హైదరాబాద్ : పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ధర్నా నిర్వహించింది. ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం బిజెపి శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టు 30లోగా నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని కేటాయించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి నిరుపేదలని పంపిస్తామని హెచ్చరించారు.
గద్వాల్ జిల్లా కలెక్టరేట్ వద్ద బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ, నల్గొండలో మధ్య ప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్‌రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ హనుమకొండ జిల్లాలో, జితేందర్‌రెడ్డి నారాయణపేట్ లో, వరంగల్‌లో జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఖమ్మంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి, కామారెడ్డిలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, జనగాంలో వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో గుజ్జుల ప్రేమేందర్ రెడి పాల్గొన్నారు.
నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా
ఇందిరాపార్క్ వద్ద మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించనున్నారు. కార్యక్రమంలో బిజెపి జాతీయ నాయకులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, జాతీయ,రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, ఇల్లు లేని నిరుపేదలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది.