Saturday, April 19, 2025

అమిత్ షాను మోడీ కట్టడి చేయాలి

- Advertisement -
- Advertisement -

బెంగాల్ అరాచకం బిజెపి కుట్రనే
వక్ఫ్ చట్టంతో విభజన రేఖలు
బిఎస్‌ఎఫ్ సాయంతోనే చొరబాట్లు
ఇమామ్‌లతో భేటీలో మమత బెనర్జీ

కోల్‌కతా: ప్రధాని మోడీ ఇకనైనా హోం మంత్రి అమిత్ షాను అదుపులో పెట్టాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చురకలు పెట్టారు. బెంగాల్‌లో ఇప్పుడు వక్ఫ్‌పై నిరసనల పేరిట జరుగుతున్నదంతా ఓ వ్యూహం ప్రకారం సాగుతున్నదని విమర్శించారు. ఏదో విధంగా బెంగాల్‌ను, ఇక్కడి టిఎంసిని ఇరుకున పెట్టడమే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ అంతిమ లక్షంగా కన్పిస్తోందని చెప్పారు. ఇమామ్‌లతో ఆమె బుధవారం జరిపిన సమావేశంలో తీవ్రస్థాయిలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో ఇప్పటి ఘర్షణలు కేవలం అమిత్ షా వ్యూహంలో భాగం అని విమర్శించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని, అవకాశం కోసం చూసి ఇప్పుడు నిరసనలను ఈ విధంగా కేంద్రం హింసాత్మకం చేసిందని ఆరోపించారు.

బిఎస్‌ఎప్ ఏదో విధంగా ఇక్కడ ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు అమిత్ షా వ్యూహం పన్నారని తెలిపారు. వక్ఫ్ చట్టంపై నిరసనలు పలు చోట్ల ఉద్రిక్తతలకు , మితిమీరి హింసాకాండకు దారితీయడం, ఘర్షణలలో పలువురు మృతి చెందడం జరుగుతోంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి హిందూ వర్గాలు పారిపోతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. బంగ్లాదేశీ దుండగులు ఇక్కడికి ప్రవేశించేలా అరాచకం సృష్టించేలా చేసేందుకు కేంద్రం ఫక్కా వ్యూహం పన్నిందని తమకు సమాచారం అందిందని మమత ఇమామ్‌ల సమావేశంలో తెలిపారు.

ఇమామ్‌లపై గురుతర బాధ్యత

ఇమామ్‌లు సామరస్య స్థాపనకు సహకరించాల్సి ఉందన్నారు. విద్వేష ప్రచారాలకు మోసపోవద్దని కోరారు. వక్ఫ్ చట్టాన్ని తమ రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా సవాలు చేస్తుందని, ఇందుకు ఎంత దూరం అయినా వెళ్లుతుందని, ముస్లింలకు న్యాయం జరిగేలా చేస్తుందని హామీ ఇచ్చారు. ముస్లింలు శాంతియుత నిరసనలకు దిగేలా చూడాల్సి ఉందని ఆమె ముస్లిం మత పెద్దలకు సలహా ఇచ్చారు. ఇక ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్ షాను కట్టడి చేయాల్సి ఉందని, ఆయన ఆడింది ఆట పాడింది పాటగా సాగితే పరిస్థితి దిగజారుతుందని మమత హెచ్చరించారు.

దేశ సరిహద్దులను కాపాడేది బిఎస్‌ఎఫ్ , మరి బంగ్లాదేశ్ నుంచి ఇటీవలి కాలంలోనే ఎక్కువగా చొరబాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేకించి అల్లరి మూకలు ఇక్కడికి చేరుకుని తమ హింసాకాండ సాగించేలా , వారికి ఓ విధంగా అన్నింటికీ లైసెన్స్‌లు ఇచ్చినట్లు భావించాల్సి వస్తోందని , తనకు దీనికి సంబంధించి సమాచారం అందిందని మమత తెలిపారు. సరిహద్దుల నుంచి అల్లరిమూకలను ఇక్కడికి రాకుండా చేయాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా? అని ప్రశ్నించారు. బిజెపి అనుసరించే విభజించు పాలించు విధానంలో అంతర్భాగమే వక్ఫ్ చట్టానికి సవరణలు అని, ప్రజలంతా కూడా ఈ విభజన విద్వేషపూరిత చర్యలను తిప్పికొట్టాల్సి ఉందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News