ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బిజెపి పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఏదో మొహం చూపు కొనేందుకు అసోంలో ఫలితాలు కొద్ది మెరుగ్గా వచ్చాయి. గత కొంత కాలంగా బిజెపి పార్టీ కొంత విర్రవీగుతూ వస్తున్నది. మొత్తం భారతదేశాన్నంతా స్వాధీనంలో వుంచు కోవాలన్న దాని తపన, దురాశలు ఈ ఎన్నికల్లో పఠాపంచలయ్యాయి. అధికారంలో వున్న బిజెపియేతర పార్టీల్ని ఎలాగైనా గద్దె దించాలని కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ వస్తున్నది. తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల పట్ల వివక్షత చూపుతున్నది.
ఎన్నికల వేళ సామ, ధాన దండోపాయాల్ని సహితం ప్రయోగిస్తున్నది. పశ్చిమ బెంగాల్‌లో మమత పైన, తెలంగాణలో కెసిఆర్ పైన, ఆంధ్రపద్రేశలో జగన్ పైన ఇదే మాదిరి వివక్షత, సహాయ నిరాకరణ చేస్తుండడం మనందరం చూశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీవైనా పరస్పరం సహకరించే ధోరణిలో వెళ్ళాలి. అదే ప్రజాస్వామ్య గీతిక. మరి ఆ సిద్ధాంతానికి పూర్తిగా తిలోదకాలిచ్చి భారతదేశాన్ని ఏలాలనుకోవడం దుర్మార్గం. ఒకప్పుడు ఇందిరా గాంధీ ఇలాంటి ధోరణితోనే ప్రవర్తించేది. రాత్రికి రాత్రి సీయంలను మార్చేసేది. అత్యధిక మెజారిటీతో అధికారానికొచ్చిన ఎన్.టి రామారావు ప్రభుత్వాన్ని కూడా గవర్నర్ రామ్ లాల్ ద్వారా భర్తరఫ్ చేయించడం కూడా ఆమె రాజకీయ జీవితంలో మాయని మచ్చగానే మిగిలిపోయింది. బిజెపి కూడా అదే ధోరణిలో వెళ్తుండడం దురదృష్టకరం. ఈ ధోరణి, ఈ తీరు మార్చుకోక పోతే బిజెపికి గడ్డు రోజులే.
కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికల్ని వాయిదా వేయించేందుకు ప్రయత్నించాల్సిన బిజెపి ఎన్నికల నిర్వహణకే అత్యుత్సాహం ప్రదర్శించింది. ఎన్నికల కమిషనను అనధికారికంగా కేంద్రం తన గుప్పిట్లో వుంచుకొందన్న ఆరోపణల్లో ఎంతో వాస్తవం కన్పిస్తున్నది. పశ్చిమ బెంగాల్, కేరళలో బిజెపి వింత ధోరణిల్ని ప్రదర్శించింది. పశ్చిమ బెంగాల్‌లో మమతకు కుడి భుజంగా వున్న సువేంధు అధికారిని, ఇంకా చాలా మంది ఆమె పార్టీలోని కీలక నేతల్ని, ఎమ్మెల్యేల్ని ఎన్నికల ముందు తమ పార్టీలోకి లాగేసుకోవడం దృష్ట క్రీడే. ఒక మహిళని గద్దె దించేందుకు అన్ని రకాలైన పాచికల్ని బిజెపి విసిరింది. మోడీ, అమిత్ షా బెంగాల్‌లో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు.
