కోసమే రాష్ర్టపతి పాలన విధించారు.ఎక్కువ సార్లు ఉత్తరప్రదేశ్‌లో రాష్ర్టపతి పాలన విధించగా, ఎక్కువకాలం జమ్ముకశ్మీర్‌లోనే రాష్ర్టపతి పాలన కొనసాగింది. కేంద్రంలో ఉన్న ఏ పార్టీ కూడా సర్కారియా కమిషన్ సూచనలను పట్టించుకున్న పాపాన పోలేదు. మోడీ, అమిత్ షా ద్వయం ఆధర్వర్యంలోని ఎన్‌డిఎ పాలన లో కేంద్రీకృత పాలన మరింత బలపడింది. ఉమ్మడి జాబితాలోని అంశాలను అమలు చేసేటప్పుడు రాష్ట్రాలను సంప్రదించాలని సర్కారియా కమిషన్ చేసిన సూచనలకు భిన్నంగా మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఎన్‌డిఎ ఏకపక్షంగా తెచ్చింది. ఏడాది పాటు రైతులు చేసిన ఆందోళనలో ఏడు వందల మంది రైతుల ప్రాణాలు పోయాయి. ఈ వ్యవసాయ చట్టాలను విధి లేక వెనక్కి తీసుకోక తప్పలేదు.
రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడానికి బదులు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. గవర్నర్లు వ్యవహరించే తీరుపట్ల రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. మహారాష్ర్టలో శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపి సంయుక్తంగా ఏర్పాటు చేసిన మహావికాస్ అగాధి సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి కేంద్రంలోని ఎన్‌డిఎ తన శక్తినంతా ధారపోస్తోంది. కరోనా కట్టడికి ఆ రాష్ర్ట ప్రభుత్వం విఫలమైందని బిజెపి పూర్వ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ భగత్ సింగ్ కోషియార్‌కు ఫిర్యాదు చేశారు. ‘మహరాష్ర్ట బచావో’ ఆందోళనను లేవదీశారు. కరోనా సంక్షోభానికి రాష్ర్టపతి పాలనే పరిష్కారం’ అని బిజెపి ఎంపి సుబ్రమణ్య స్వామి ట్వీట్ చేశారు.కరోనాని కట్టడి చేస్తే ఆ గొప్పతనం కేంద్రానిది, వైఫల్యాలు రాష్ట్రాలవా అంటూ ముఖ్యమంత్రి ఉద్ధ్దవ్ ఠాక్రే పశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మహారాష్ర్టకు ఇవ్వాల్సిన 22 వేల కోట్ల రూపాయల జిఎస్‌టి బకాయిలను ఇవ్వకుండా, రుణం తీసుకోమని సలహా ఇస్తోంది. “గొంతు నులిమి శ్వాస తీసుకోనీయకుండా చేస్తే, ఆత్మనిర్భరం (స్వయంసమృద్ధి) ఎలా సాధ్యం” అని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నిస్తున్నారు.
దేశ ఆర్థిక వనరులపైన రాష్ట్రాలకున్న అధికారానికి కేంద్రం పరిమితులు విధిస్తూ కబ్జా చేస్తోందని, బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఇటీవల ఆరోపించారు. కేంద్రం చర్యల వల్ల రాష్ట్రాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దెబ్బతింటున్నాయన్నారు. జిఎస్‌టి బకాయిల వసూలు, కరోనా వ్యాక్సిన్ కేవలం కేంద్ర ప్రభుత్వ గొప్పదనం కాదని, కేంద్రం, రాష్ట్రాల సంయుక్త ఆధ్వర్యం లో జరిగేవన్న విషయాన్ని మర్చిపోరాదన్నారు. ఆహార ధాన్యాల ధరలు, రబ్బరు ధరలు, తీరప్రాంత రక్షణ, ప్రవాసుల పునరావాసంలో కేరళ ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోవడం లేదని పినరయ్ విజయన్ ఆరోపించారు. వీటికి తోడు కేరళ విశ్వవిద్యాలయం రాష్ర్టపతి రామనాథ్ కోవింద్‌కు గౌరవ డీలిట్ ఇచ్చే విషయం కూడా వివాదమైంది. ఛాన్సలర్‌గా గవర్నర్ ప్రతిపాదనను యూనివర్శిటీ సిండికేట్‌లో పెట్టి ఆమోదించకుండా, కొద్ది మంది సిండికేట్ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారనేది ఆరోపణ. మహారాష్ర్ట, పశ్చిమ బెంగాల్‌లలో విశ్వవిద్యాలయాల విసిల నియామకంలో గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు పొరపొచ్చాలు వచ్చాయి. విసిల నియామకంలో గవర్నర్ల పాత్రను నామమాత్రం చేస్తూ, శాసనసభల్లో తీర్మానం చేశారు. ఇప్పుడది తమిళనాడు, కేరళకు కూడా పాకింది. వీరి వివాదం ఎంతవరకు వెళ్ళిందంటే, సిఎంపైన అలిగిన కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఛాన్సలర్లుగా గవర్నర్ల బదులు ముఖ్యమంత్రులనే నియమించుకునేలా శాసన సభలో బిల్లు పాస్ చేస్తే, అది చట్టరూపం దాల్చడానికి ఏమాత్రం వెనుకాడకుండా సంతకం చేస్తానని ప్రకటించారు.
