న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేస్తున్న పథకాలను బిజెపి, కాంగ్రెస్ కాపీ కొడుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శవరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా పథకాన్ని ప్రారంభించిన కొద్ది గంటలకే కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఈ పథకాన్ని ప్రారంభిస్తూ తన ప్రభుత్వం మహిళలకు నెలకు రూ 1000చొప్పున నడదు బదిలీ చేస్తుందని, ఈ పథకం కోసం మొత్తం 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.
దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ ఆప్ మేనిఫెస్టోకు ఇది కాపీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఆప్ చూపిన బాటలోనే కాంగ్రెస్, బిజెపి నడుస్తున్నాయని ఆయన చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస ఆప్ మేనిఫెస్టోను కాపీ కొట్టి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు బిజెపి కూడా అదే బాటలో నడుస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇది మంచి పరిణామమేనని ఆయన అన్నారు. ఏ పార్టీకైనా ప్రజా సంక్షేమమే మొదటి ప్రాధాన్యత కావాలని ఆయన అన్నారు. ఏ పార్టీ దీన్ని అమలు చేస్తోందో అనవరమని ఆయన అన్నారు.
కాగా..ఈరోజు తన జీవితంలో మరచిపోలేనిదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ వ్యాఖ్యానించారు. గత నెలల్లో ఈ పథకం కోసం మొత్తం 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. మహిళందరికీ వారి బ్యాంకు ఖాతాలలో రూ. 12,000 పడతాయని ఆయన చెప్పారు. మహిళల సాధికారత కోసమే ఈ పథకం ప్రారంభించామని, వారు తమ కనీస అవసరాలు దీని ద్వారా తీర్చుకోవచ్చని ఆయన తెలిపారు.