5 దఫాల్లో జరగాల్సిన ఎన్నికల్ని 8 దశల్లో జరిగేలా యుక్తి పన్నారు. సిబిఐ కేసులంటూ దీదీ మేనల్లుణ్ణి ఎన్నికల ముందు హింసించారు. మీడియాను లోబర్చుకొని ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం అనేలా హైప్ సృష్టించారు. చివరికి ఆమె కారుపై దాడులు కూడా చేయించారట. అది కూడా ఆమె గెలుపునకు ఎంతో తోడ్పడింది. వీల్ చైర్ లోనే ఆమె ప్రచారం మొత్తం సాగింది. అది బెంగాల్ మహిళల్లో ఎక్కువగా మమత పట్ల సానుభూతిని తీసుకొచ్చింది. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి చెందుతుందని ప్రకటించారు. కానీ ఎన్నికల ఫలితాలు ఆ సర్వే నిర్వాహకుల అంచనాలను దెబ్బ తీశాయి.
మమత 213 గతం కన్న ఎక్కువ స్థానాలతో విజయభేరి మ్రోగించింది.
ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కబోతుంది. ఒడిశాలో నవీన్ పట్నాయకకు ఇలాంటి విజయమే వరిస్తున్నది. నందిగ్రాం ఎన్నికల ఫలితం కూడా దేశంలో గందరగోళానికి తెర లేపింది. చివరి రౌండ్ కౌటింగ్‌లో మమత 1200 ఓట్లతో గెలిచిందని దేశంలోని అన్ని టివి ఛానల్స్ ప్రకటించాయి. ఏం జరగిందో ఏమో సాయంత్రం 7 గం.కు మమత ఓటమి చెందిందన్నారు. మమత మాత్రం తాను ఓటమి చెందలేదని, బిజెపి పార్టీ ఎన్నికల కమిషనను తన గుప్పిట్లో వుంచుకొని ఆడిస్తున్న నాటకమని, న్యాయపరంగా పోరా టం చేస్తానని ప్రకటించింది.ఇంత గందర గోళం సామాన్యుణ్ణి కూడా అనుమానంలో పడేసింది. ఎక్కువ మంది విశ్లేషకులు కూడా ఇది కుట్రగానే పేర్కొన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకొన్న బిజెపి ఈసారి కూడా వెస్ట్ బెంగాల్‌లో ఘనవిజయం సాధించి అధికారాన్ని చేపడతాం అని అతి విశ్వాసాన్ని పెట్టుకొన్నారు. ఏడాది పాటుగా ఎన్నికల గెలుపు వ్యూహాల్ని రచిస్తూనే వచ్చారు.
బిజెపి పార్టీలో అపర చాణుక్యుడని పేరు తెచ్చుకొన్న అమిత్ షా ఈ ఎన్నికల్లో కుదేలయ్యాడు. ఆయన అంచనాలు తలక్రిందులై అధికారాన్ని చేపట్టలేకపోయాడు.
కుట్రలు, కుతంత్రాలతో కాకుండా పశ్చిమ బెంగాల్ ప్రజల మనసుల్ని గెలవగలిగి వుంటే తప్పక విజయం సాధించేవారు. మమత కూడా మరోసారి ‘బెంగాల్ టైగర్’ అన్న పేరు సార్థకత చేసుకొంది. మొదటి నుండి పోరాటమే ఆమె బలం. మూడు దశాబ్దాల పాటు అధికారాన్నేలిన వామపక్షాలు ఆమెను నానా హింసలకు, అవమానాలకు గురిచేశారు. వారి అణచివేతే ఆమెను ఒక మహానాయకురాల్ని చేసింది. కాంగ్రెస్‌ను వీడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి, తిరుగులేని శక్తిగా ఎదిగింది. బిజెపి ఎత్తుగడలు చూసి ఈ ఎన్నికల్లో మమత కాస్తా కలత చెందడం వాస్తవమే. బిజెపి భయం వల్ల జాతీయ పార్టీల నాయకులెవరూ కూడా ఆమెకు ఈ ఎన్నికల్లో అండగా నిలవలేదు. అప్పట్లో మమత చేయి పట్టుకొని తిరిగిన చంద్రబాబు కూడా ఈ సారి ఆమెకు కనీసం ఫోన్ అయినా చేయలేదు. అందరు వదిలేసినా, రుద్రమదేవిలా, కలకత్తా ఖాళీలా విజృంభించి విజయం సాధించింది. ఈ విజయం ఆమెకు అంత సునాయాసంగా వచ్చింది కాదన్నది జగమెరిగిన సత్యం.
