Sunday, December 22, 2024

రాజ్యాంగాన్ని మార్చే శక్తి బిజెపికి లేదు..రాదు

- Advertisement -
- Advertisement -

ముంబై : బిజెపి ఎంత గొప్పలకు దిగినా ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చలేదు. మార్చే శక్తిని సంతరించుకోలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో ఆ దివారం ఆయన ఇక్కడ జరిగిన సభలో మాట్లాడారు. ఈ సభలో పలువురు విపక్ష నేతలు, ప్రియాంక గాంధీ ప్రత్యేక ఆకర్షణగా మారారు. అనుకున్నది సాధించాలంటే బిజెపికి పార్లమెంట్‌లో సంపూర్ణ మెజార్టీ అవసరం అని ఇటీవల బిజెపి ఎంపి అనంత్ కుమార్ హెగ్డే చెప్పడం బి జెపి విపరీత చేష్టకు ప్రతీక అయిందన్నారు. బిజెపికి ఈ రాజ్యాంగాన్ని మార్చివేయాలని ఉంది . కానీ ఈ విధమైన బలంపుంజుకునే స్థాయిలో ఆ పార్టీకి ప్రజా బలం లేదని, ఈ విషయం ఈ ఎన్నికలలో తేటతెల్లం అవుతుందన్నారు. అధికారం అంతా వారిపైపు వారి గుప్పిట్లోనే ఉండాలని వారు అనుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారం ప్రజా కేంద్రీకృతం, వికేంద్రీకరణం కావాలంటోంది. ఈ  విధంగా ఇప్పుడు రెండు సిద్ధాంతాల నడుమ పోరు నెలకొంది. ఇది బిజెపి, కాంగ్రెస్ మధ్య ఎన్నికల యుద్ధం కాదని తెలిపారు.సత్యం, ప్రజలు ఎటువైపు ఉంటే అటే విజయం అని తెలుసుకోవాలని బిజెపికి చురకలు పెట్టారు. రైతును మించిన విజ్ఞాని ఎవరూ లేరని తాను ఈ యాత్రతో తెలుసుకున్నానని, కాగా కాషాయానికి సామాన్య జనం అంతా అజ్ఞానలోకంగా అన్పిస్తుందని, ఈ క్రమంలో సాగే ఈ పోరులో చివరి విజయం తమదే అంటే ప్రజలదే అన్నారు. భారత్ జోడో న్యాయ్‌యాత్ర ఆదివారం ముంబై తుదిమజిలీగా ముగిసింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డ దశలో ఈ ముగింపు యాత్ర పలువురు ప్రతిపక్ష ప్రముఖ నేతల రాకతో , వారివాడివేడి ప్రసంగాలతో ప్రతిపక్షాల బలప్రదర్శన వేదికగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమ జోడో యాత్ర 2ను జనవరి 14న మణిపూర్ నుంచి ప్రారంభించారు.

అక్కడ వివాదాస్పదరీతిలో ఆరంభం తరువాత ఈ యాత్ర పలు రాష్ట్రాల మీదుగా మధ్యమధ్యలో స్వల్ప విరామాల తరువాత దాదాపు 6700 కిలోమీటర్ల ప్రయాణం తరువాత తూర్పు భారతం నుంచి పశ్చిమ భారత్ దిశలో సాగి చివరికి మరాఠా గడ్డపై ముగిసింది. ఈ నేపథ్యంలో ముంబైలోని శివాజీ పార్క్‌లో సభ జరిగింది. ఈ యాత్ర ముగింపు సభకు పలువురు సీనియర్ నేతలు శరద్ పవార్, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా, ఎంకె స్టాలిన్, తేజస్వీ యాదవ్ , పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ, తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి, ఇతరులు హాజరయ్యారు. దేశంలో క్రమేపీ ఎన్నికల వేడి రగులుకుంటున్న దశలో ప్రతిపక్ష నేతలు ఒకచోట చేరడం కీలక పరిణామం అయింది. ఇది ఓ విధంగా అత్యంత కీలక నేతలు మమత బెనర్జీ, కేజ్రీవాల్ వంటి వారు లేని ఇండియా కూటమి భేటీగా మారింది.

