Saturday, December 21, 2024

గడ్కరీపై మోడీ వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్రంలో శక్తివంతపు మంత్రిగా పేరొందిన నితిన్ గడ్కరిని ఈసారి బిజెపి పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడం పార్టీ తీవ్ర గ్భ్రాంతికి గురిచేసింది. ఈ మధ్యకాలంలో గడ్కరీ అక్కడక్కడ పరోక్షంగా తమ ప్రభుత్వ తీరుతెన్నులపై విమర్శలకు దిగుతున్నారు. పలు కార్యక్రమాలను శీఘ్రగతిన చేపట్టవచ్చునని, అయితే పాతుకుపోయిన బ్యూరోక్రసీ కొనసాగింపు వల్ల తామేమీ చేయలేకపోతున్నామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. గడ్కరీ కేంద్రీకృతంగా మోడీ పట్ల అసమ్మతి వ్యక్తీకరణ నేతల సమీకరణ జరుగుతుందనే వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు బిజెపి పార్టీపరంగా చేపట్టిన కీలక చర్యలో సీనియర్ మంత్రి గడ్కరీని పక్కకు పెట్ట డం కీలక పరిణామం అయింది. బిజెపి జాతీయ అధ్యక్షులుగా ఇంతకు ముందు గడ్కరీ వ్యవహరించారు. సాధారణంగా బిజెపి మాజీ అధ్యక్షులను పార్టీ నిర్ణయాక ప్రక్రియల మండలిలో ప్రముఖ గౌరవనీయ స్థానాలలో ఉంచడం రివాజుగా ఉంది. కానీ ఇందుకు భిన్నంగా ఈసారి గడ్కరీని బిజెపి పార్లమెంట్ బోర్డు నుంచి తీసేశారు. బిజెపికి సిద్ధాంత గురువుగా ఉండే ఆర్‌ఎస్‌ఎస్‌తో గడ్కరీకి కీలకమైన సంబంధాలు, అంతకుమించి నాగ్‌పూర్ అనుబంధాలు ఉండటం వల్లనే ఆయన మోడీ పట్ల సూటిపోటి మాటలకు దిగినా సీనియర్ మంత్రిగా కొనసాగడం జరుగుతోందని స్పష్టం అయింది. అయితే గడ్కరికి ఆర్‌ఎస్‌ఎస్ ఆశీస్సులు ఉన్నప్పటికీ మోడీ, షా ద్వయం ఆయనను పార్టీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించింది. కొత్త ముఖాలకు స్థానం కల్పించడం అనే కారణంతో గడ్కరీపై వేటు పడ్డట్లు ప్రచారం జరిగింది. రక్షణ మంత్రి, బిజెపి పూర్వపు అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్‌ను తిరిగి పార్లమెంటరీ బోర్డులోకి తీసుకున్నారు. ఎన్నికల కమిటీలో కూడా మోడీ షాల వారికే ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం కేవలం 2024 లోక్‌సభ ఎన్నికలలో తమ పట్లు బిగించుకునేందుకు, పార్టీలో ఇతర విమర్శకులకు ప్రాధాన్యత తగ్గించేందుకు అనే విశ్లేషణలు వెలువడ్డాయి. తమకు తాము చాలా సీనియర్లు అనుకునే వారిని ఈసారి బిజెపి కమిటీలకు దూరం పెట్టారు. విధేయత ప్రాధాన్యత గల వారికి ఎక్కువగా స్థానం కల్పించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర మాజీ సిఎం దేవెంద్ర ఫడ్నవిస్‌కు కమిటీలలో పెద్ద పీట వేశారు. అయితే మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పార్లమెంటరీ బోర్డు నుంచి పక్కకు పెట్టారు. ఇక కర్నాటకలో అత్యంత కీలకమైన స్థానం వహించి, అవినీతి కేసులలో మచ్చలు పడ్డ మాజీ సిఎం యడ్యూరప్పకు పార్టీ బోర్డులోకి తీసుకున్నారు. కర్నాటకలో అత్యంత కీలకమైన లింగాయత్ నేత బిజెపి పట్ల విరక్తిగా ఉంటున్న సూచనలు అందడంతో ఆయన ఆర్థిక వెన్నుదన్నుల నేపథ్యంలో ఇప్పుడు వయో పరిమితిని పక్కకు పెట్టి యడ్యూరప్పకు జాతీయ ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడైంది.

రెండు కమిటీల్లో లక్ష్మణ్‌కు చోటు
బిజెపిలో వ్యవస్థీకృత మార్పులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే పార్టీ పార్లమెంటరీ బోర్డును బుధవారం పునర్ వ్యవస్థీకరించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బోర్డు నుంచి తొలగించారు. కొత్తగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, కె. లక్ష్మణ్ లను తీసుకున్నారు. ఈ బోర్డులో జేపీ నడ్డా (అధ్యక్షుడు), నరేంద్రమోడీ, రాజ్‌నాధ్‌సింగ్, అమిత్‌షా, బిఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, కె లక్ష్మన్, ఇక్బాల్ సింగ్ లాల్ పురా, సుధా యాదవ్, సత్యనారాయణ జటియా, బిఎల్ సంతోష్ ఉన్నారు. ఇక బిజెపి సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కూడా మార్పులు చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఇందులో స్థానం కల్పించారు. బిజెపి కొత్త సిఈసిలో జెపి నడ్డా (అధ్యక్షుడు), నరేంద్రమోడీ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, బీఎస్ యడియూరప్ప, సర్బానంద్ సోనోవాల్, కె. లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్‌పురా, సుధా యాదవ్, సత్యనారాయణ జటియా, భూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫడ్నవీస్, ఓం మాథూర్, బిఎస్ సంతోష్, పసతి శ్రీనివాస్ ఉన్నారు. తెలంగాణకు చెందిన లక్ష్మణ్‌కు రెండు కమిటీల్లో చోటు దక్కింది. ఈ రెండు కమిటీల్లో మోడీ సర్కారులో అత్యంత సీనియర్ మంత్రి గడ్కరీకి స్థానం దక్కక పోవడం గమనార్హం. మరోపక్క పార్టీ పెట్టుకొన్న 75 ఏళ్ల వయోపరిమితికి భిన్నంగా 77 ఏళ్ల యడియూరప్ప ఈ రెండు కమిటీల్లో స్థానం దక్కించుకోవడం విశేషం.. కర్ణాటకలో ఆయనకు ఉన్న పట్టు కారణంగా పార్టీలో కేంద్ర కమిటీల్లో స్థానం దక్కించుకొన్నారు.

BJP Drops Nitin Gadkari from Parliament Board

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News