ఆడ పులితో యుద్ధం చేయలేక బిజెపి చివరికి చతికిలపడింది. అంతకాలం వెస్ట్ బెంగాల్‌లో ఆధిపత్యాన్ని చెలాయించిన లెఫ్ట్, కాంగ్రెస్ కూటమి ఈ సారి ఫలితాల్లో ఎక్కడా కనిపించలేదు. ఎర్ర పతంగులు ఎగరలేకపోయాయి.వాటికి కాలం చెల్లింది. దేశ పటం లో ఒక కేరళ రాష్ట్రంలోనే ఆ పార్టీ జీవం పోసుకొంది. బిజెపి పార్టీ కేరళలో అధికార పార్టీ అయి న లెఫ్ట్ కూటమిని కూడా గద్దె దించాలని రకరకాల కుట్రలు చేశారు. చివరికి ఆ ముఖ్యమంత్రి విజయన్ బంగారు స్మగ్లింగ్ కేసులో కూడా ఇరికించి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. అయి నా అక్కడా బిజెపి బొక్కబోర్ల పడింది. వారికి గెలుపు కలగానే మిగిలిపోయింది. కేరళ ఓటర్లు చైతన్యవంతులు అక్షర శాతం కూడా 100కు వంద. అందుకే విజయన్‌కే తిరిగి పట్టం కట్టారు. మెట్రో శ్రీధరన్ ఎంతో పేరు ప్రతిష్ఠలు గడించినా బిజెపి తరఫున పోటీ చేయడం వల్ల కేరళ ప్రజలు ఓడించారు. 8 పదుల వయసులో శ్రీధరన్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అధికారంలో వున్న బిజెపి పార్టీ చాలా మందికి స్వర్గంలానే కన్పిస్తుంది. అది చివరకు ఏడారిలో ఓయాసిస్ అని అనుభవంతో తెలుస్తోంది.
ఇక తమిళనాడు విశ్లేషణ కొస్తే ఇక్కడ డి.ఎం.కె, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఎన్నికల్లో విజయాన్ని సాధించాయి. డి.ఎం.కె పార్టీ నుండి కరుణానిధి కుమారుడు స్టాలిన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఒకప్పుడు కరుణానిధి, జయలలిత మధ్య సూరాసూరీ యుద్ధం జరిగేది. ఈ రోజు వారిద్దరూ జీవించిలేరు. ఇక్కడ కూడా బిజెపి అన్నా డిఎంకెతో పొత్తు పెట్టుకొని ఇక్కడ ఎలాగైనా తమిళనాడులో అధికారంలో అడుగు పెట్టాలని వ్యూహం పన్నింది. చివరికి అది కూడా బెడిసి కొట్టింది. కాకుంటే ఊహించిన దానికన్నా అన్నా డిఎంకే ఇక్కడ కాస్తా ఘనవిజయాన్నే సాధించగల్గింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య వున్న విభేదాలు అన్నా డి.ఎం.కె కొంప ముంచుతాయని అందరూ అనుకొన్నారు. కానీ అందరి ఊహల్ని తలక్రిందులు చేస్తూ ఈ పార్టీ కూడా 70 స్థానాలకు పైగా గెలుచుకొని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా నిలబడ గల్గింది. అది కాస్తా బెటరే. బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్లే అన్నా డి.ఎం.కె నష్ట పోయిందని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. అన్నా డి.ఎం.కె తోకగా పైకి ఎగరాలనుకొన్న బిజెపి వ్యూహం తుస్ మనింది. ఛరిస్మా వున్న నాయకుడిగా స్టాలిన్ విజేతగా నిలవగలిగాడు. మళ్ళీ డి.ఎం.కె శకం ఆరంభమైందేమో! పాండిచ్చేరి అధికార కాంగ్రెస్ పార్టీని అస్థిర పరచడంలో కూడా బిజెపి అనేక దుష్టచర్యలకు పాల్పడింది. ఇక్కడ మాత్రం ఆ పార్టీకి కాస్తా లాభం జరిగి అధికారానికి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ కూడా ఇక్కడ అంత బలహీనంగా అయితే లేదు.
ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక టిఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ అత్యధిక మెజార్టీ తీసుకొచ్చాయి. తండ్రి నోముల నర్సింహయ్య కున్న ప్రజాబలం టిఆర్‌ఎస్ నాయకుడు కెసిఆర్‌కున్న ఛరిస్మా రెండూ కలిసి నోముల భగత్‌కు 18 వేలకు పైగా మెజారినీ తీసుకొచ్చాయి. దాదాపు గెలిచేస్తామన్న రాద్ధాంతం, ప్రచారం చేసుకొన్న బిజెపి పార్టీ ఇక్కడ పూర్తిగా ఊబిలో పడిపోయింది. చివరికి డిపాజిట్ కూడా దక్కకపోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బె. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన బిజెపి పార్టీ నాయకుల నోటికి అడ్డు, అదుపు లేకుండాపోయాయి. పాలక ప్రభుత్వ లోపాల్ని ఎత్తి చూపడంపోయి, కెసిఆర్‌ని తిట్టడమే ఆ పార్టీ పనిగట్టుకొని ప్రచారం చేసుకొంది. చివరికి చతికిలపడింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్, ఎంతో కొంత ప్రజాభిమానం పొందిన జానారెడ్డి ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలుస్తారని అందరూ ఊహించారు అలాగే జరిగింది.
కెసిఆర్ పై తెలంగాణ ప్రజలకు విశ్వాసం సన్నగిల్లనంత కాలం టిఆర్‌ఎస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా నోముల నర్సింహయ్యకు 7771 ఓట్లు మెజారిటీ వస్తే, నోముల కొడుకు భగత్‌కు ఈ రోజు 18 వేలకు పైగా మెజారిటీ రావడం కెసిఆర్ ఛరిస్మా ఇంకా పెరిగిందని చెప్పడానికి నిదర్శనం టిఆర్‌ఎస్ పార్టీపై అ పార్టీ నాయకుడు కెసిఆర్ పై ఇంకా ప్రజల్లో విశ్వాసం సడల లేదు. అంత ప్రజావ్యతిరేక ముద్ర కూడా ఆయన పాలనపై లేదు. నాగార్జున సాగర్‌లో నిద్రాహారాలు మాని ప్రచారం చేసినా పెద్దాయన జానారెడ్డికి ఓటమి కాటు తప్పలేదు. ఇకనైనా బిజెపి నాయకులు ధోరణిలో కొత్త పద్ధ్దతి అనుసరిస్తే మంచిది. కాంగ్రెస్ పార్టీకి పడ్డ ఓట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పడినవి కావు. అవి కేవలం జానారెడ్డి వ్యక్తిత్వం చూసి వేసిన ఓట్లే. ఇప్పట్లో కాంగ్రెస్ , బిజెపి పార్టీలకు తెలంగాణలో ‘వెలుగు’ కన్పించడం కష్టమే.
ఇక తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ఫలితం ఇక్కడ వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 2,70 లక్షల భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ్నించి వైసిపి అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాద్ రెండు లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయన ఆకస్మిక మరణంతో ఇక్కడ ఎన్నిక జరిగింది. (ఇటీవల జరిగిన పంచాయితీ, నగర పాలక పోరులో వైసిపి విజయ దుందుభి మ్రోగించింది. 80 శాతం సీట్లు వైసిపి కైవసం చేసుకొని విజయపథంలో దూసుకెళ్తున్నది. ఈ సారి తిరుపతి బాధ్యత టిటిడి, అధ్యక్షుడు సుబ్బారెడ్డి, జిల్లా పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్ది రెడ్డి భుజస్కంధాలపై గెలుపు బాధ్యత ఉంచారు. ఈ సీటు గెలిచేందుకు తెలుగుదేశం, బిజెపి పార్టీలు సర్వశక్తులూ వొడ్డి పోరాడాయి. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు వారం రోజుల పాటు ఎండ వేడిమి భరిస్తూ విస్తృతంగా ప్రచారం చేశాడు.
