Saturday, December 21, 2024

హిజాబ్‌పై ఆత్మరక్షణలో బిజెపి!

- Advertisement -
- Advertisement -

BJP controversy on Hijab

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముస్లిం మహిళలు తన పట్ల అభిమానం చూపుతున్నారని, ట్రిపుల్ తలాక్ రద్దు ద్వారా తమకు విముక్తి కలిగించానని సంతోషంగా ఉన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పుకొంటూ వచ్చారు. గత ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికలలో ముస్లిం ఓట్లు తమకు అవసరం లేదని అంటూ పలువురు బిజెపి నాయకులు బహిరంగానే చెప్పుకొచ్చారు.
ఉత్తర ప్రదేశ్ లో సహితం 8020 నినాదంతో పరోక్షంగా తనకు ముస్లిం ఓట్లు అవసరం లేదని అంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంకేతం ఇస్తున్నారు. ఆ విధంగా చెప్పడం ద్వారా కులాలవారీగా ఓట్లు వేస్తున్న హిందువులను ఒక్కటిగా చేసి, గంపగుత్తుగా ఓట్లు పొందడమే బిజెపి నాయకుల లక్ష్యంగా కనిపిస్తున్నది.
గత ఏడేళ్లుగా ఎన్నికలలో బిజెపి అఖండ విజయం సాధిస్తూ వస్తున్నా మూడొంతులకు మించి ఓట్లు పొందలేక పోవడం గమనార్హం. ప్రతిపక్షాలు విడిపోవడం, ఒక్కటిగా పోటీచేయక పోవడం బిజెపికి కలసి వస్తున్నది. బలమైన అధికార, ప్రతిపక్షాలున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఎంతగా ప్రయత్నించినా రాజకీయంగా నిలదొక్కుకోలేక పోతున్నది. అందుకనే ప్రతిపక్షాలు ఒక వేదికమీదకు రావడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నా బిజెపి ఖంగారు పడుతూ వస్తున్నది. కేవలం ప్రధాని మోదీ మాత్రం దేశ జనాభాలో 20 శాతంగా ఉన్న ముస్లిం ఓటర్లను మొత్తంగా కోల్పోవడం ప్రమాదకరమని గ్రహించి, ముస్లిం మహిళల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
హిందువులు, ముస్లింల డిఎన్‌ఎ ఒక్కటే అంటూ ముస్లింలలో కొన్ని వర్గాల మద్దతు కోసం ఆర్ ఎస్ ఎస్ అధినేత డా. మోహన్ భగవత్ సహితం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో తలెత్తిన హిజాబ్ వివాదం బిజెపిని ఒక విధంగా ఆత్మరక్షణలో పడవేసిన్నట్లు కనిపిస్తున్నది.
కర్ణాటకలో కొన్ని కళాశాలలో ప్రారంభమైన హిజాబ్ వివాదం జాతీయ స్థాయికి చేరుకోవడంతో తొలుత హిందూ – ముస్లిం విభజనకు దారితీసి, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో రాజకీయంగా లబ్ధిపొందవచ్చని కొందరు బిజెపి నాయకులు భావించారు. సోషల్ మీడియాలో, ఇతరత్రా హిజాబ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
యోగి ఆదిత్యనాథ్, ప్రజ్ఞా ఠాకూర్ వంటి నేతలు వివాదాస్పద ప్రకటనలు కూడా చేశారు. అయితే బిజెపి ముస్లిం మహిళలకు వ్యతిరేకం అనే సంకేతం ఈ వివాదం ఇచ్చే ప్రమాదం ఉన్నట్లు ఆలస్యంగా గ్రహించినట్లు కనిపిస్తున్నది. పైగా,ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలో పొందిన సానుభూతిని దూరం చేసుకొనే ప్రమాదం ఉన్నదనే ఆందోళనలో పడినట్లు కనిపిస్తున్నది. అందుకనే ఇప్పుడు దిద్దుబాటు చర్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది.
బిజెపి ముస్లిం మహిళలకు వ్యతిరేకం కాదనే స్పష్టమైన సందేశం వారికి ఇవ్వాలని బిజెపి నాయకత్వం కర్ణాటకలోని తమ పార్టీ నేతలకు ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది. వస్త్ర ధారణకు సంబంధించిన నిబంధనలను ఆయా విద్యా సంస్థలకే వదిలిపెట్టినట్లు వివరంగా చెప్పాలని కోరింది. సుపరిపాలన ద్వారా కాకుండా ఉద్వేగాలతో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్న బిజెపి నాయకత్వం ఒక విధంగా ఇప్పుడు సంకట పరిస్థితుల్లో చిక్కుకొన్నదని చెప్పవచ్చు.
వాస్తవానికి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఈ విషయమై మొదటి నుండి సంయమనం పాటిస్తూ వస్తున్నది. రాష్ట్ర హైకోర్టు నిర్ణయానికి వదిలేస్తున్నామని, కోర్ట్ తీర్పు ప్రకారం నడుచుకొంటామని, అప్పటి వరకు సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బ్మొ విజ్ఞప్తి చేశారు.
