కోల్‌కతా : రామ నవమి సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు పథకాలు పన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఆరోపించారు. నిరుడు రాష్ట్రంలో రామ నవమి వేడుకలకు దౌర్జన్య సంఘటనల కారణంగా అంతరాయం కలిగింది. బిజెపి, టిఎంసి మధ్య పెద్ద ఎత్తున సంఘర్షణకు అది దారి తీసింది.
మమతా బెనర్జీ ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ.. ‘వారు అల్లర్లకు పాల్పడతారు. దౌర్జన్య సంఘటనలకు అవకాశం ఉన్నది. అల్లర్లు, వోట్ల లూటీ ద్వారా వారు (ఎన్నికల్లో) గెలుస్తారు’ అని ఆరోపించారు. అంతకు ముందు టిఎంసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేడుకల సమయంలో ‘శాంతిని పరిరక్షించవలసిందిగా’ విజ్ఞప్తి చేశారు. బిజెపి దీనిని ఖండించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి భారతీయ, సనాతన సంస్కృతిని కించపరుస్తున్నారని బిజెపి ఆక్షేపించింది.
‘శాంతి పరిరక్షణకు విజ్ఞప్తి చేస్తూ పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇది రామ నవమి ఉత్సవాన్ని కించపరచడమే. మతపరమైన ఇతర సందర్భాల్లో మీరు (మమత) శాంతి సందేశం ఇచ్చారు. కాని ఇక్కడ మీరు శాంతి. సౌభాగ్యాల సందేశంఇవ్వడానికి బదులు‘శాంతి పరిరక్షణ’ను కోరుతున్నారు. అలా చేయడం ద్వారా మీరు భారతీయ, సనాతన సంస్కృతిని కించపరచజూస్తున్నారు’ అని బిజెపి రాజ్యసభ సభ్యుడు, అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది అన్నారు. ఇది ఇలా ఉండగా, టిఎంసి, బిజెపి రెండూ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా రామ నవమి ఊరేగింపులు నిర్వహించాయి.