Monday, December 23, 2024

నియంతృత్వ పాలనకు బిజెపి కుట్ర

- Advertisement -
- Advertisement -

దొడ్డిదారిలో నియంతృత్వ పాలనకు కుట్ర
ఒక దేశం, ఒకే ఎన్నికలపై మమత అభ్యంతరం

కోల్‌కత: వివాదాస్పద ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చి, ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ పాలనకు అనుమతించి ఎన్నికల బరిలోకి దిగేందుకు జరుగుతున్న కుట్రగా ఆమె అభివర్ణించారు. తాను నియంతృత్వానికి వ్యతిరేకమని, అందుకే ఈ కుట్రను వ్యతిరేకిస్తున్నానని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని తమపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనపడుతోందని, ప్రజాస్వామ్యం, ఫెడరల్ స్ఫూర్తిగా ఇది వ్యతిరేకమని ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ కార్యదర్శి డాక్టర్ నితెన్ చంద్రకు రాసిన లేఖలో మమత పేర్కొన్నారు.

ప్రస్తుతం అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ఏకకాలంలో జరగడం లేదని, వీటి మధ్య ఎడం చాలా ఎక్కువ ఉందని ఆమె తెలిపారు. 1952లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు కేంద్రానికి, రాష్ట్రాలకు ఏకకాలంలో జరిగాయని ఆమె గుర్తు చేశారు. అలా కొన్నేళ్లపాటు జరిగినప్పటికీ ఆ తర్వాత ఈ ప్రక్రియ దెబ్బతిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు వేర్వేరు ఎన్నికల క్యాలెండర్లు ఉన్నాయని, రాజకీయ పరిణామాల కారనంగా అవి కూడా మారుతూ వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. జమిలి ఎన్నికల పేరుతో ఎన్నికలకు సిద్ధంగా లేని రాష్ట్రాలపై బలవంతపు ఎన్నికలు రుద్దకూడదని ఆమె స్పష్టం చేశారు. ఒక దేశం, ఒకే ఎన్నికల ఆలోచన వల్ల లోక్‌సభ కాని రాష్ట్ర అసెంబ్లీ కానీ అర్ధాంతరంగా రద్దు కావలసి వస్తుందని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వ అస్థిరత రాష్ట్ర అసెంబ్లీలను అస్థిరపరచకూడదని ఆమె సూచించారు. అంతేగాక ఉమ్మడి ఓటర్ల జాబితా తయారీతో సహా అనేక స్వల్ప అభ్యంతరాలను ఆమె ప్రస్తావించారు. ఉన్నత స్థాయి కమిటీలో ముఖ్యమంత్రులను చేర్చకపోవడాన్ని కూడా ఆమె తప్పుపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News