Friday, November 15, 2024

ఒట్టు గట్టు మీద పెట్టి..

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ఆయారామ్ గయారామ్‌ల హర్యానాను మించిపోయి కప్పల తక్కెడగా మారిన గోవాలో బుధవారం నాడు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు పాలక బిజెపిలో చేరిపోయిన ఘట్టం ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే కేంద్రంలోని బిజెపి పాలకులు ప్రజాస్వామిక నీతి నియమాలకు, ప్రజల తీర్పును గౌరవించడమనే పద్ధతికి ఏనాడో స్వస్తి చెప్పారు. ఫిరాయింపులను ప్రోత్సహించి అవతలి పార్టీల ఎంఎల్‌ఎలను కొనుగోలు చేసి రాష్ట్రాల్లో అధికారాన్ని అడ్డదారిలో చేజిక్కించుకునే క్రీడను విచ్చలవిడిగా సాగిస్తున్నారు.

గుండె మార్పిడికైనా సౌకర్యాలు వున్నాయి గాని, రాజకీయ ఫిరాయింపుల జాడ్యానికి మాత్రం మందు కనిపించడం లేదని బిజెపి అగ్ర నాయకులు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ 2003లో అన్నారు. 2014లో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలోని తన ఆధిపత్యాన్ని ఉపయోగించి ఏడు రాష్ట్రాల్లో ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వాలను కూల్చింది. అక్కడ అధికారాన్ని అక్రమంగా చేజిక్కించుకున్నది. ఈ వరుసలో చివరిగా ఇటీవల మహారాష్ట్రలో శివసేన నుంచి భారీ ఎత్తు ఫిరాయింపులు జరిపించి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూలదోసింది. ఆ విధంగా అక్కడ తన కీలుబొమ్మ ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో శివసేన బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు గోవాలో తానే అధికారంలో వున్నప్పటికీ బలాన్ని పెంచుకోడానికి, కాంగ్రెస్‌కు తన తడాఖా చూపించడానికి తాజా ఫిరాయింపు పర్వాన్ని జరిపించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న సమయంలో కాంగ్రెస్‌కు చోడో భారత్ అని చెప్పడానికే గోవాలో బిజెపి ఈ ఘట్టాన్ని జరిపించిందని బోధపడుతున్నది.

గోవా అసెంబ్లీలో మొత్తం 40 మంది సభ్యులున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో బిజెపి 20 స్థానాలు, కాంగ్రెస్ 11, గోవా ఫార్వర్డ్ పార్టీ 1, ఆమ్‌ఆద్మీ పార్టీ 2, మహారాష్ట్ర గోమంతక్ వాదీ పార్టీ 2, రివెల్యూషనరీ గోవన్స్ పార్టీ 1, ఇండిపెండెంట్లు 3 స్థానాలను గెలుచుకున్నారు. ఫిరాయింపుల చట్టం ప్రకారం శాసన సభా పక్షంలోని మూడింట రెండొంతుల మంది ఎంఎల్‌ఎలు పార్టీని వీడిపోతే అది చట్టబద్ధమవుతుంది. ఈ సంఖ్యను సాధించుకోడానికి బిజెపి గత జులైలోనే కుట్రను ప్రారంభించింది. అప్పుడు గోవా కాంగ్రెస్‌లో అగ్రనేతలుగా వున్న మైఖేల్ లోబో (ప్రతిపక్ష నాయకుడు), దిగంబర్ కామత్ (మాజీ ముఖ్యమంత్రి) లనే బిజెపి బుట్టలో వేసుకొన్నది. లోబో మరో శాసన సభ్యురాలైన తన భార్యతో కలిసి ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నివాసానికి వెళ్లడంతో కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం ఫిరాయింపుల వాసనను పసిగట్టి అడ్డుకట్ట వేయగలిగింది. మహారాష్ట్రలో మాదిరి బిజెపి కుట్రను గోవాలో ఈసారి అరికట్టగలిగామని కాంగ్రెస్ అప్పుడు జబ్బలు చరుచుకున్నది.

అప్పుడు మొదలైన బిజెపి కుట్ర ఇప్పుడు పూర్తయింది. 20172022 అసెంబ్లీ ఎన్నికల మధ్య గోవాలో 17 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు ఫిరాయింపులకు పాలడ్డారు. తాజా 8 మందిని కలిపితే వారు 25కి చేరుతారు. 2019 జులై 10న అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రకాంత్ కవలేకర్ నాయకత్వంలో 10 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు పార్టీని వీడి బిజెపిలో చేరారు. సరిగ్గా అదే ఘట్టం ఇప్పుడు మళ్లీ చోటు చేసుకున్నది. విచిత్రమేమిటంటే గెలిస్తే ఫిరాయింపులకు పాల్పడబోమని ఆలయాల్లో, చర్చీల్లో ప్రమాణాలు చేయించి ఒట్టు వేయించుకున్న తర్వాతనే రాహుల్ గాంధీ 2022 ఫిబ్రవరి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లను ఇచ్చారు. ఆ ఒట్టును గట్టు మీద పెట్టి వీరంతా ఇప్పుడు బిజెపిలో చేరిపోయారు. అప్పుడు ఒట్టు పెట్టుకున్నాము ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఫిరాయింపులకు పాల్పడ్డానికి అనుమతించాలి అని వేడుకున్నామని అందుకు దేవుడు అనుమతించాడని ఫిరాయింపుదార్లు చెప్పుకోడం ఎంత సిగ్గుమాలిన పనో చెప్పనక్కర లేదు. ప్రతిపక్షంలోని ఎంఎల్‌ఎలపై, నాయకులపై గల కేసులను ఉపయోగించి, బెదిరించి తమ పార్టీలోకి రప్పించుకునే బ్లాక్ మెయిల్ విద్యలో కూడా బిజెపి నాయకులు ఆరితేరిపోయారు.

గోవాలో ఈసారి ఫిరాయింపుల వెనుక దీని పాత్ర కూడా వుందని తెలుస్తున్నది. ఫిరాయింపుల నిరోధక బిల్లు ఎన్నెన్ని సార్లు ఇలా అభాసుపాలవుతున్నదో చెప్పుకోనక్కర లేదు. దీనికి విరుగుడును సుప్రీంకోర్టు కూడా కనుక్కోలేకపోతున్నది. మొన్న మహారాష్ట్ర ఉదంతంలో ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని ఫిరాయింపు శివసేన ఎంఎల్‌ఎల సభ్యత్వాల రద్దు ప్రక్రియను పక్కనపెట్టాలని సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర స్పీకర్‌కు ఆదేశించడం ఫిరాయింపుల నిరోధ ఆశయం మీద నీళ్లు చల్లినట్టయింది. రాజకీయ నేతల స్వార్థానికి ప్రజాస్వామ్యం బలైపోతున్న తీరు మరొక సారి గోవాలో కళ్లకు కట్టింది. దేశాన్ని పాలిస్తున్న పార్టీయే అడ్డదారులను తొక్కి రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాలరాస్తున్నప్పుడు అడ్డుకోవలసిన న్యాయ వ్యవస్థ అందుకు సాహసించలేకపోడం బాధాకరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News