దేశానికి ఇప్పుడు అత్యంత ఆవశ్యమైన సందేశాన్ని ఇచ్చేందుకు రాహుల్ గాంధీ ఈ యాత్ర ద్వారా చేపట్టిన ఉద్యమం కీలకమైనదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రశంసించారు. భారత రాజ్యాంగ పరిరక్షణ, సహోదరత్వ భావన, విద్వేషాలకు అడ్డుకట్ట వంటివి ఈ యాత్ర లక్షాలని తెలిపారు. ఇటువంటి చైతన్యవంతమైన యాత్రను తలపెట్టినందుకు రాహుల్‌కు అభినందనలు అని పేర్కొన్నారు. ముంబై నుంచే మహాత్మా గాంధీ క్విట్ ఇండియా పిలుపు ఇచ్చారని , ఇప్పుడు ఇండియా కూటమి తరఫున క్విట్ బిజెపి సందేశం బలంగా ఇద్దామని తెలిపారు. స్టాలిన్ స్పందిస్తూ రాజకీయాల్లోకి వచ్చేది కేవలం ప్రజలకోసం అని , ఈ ఆలోచనల రాహుల్ తన యాత్రలో భాగంగా ఇండియా స్పందనను తెలుసుకోవడానికి యత్నించారని , ఆయన అనుభవం కీలకమైనదని తెలిపారు. బిజెపి ధ్వంసం చేస్తూ వచ్చిన దేశంలో కొత్త ఆశలను రేకెత్తించేందుకు ఈ జోడో బాగా తోడ్పడిందన్నారు.
ఇవిఎం దొంగలున్నారు జాగ్రత్త సభలో… డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా చురకలు
భారతదేశంలో ఇప్పుడు ఎన్నికల ప్రజాస్వామిక ప్రక్రియకు కొత్త సవాలు ఏర్పడిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా హెచ్చరించారు. కశ్మీర్‌లో రాహుల్ జోడో యాత్ర మొదటి భాగం ముగిసింది. ఇప్పుడు రెండో యాత్ర ఇక్కడ విరమించుకుంది. వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు వాతావరణాల ప్రత్యేకత ఉన్న దేశం మనది అని, ఈ దశలో తిరిగి వస్తున్న ఎన్నికల సమయంలో ఓటర్లు తమతమ ఓట్లను రక్షించుకోవల్సి ఉంది. కేవలం తమ ఓటు తాము వేశామా , రిగ్గింగ్ జరగకుండా చూసుకున్నామా? అనేది ఇంతకు ముందటి విషయం . ఇప్పుడు పరిస్థితి మారింది. మీ ఓటును కొట్టేసే భారీ గజదొంగ ఒకటుంది. ఇది ఇవిఎం అని, దీని బారిన పడకుండా మీ ఓటును మీరు జాగ్రత్తగా చూసుకోవాలని పిలుపు నిచ్చారు. ఓటేసిన తరువాత సంబంధిత పత్రాలను చెక్ చేస్కోండి. ఓటును నిర్థారించుకోండని, లేకపోతే ఇవిఎంల బారిన మీ ఓటు పడి, మీ ప్రజాస్వామిక హక్కుపై వేటు పడుతుందని హెచ్చరించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ గజదొంగ ఇవిఎం యంత్రాల ప్రక్రియ పనిపడుతామని. ఇక ఎన్నికల కమిషన్‌ను పూర్తిగా స్వతంత్రం చేస్తామని తెలిపారు. అంతర్గత, బహిర్గత జోక్యపు ఎన్నికల వ్యవస్థలో ఇప్పుడు తలెత్తుతున్న ముప్పుపై జాగ్రత్తలు అవసరం అని ఈ వేదిక నుంచి ఈ సీనియర్ నేత పిలుపు నిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News