జగన్‌ను ఓ దుర్మార్గపు వ్యక్తిగా, రాక్షసుడిగా అభివర్ణిస్తూ ప్రచారం సాగించాడు. చివరికి ఎవరో రాయి విసిరారని నానా రాద్ధాంతం చేశాడు. ధర్నా కూడా చేశాడు. పోలింగ్ రోజున తిరుపతి అసెంబ్లీలో ఆ పార్టీ ఆడిన నాటకం అంతా ఇంత కాదు. దొంగ ఓట్లు, దొంగ బస్సు అంటూ గగ్గోలుపెట్టారు. తెలుగుదేశానికి చెంది న నాయకులంతా ఇక్కడే తిష్ఠ వేసి వ్యూహాల్ని రచించారు. అయినా ఫలితం దక్కలేదు. జగన్ సంక్షేమ పాలనకు ప్రజలు జయసూ అన్నారు. చివరికి వైసిపికి మెజారిటీ అయినా తగ్గించాలని కూడా టిడిపి వారు విఫల ప్రయత్నం చేశారు. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు తాడే పామై కాటేస్తుందంటారు.
చంద్రబాబు పరిస్థితి అచ్చం అలాగే వుంది. ఈ రోజు ఎక్కడా ఈ పార్టీకి గెలుపు జాడే కనపడడం లేదు. పంచాయతీలు, నగరపాలక సంస్థలు అన్ని ఎన్నికల్లోనూ ఘోరం గా ఓటమే. ఓట్ల శాతం కూడా గణనీయంగా తగ్గిపోతూ వస్తుంది. ఆ పార్టీ నాయకులిప్పుడు పూర్తి వైరాగ్యంలో మునిగిపోయారు. భవిష్యత్తుపై వాళ్ళలో ఎలాంటి ఆశ కనిపించడం లేదు. ఆ పార్టీ ఖేల్ ఖతం అని విమర్శకులు ఎత్తి పొడుస్తున్నారు. 7 పదుల వయసులో కూడా చంద్రబాబు అలుపెరగని ఆశనిరాశల పోరాటం చేస్తున్నాడు. ‘అది ఓటు పడవని తెలుసు, ఇది సూరు గాలని తెలుసు అయినా పడవ ప్రయాణం’ పాటలా సాగుతోంది ఆయన శేషజీవితం. బెంగాల్‌లో లెఫ్ట్ పార్టీల శకం ముగిసినట్లే, తెలు గు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ శకం ముగిసిందనిపిస్తుంది.
ఆయన ఆకాశంలోని చుక్కలు వెలుగిస్తాయని భ్రమ పడుతున్నాడు. ఇక బిజెపి, జనసేన కూటమి కూడా కుప్పకూలింది. కూటమి తరఫున రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారిణి రత్నప్రభను అభ్యర్థిగా నిలిపారు. బ్యూరోక్రాటు పెద్దగా ప్రజా సంబంధాలుండవు అందులోనూ ప్రజలకు కానీ, పార్టీకి కానీ ఈమె కొత్త. బిజెపి నాయకులంతా నెల రోజులుగా తిరుపతిలో వుంటూ ఎన్నికల యుద్ధానికి కత్తులు పదును పెడుతూ కూర్చున్నారు. పవన్ కళ్యాన్‌ను ప్రచారంలో దింపి ఆశలు పెట్టుకొన్నారు. చివరికి పవన్ కళ్యాణ్‌కు కరోనా దక్కిందే కానీ, ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. పవిత్ర పుణ్యక్షేత్రంలో హిందూత్వ కార్డును ప్రయోగించినా ఫలితాల్లో గుండుసున్నా దక్కింది.
డిపాజిట్లు కూడా దక్కించుకోని ఈ పార్టీ 2023 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారానికొస్తామని కలలు కంటోంది. ఇప్పటికైనా కొత్త వ్యూహంతో కదుల్తారని ఆశి ద్దాం. జగన్ పై పూర్తి ప్రజా వ్యతిరేకత వచ్చిన రోజే ఈ పార్టీకి ‘దీపావళి’ అంత వరకు నేల విడచి సాము చేయడమే! అంత పెద్ద జాతీయ పార్టీ ఈ రోజు పవన్ నీడన ఎదగాలనుకోవడం ఆశ్చర్యం కల్గిస్తుంది. మరి పవన్ ఏమంటాడో చూడాలి! పవన్ కళ్యాణ్ పరిస్థితే నేడు తమిళనాడులో కమలహాసనకు దాపురించింది.చతురుడు, ముందుచూపు వున్నవాడు కనుకే రజినీకాంత్ ఆదిలోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాడు. నటులందరికీ ఆయన ఆదర్శం. కమల్ పార్టీ కాదుగద తానే గెలవలేకపోయాడు. దేశంలో పరిస్థిలు చాలా డేంజర్‌గా వున్నాయి. ఎక్కడ చూసినా కరోనా మరణలే ఆక్సిజన్ అందక వేలాది మంది ప్రాణాలు హరీ అంటున్నాయి. మొదటి దఫా మోడీ కరోనా కట్టడికి ఎన్నో కఠిన చర్యలు తీసుకొని అందరితో శభాష్ అనిపించుకున్నాడు.
ఈ రెండవ వేవ్ లో మోడీ పూర్తిగా వైఫల్యం చెందాడు. కట్టడులన్నిటికీ గేట్లు తెరిచేశాడు. భారతదేశం అల్లకల్లోలమై పోయింది. రోజుకు దాదాపు 4 లక్షల మంది కరోనా బారినపడుతున్నారు. రోజుకు 4 వేల మందికి పైగా మరణిస్తున్నారు. ఘోరకలిని అరికట్టడానికి మోడీ చేతులు ముడుచుక కూర్చొన్నారు. ఆ పార్టీ గ్రాఫ్ పూర్తి గా పడిపోయింది. రానురాను ప్రాంతీయ పార్టీల కూటమి బలపడుతున్నది. టి.ఎం.సి, వై.సి.పి, టి.ఆర్.ఎస్, డి.ఎం.కె. బిజు జనతాదళ్ లాంటి పార్టీలన్నీ కలసి జత కట్టే సూచనలు కన్పిస్తున్నాయి. కరోనాకు తోడు దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రైవేటీకరణ నేపథ్యం కూడా బిజెపి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తీసుకోస్తున్నది. బిజెపి అపజయాలన్నింటినీ సమీక్షించుకొని, కొత్త వ్యూహాలతో సరికొత్త మార్గాన పయనించకుంటే భవిష్యత్ అంధకారంలో పడుతుంది. ప్రజా బలంతో నెగ్గిన పార్టీల పాలకుల్ని కదపకండి. గిల్లి కజ్జాలు పెట్టుకోకండి. సహకార ప్రాతిపదికన పని చేయండి ఇదే బిజెపి కి నేనిచ్చే సూచనలు. ఓటమిని గౌరవంగా స్వీకరించి తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లోని నూతన ప్రభుత్వాలకు పూర్తి సహాయ సహకారాలందీయాలి. అప్పుడే జయాల్ని వరిస్తారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల తీర్పు బిజెపి పార్టీకి పెద్ద గుణపాఠమే! వ్యాసం పూర్తి అయ్యే సరికి ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్‌లో కూడా టిఆర్‌ఎస్ విజయ భేరి మోగించింది. హ్యాట్సాఫ్ కెసిఆర్.!
సమ్మెట విజయ్ కుమార్
8886381999