రాజ్యసభకు జరిగే ఉప ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానా నుంచి పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థులను సోమవారం బీజేపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్.కృష్ణయ్య, ఒడిశా నుంచి సుజీత్‌కుమార్, హర్యానా నుంచి రేఖాశర్మ బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం రాజ్యసభకు ఉప ఎన్నికలు డిసెంబర్ 20 న నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా , పశ్చిమబెంగాల్, హర్యానా నుంచి ఆరుగురు సభ్యులను రాజ్యసభకు ఎంపిక చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌నుంచి 3 సీట్లు, ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానా నుంచి ఒక్కో సీటు ఖాళీగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపీలను రాజ్యసభకు పంపాల్సి ఉంది. వైఎస్‌ఆర్ సిపికి చెందిన ఎంపీలు ముగ్గురు రాజీనామా చేయడంతో ఆ మూడు స్థానాలకు ఎన్నిక అనివార్యమైంది. ఈ మూడు స్ధానాలను టిడిపి గెలుచుకుంటుందని భావిస్తున్నారు. ఒడిశాలో బిజు జనతాదళ్ (బీజేడీ) ఎంపీ సుజీత్‌కుమార్ రాజ్యసభకు రాజీనామా చేశారు. బీజేపీ ఈ సీటును గెలుచుకునే అవకాశం ఉంది. పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన జవహర్ సర్కార్ రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో ఈ సీటును టీఎంసీ సునాయాసంగా గెలుచుకుంటుందని చెబుతున్నారు. హర్యానాలో అధికార బీజేపీకి చెందిన కృష్ణలాల్ పన్వర్ రాజ్యసభ సీటుకు రాజీనామా చేశారు. ఈ సీటును బీజేపీ తిరిగి నిలబెట్టుకోనున్నది.