Wednesday, January 22, 2025

ముస్లింల ఓట్లు మాకు అక్కర్లేదు: కర్నాటక బిజెపి

- Advertisement -
- Advertisement -

 

శివమొగ్గ: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ముస్లిం ఓట్లు తమకు అవసరం లేదని, శివమొగ్గ నగరంలో ఉన్న 60,000 ముస్లిం ఓట్లను తాము కోరబోమని కర్నాటక మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు కెఎస్ ఈశ్వరప్ప ప్రకటించారు.
శివమొగ్గ నగరంలోని వినోబా నగర్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప నివాసం సమీపంలోని వీరశైవ లింగాయత్ కమ్యూనిటీ హాలులో సోమవారం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ అన్ని కులాలకు చెందిన ప్రజలను నేరుగా కలుసుకుని బిజెపి పాలనలో అందుతున్న ప్రయోజనాల గురించి ఆరా తీద్దామని అన్నారు. బిజెపి పాలనలో రాష్ట్రంలో ప్రతి కులం ప్రయోజనం పొందిందని ఆయన చెప్పారు. నగరంలో 60,000 మంది ముస్లింల ఓట్లు ఉన్నాయని, వారి ఓట్లు తమకు అవసరం లేదని ఈశ్వరప్ప చెప్పారు. అయితే ఆపదలో ఉన్న ముస్లింలకు తాము వ్యక్తిగతంగా సహాయం అందచేశామని, వారి ఓట్లు తమకు ఎలాగైనా పడతాయని ఆయన చెప్పారు. జాతీయవాద ముస్లింలు అందరూ తప్పనిసరిగా బిజెపికే ఓటు వేస్తారని ఆయన అన్నారు.

Also Read: బిజెపి స్వప్రయోజక దాడులు!

బిజెపి పాలనలో హిందువులు సురక్షితంగా ఉన్నారని, వారిపై దాడులు చేసే ధైర్యం ఎవరికీ లేదని ఈశ్వరప్ప చెప్పారు. బిజెపియేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాము భద్రంగా ఉండమన్న భావన ప్రజలలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదే సభలో యడియూరప్ప ప్రసంగిస్తూ బిజెపి అభ్యర్థిని గెలిపించవలసిందిగా వీరశైవ లింగాయత్‌లకు విజ్ఞప్తి చేశారు. వీరేంద్రపాటిల్‌ను నిర్దాక్షిణ్యంగా ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి లింగాయత్‌లను అవమానించిన కాంగ్రెస్‌ను క్షమించకూడదని యడియూరప్ప పిలుపునిచ్చారు. బిజెపి అభ్యర్థి ఎస్‌ఎన్ చనబసప్ప, శివమొగ్గ లోక్‌సభ్యుడు బివై రాఘవేంద్ర, ఇతర మత నాయకులు ఈ సభలో పాల్గన్నారు.

Also Read: విద్య కాషాయీకరణ!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News