తమిళనాడులో తొలి నుంచి గవర్నర్ పాత్ర వివాదాస్పదమే. పళణిస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తప్ప, ఎఐడిఎంకె అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కానీ, డిఎంకె తరపున కరుణానిధి, ప్రస్తుత స్టాలిన్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ గవర్నర్లతో వివాదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాల కంటే కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఏమీ లేవని, కేంద్రానికి ఉన్నట్టే రాష్ట్రాలకు కూడా అధికారాలు ఉన్నాయని స్టాలిన్ స్పష్టం చేశారు. రాష్ట్రాల సంక్షేమం పైనే దేశ సంక్షేమం ఆధారపడి ఉందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం అని కాకుండా, రాజ్యాంగంలో ఉన్నట్టు ‘యూనియన్ ప్రభుత్వం’ అని తమిళంలో పేర్కొన్నారు. యుపిఎలో భాగస్వామి అయిన డిఎంకె కేంద్రంలోని ఎన్‌డిఎ విధానాలను వ్యతిరేకించడంలో తొలి నుంచి ముందుంది. తమిళనాడుకు వారసత్వంగా వస్తున్న హిందీ ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం ద్వారా కేంద్ర ఆధిపత్యాన్ని నిలువరించడానికి ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రాల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడడానికి ఎవరితోనైనా చేతులు కలుపుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గత అక్టోబర్‌లోనే ప్రకటించారు. దీని గురించి స్టాలిన్‌కు కూడా లేఖ రాశారు. జిఎస్‌టి పేరుతో పన్నులన్నిటినీ కేంద్రం కాజేస్తోందని, పెట్రోల్, డీజిల్ ధరలను కూడా జిఎస్‌టి పరిధికి తీసుకురావాలని యోచిస్తోందని, బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. యాసంగిలో వరి వేయడం పైన కూడా కెసిఆర్‌కు కేంద్రానికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. యాసంగిలోవరి వేయమని, వరిని రాష్ర్ట ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ర్ట బిజెపి నాయకులు ఒత్తిడి చేస్తుంటే, వరిని కొనుగోలు చేసే ప్రసక్తే లేదని కేంద్రం అంటోంది. దీని గురించి కెసిఆర్ కేంద్రంపై యుద్ధమే ప్రకటించారు. ‘ప్రశ్నిస్తే దేశద్రోహమంటారా!?’ అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్‌డిఎలో భాగస్వామి కాకపోయినప్పటికీ, కేంద్రంతో స్నేహ సంబంధాలు నెరుపుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపైన ఉన్న కేసుల వల్ల కేంద్రంతో పైకి ఎంత సఖ్యత ప్రదర్శించినప్పటికీ, బిజెపికి రాజకీయంగా రాష్ర్టంలో సూదిమొన మోపే అవకాశం కూడా ఇవ్వడం లేదు.
ఎన్‌డిఎ పాలనలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు కూడా ఊపిరాడడం లేదు. ఈ విషయంలో బెంగాల్ తిరగబడింది. శాసన సభ ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడించింది. ఫలితంగా బిజెపి అగ్రనాయకులలో ప్రతీకార జ్వాలలు రగిలిపోతున్నాయి. దేశ సరిహద్దుకు 35 కిలోమీటర్ల వరకు ఉన్న బిఎస్‌ఎఫ్ పరిధిని 50 కిలోమీటర్లకు పెంచుతూ కేంద్రం చట్టసవరణ చేసింది. దీంతో ఆ ప్రాంతమంతా హోంశాఖా మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని బిఎస్‌ఎఫ్ పరిధిలోకి వచ్చేసింది. అక్కడ పౌర పరిపాలన ఉండదు. విచారణ లేకుండా ఎవరినైనా నిర్బంధించవచ్చు. ఇది మిగతా సరిహద్దు రాష్ట్రాల కంటే బెంగాల్ పైనే ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. పదవీ విరమణ చేసిన పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలాపన్ బందోపాధ్యాయ పదవీ కాలాన్ని రాష్ర్ట ప్రభుత్వం మూడు నెలలు పొడిగిస్తూ ప్రతిపాదిస్తే దానికి కేంద్రం కూడా ఆమోదించింది. కానీ, ఆయనను ఢిల్లీ వచ్చి రిపోర్ట్ చేయమని కేంద్రం ఆదేశాలు జారీ చేసి, మమత ఆలోచనలకు చెక్ పెట్టాలని చూసింది. తనను ఓడించిన వారిపట్ల బిజెపి నాయకత్వం కక్ష సాధింపులకు ఇలా దిగుతోంది.
కేంద్రం చర్యలపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఒకప్పుడు ఎన్‌డిఎలో భాగస్వామి అయిన మమత ఇప్పుడు దానికి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు. ఎన్‌డిఎను ఎదుర్కోడానికి కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎకు శక్తి చాలడం లేదు. అందుకే మమత కూడా ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం ఆలోచిస్తున్నారు. దక్షిణాదితో పాటు, ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఒకటొకటిగా ప్రత్యామ్నాయ ఫ్రంట్‌వైపు ఆలోచిస్తున్నాయి.వచ్చే నెల జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత ప్రత్యామ్నాయ ఫ్రంటు ఒక రూపం దాల్చవచ్చు. వీటిని మినీ సాధారణ ఎన్నికలుగా భావించినప్పటికీ, 2024లో జరగనున్న అసలు సాధారణ ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

 

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News