యూనిఫాం డ్రెస్ కోడ్‌ను పాటించడానికి ఇష్టపడని విద్యార్థులు ఇతర ఎంపికలను చేసుకొనే స్వేచ్ఛ ఉందని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ కూడా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 75 వేల హైస్కూళ్లు, కళాశాలల్లో కేవలం ఎనిమిదిలో మాత్రమే హిజాబ్ వివాదం ఏర్పడిందని అంటూ సమస్యను తక్కువగా చేసి చూపే ప్రయత్నం చేశారు.ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కాగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
పైగా, నగేష్ ముస్లిం శాసనసభ్యులతో సమావేశమై ముస్లిం బాలికలు తరగతుల్లో హిజాబ్ , ఇతర మతపరమైన దుస్తులను తాత్కాలికంగా నిషేధించిన హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి తరగతి గదులకు తిరిగి వచ్చే విధంగా చేసే ప్రయత్నం చేశారు.
యూనిఫామ్ డ్రెస్ విధానంలో సవరణలు అవసరం. ప్రస్తుతం పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. కొత్త విధానంను తీసుకురావడానికి హైకోర్టు ఆదేశం కోసం మేము వేచి ఉంటాము అని నగేష్ వారికి చెప్పారు.
మరోవంక, కాశ్మీర్ లోయలో రాజకీయంగా పట్టుకోసం, ముఖ్యంగా ముస్లింలలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న బిజెపికి ఈ వివాదం ఇబ్బందికరంగా మారింది. జమ్మూ కాశ్మీర్ లో అయితే ఆ పార్టీ నేతలు హిజాబ్ కు స్పష్టమైన మడ్దతు తెలుపుతూ వస్తున్నారు. పైగా, వివాదానికి పాల్పడిన వారిని శిక్షించాలని వారు కోరుతున్నారు. సిక్కులు తలపాగాలు కలిగి ఉంటే, ప్రతి ఒక్కరూ దానితో సౌకర్యవంతంగా ఉంటే, ఎవరైనా ముస్లిం అమ్మాయిలతో హిజాబ్‌తో ఎందుకు సమస్యలను కలిగి ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక హైకోర్టులో హిజాబ్ కు మద్దతుగా న్యాయవాదులు వినిపిస్తున్నటువంటి వాదనలను కాశ్మీర్ లో బిజెపి మహిళా నేతలు వినిపిస్తుండడం గమనార్హం.
దుపట్టాతో తల కప్పుకుని, కర్ణాటకలో ఏం జరిగినా తాను ఖండిస్తున్నానని జమ్మూ కాశ్మీర్ బిజెపి నాయకురాలు దరక్షణ్ ఆంద్రాబీ స్పష్టం చేశారు. అమ్మాయిలు హిజాబ్‌లో ఉండడాన్ని నేను ఎందుకు ఖండించాలి? నేను ఎప్పుడూ హిజాబ్‌లోనే ఉంటాను. హిజాబ్ తప్పు కాదు. తల్లి సీతమ్మ కూడా తలపై దుప్పట్టా పెట్టుకుంది. దీన్ని హిందూ, ముస్లిం సమస్యగా మార్చకూడదు” అని ఆమె హితవు చెప్పారు. ఆమె బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు కాకుండా, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యురాలు కూడా.
హిజాబ్ ధరించిన ఒక అమ్మాయి నడుస్తోంది. అబ్బాయిలు జై శ్రీరామ్ అని అరిచారు. వో బచ్చోన్ కా ఖేల్ థా (అది పిల్లల ఆట). పార్టీకి దానితో సంబంధం లేదు. ఇందులో పార్టీకి చెందిన వారు ఎవరూ లేరు’ అని ఆమె చెప్పారు. ఖాదీ అండ్ విలేజ్ బోర్డ్ వైస్ చైర్‌పర్సన్ కూడా అయిన బీజేపీ నాయకురాలు హీనా భట్ కూడా ఇదే మాట అన్నారు. ఏది వేసుకోవాలో, వేసుకోకూడదో ఎలాంటి విధివిధానాలు ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు.
ఒక వ్యక్తి ఏమి ధరించాలనుకుంటున్నాడో లేదో అతనికే వదిలేద్దాం. అతను హిజాబ్ ధరించాలా వద్దా అనేది వ్యక్తిగత ఎంపిక. నేను ఎలాంటి విధింపునకు వ్యతిరేకం అని ఆమె చెప్పింది. ఆంద్రాబీ, భట్ ఇద్దరూ తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసేటప్పుడు హిజాబ్‌లో ఉన్న చిత్రాలను ప్రదర్శించారు.
ఇంతగా రసాభాస జరుగుతున్నా బిజెపి జాతీయ నాయకత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ఇప్పటివరకు స్పందించక పోవడం గమనిస్తే వారు అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తున్నది. విధానపరమైన పక్షవాతం వ్యక్తం అవుతున్నది.
చలసాని నరేంద్ర

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News