Wednesday, January 22, 2025

బిజెపి బొక్క బోర్లా

- Advertisement -
- Advertisement -

వికటించిన కమలం ఆపరేషన్ ఆకర్ష…

నలుగురు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలుకు కుట్ర

ఎంఎల్‌ఎ రోహిత్‌రెడ్డి ఫౌంహౌస్ కేంద్రంగా మంతనాలు
ఉప్పందించినఎంఎల్‌ఎలు
రెడ్‌హ్యాండెడ్‌గా ముగ్గురు నిందితులను
పట్టుకున్న పోలీసులు
రూ.15కోట్ల నగదు స్వాధీనం
ప్రలోభ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తాం :
సిపి స్టీఫెన్ రవీంద్ర
సిఎంను కలిసిన నలుగురు
టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు
తమను ఎలా ట్రాప్ చేయాలని
చూసారో వివరించిన నేతలు
నందకుమార్ ఎవరో
నాకు తెలియదు : కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ గుట్టు రట్టయింది. అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎంఎల్‌ఎలను డబ్బు సంచులతో ఇతరత్రా ప్రలోభాలకు గురిచేసి తద్వారా ఫిరాయింపులకు తన అనుయాయుల ద్వారా ప్రయత్నించారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఎంఎల్‌ఎలు ఇచ్చిన సమాచారం మేరకు తాము ఫాంహౌజ్‌ను ముట్టడించి బేరసారాలకు ప్రయత్నించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని వి చారిస్తున్నామని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర విలేకరులకు తెలియజేశారు. దాదాపుగా ఒక్కో ఎంఎల్‌ఎకి రూ.100 కోట్లు ఆఫర్ పెట్టిందని తెలుస్తోంది. ఈ బేరసారాల తతంగాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సన్నిహితుడు నందు(డెక్కన్ ఫ్రైడ్ హోటల్ ఓనర్) ఆధ్వర్యంలో నిర్వహించారని చెబుతున్నారు. కాగా ఎంఎల్‌ఎలు ఇచ్చిన సమాచారంతో తెలంగాణ పోలీసులు హైదరాబాద్ శివార్లలోని పివిఆర్ ఫామ్‌హౌస్‌లో దాడులు చేశారు. తెలంగాణ పోలీసు ఆపరేషన్‌లో అనేక కీలక విషయాలు వెలుగుచూశాయి.

డబ్బు కట్టలతో ఫరీదాబాద్‌కు చెందిన సతీష్‌శర్మ అలియాస్ రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజులు స్వామీజీ, నందకుమార్‌లు హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. పూర్తి సాక్ష్యాధారాలతో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు . వీరి టార్గె ట్ లిస్ట్‌లో నలుగురు ఎంఎల్‌ఎలు వున్నారు. టిఆర్‌ఎస్‌కు చెందిన కొందరు ఎంఎల్‌ఎలను కొనుగోలు చేసేందుకు పలువురు రంగంలోకి దిగినట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. పైన పేర్కొన్న నలుగురు వ్యక్తులు ఎంఎల్‌ఎలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్ శివార్లలోని పివిఆర్ ఫామ్‌హౌస్‌లో ఎంఎల్‌ఎలతో బేరాలు జరుగుతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఎంఎల్‌ఎలు ఇచ్చిన సమాచారంతోనే…. సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర

దీనిపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీం ద్ర మీడియాతో మాట్లాడుతూ ఎంఎల్‌ఎలను ప్రలో భ పెడుతున్నారని సమాచారం వచ్చిందన్నారు. రామచంద్రభారతి సంప్రదింపులు చేసినట్లు సమాచారం అందిందని చెప్పారు. నందకుమార్, సింహయాజులు రామచంద్రభారతిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు. పార్టీ ఫిరాయిస్తే పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లుగా తెలుస్తోందన్నారు. టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్‌రెడ్డిలు ఈ సమాచారం ఇచ్చారని, ఫామ్ హౌస్‌లో దాడులు చేశామన్నారు. రామచంద్రభారతి ఫరీదాబాద్ టెంపుల్‌లో వుంటారని సిపి స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. తిరుపతి నుంచి కూడా ఒక స్వామిజీ ఇక్కడికి వచ్చారని ఆయన అన్నారు. రామచంద్రభారతి, సింహయాజులు స్వామీజీ, నందకుమార్‌లను అదుపులోకి తీసుకున్నామని, లీగల్‌గా చర్యలు తీసుకుంటామని సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఆ నలుగురు ఎంఎల్‌ఎలని ఏ రకమైన ప్రలోభాలకు గురిచేశారు.. ఇత్యాది అంశాలపై లోతుగా దర్యాపు చేస్తామని సిపి వెల్లడించారు.

అయితే ముగ్గురు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు ఎరవేసేందుకు ప్రయత్నించినట్లు.. అచ్చంపేట ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజును సంప్రదించారు. పినపాక ఎంఎల్‌ఎ రేగా కాంతారావును సంప్రదించారు. కొల్లాపూర్ ఎంఎల్‌ఎ బీరం హర్షవర్ధన్‌రెడ్డితో డబ్బుతో ఎరవేసే ప్రయత్నం చేశారు. బిజెపి ఎంతో కాలంగా ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరలేపింది. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన ప్రముఖ నేతలకు గాలమేస్తూ వస్తోంది. తెలంగాణలో మరో ఏక్‌నాథ్ షిండే వస్తాడంటూ బిజెపి అగ్రనేతలు పలు సందర్భాల్లో నొకి వక్కాణించారు. అదేస్థాయిలో అధికార టిఆర్‌ఎస్ పార్టీ సైతం అదే స్థాయిలో బిజెపి ‘షిండే’లపై విరుచుకుపడిన సందర్భాలు లేకపోలేదు. దేశ వ్యాప్తంగా అవకాశం ఉన్న చోటల్లా బిజెపి ఇలాంటి బేరసారాలకు తెగబడుతూ ఆయా ప్రభుత్వాలను అస్థిరపర్చి తద్వారా ఆయా రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన సంగతి అందరికీ విదితమే. అయితే దక్షణాదిన అందునా తెలంగాణలో విజయబావుటా ఎగురవేస్తే ఇక తమకు తిరుగుండదని భావించిన బిజెపి పెద్దలు తమదైన శైలిలో పావులు కదుపుతూ వచ్చారు.

ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికకు బిజెపి పెద్దలే వ్యూహరచన చేశారని పలు సందర్భాల్లో అధికార టిఆర్‌ఎస్‌తో పాటు ఇతర విపక్షాలు సైతం బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. ఓ వైపు టిఆర్‌ఎస్ పెద్దలను జైలులో పెడతాం.. ఇడి, సిబిఐ దాడులు నిర్వహిస్తామని పేర్కొంటూనే మరో వైపు చాప కింద నీరులా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. అధికార టిఆర్‌ఎస్ మాత్రం ఎప్పటికప్పుడు బిజెపి కుట్రలను తిప్పికొడుతూ వచ్చింది. ఇదే క్రమంలో తాజాగా అధికార పార్టీకి చెందిన నలుగురు ఎంఎల్‌ఎలు గువ్వల బాలరాజు, హర్షవర్థన్‌రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్‌రెడ్డిలను తన అనుయాయుల ద్వారా బిజెపిలోకి రప్పించేందుకు పెద్ద కుట్రకు ఢిల్లీ బిజెపి పెద్దలు పక్కా ప్రణాళిక వేశారు.

అయితే అధికార పార్టీ ఎంఎల్‌ఎలు ధనానికి, ప్రలోభాలకు లొంగకుండా ఫిరాయింపులకు తెరలేపుతున్న సమయంలో నలుగురు ఎంఎల్‌ఎలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెనువెంటనే తెలంగాణ పోలీసు ఆపరేషన్ చేపట్టి బిజెపి బిగ్ కుట్రను భగ్నం చేసింది. ఉద్యమ పార్టీకి చెందిన తమ నేతలు ఎవరైనా ఇతర పార్టీలోకి వెళ్లబోరని మరోసారి ఆ నలుగురు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు రుజువు చేశారు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చి తద్వారా రాజకీయ లబ్ది పొందాలన్న బిజెపికి ఆదిలోనే హంసపాదు పడినట్లయింది. ఉద్యమ పార్టీని ఎవరూ బెదిరించలేరు.. భయపెట్టలేరన్నది నేటి ఘటనతో తేటతెల్లమైందనే చెప్పవచ్చు. ఈ క్రమంలో బిజెపి తాను తీసిన గోతిలో తానే పడ్డట్టు నిలువునా బొక్కా బోర్లా పడ్డట్టయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News