Monday, December 23, 2024

విద్య కాషాయీకరణ!

- Advertisement -
- Advertisement -

‘చరిత్రను పట్టించుకోని తరానికి గతమూ భవిష్యత్తూ రెండూ వుండవు’ చరిత్రను నిర్లక్షం చేస్తే అది వేరు మాట, దాని కళ్ళు, ముక్కు, చెవులు కోసేసి శూర్పణఖలా మార్చేయడం ఎంత దారుణం! విద్యార్థులకు చరిత్ర బోధించకపోతే అదొక తీరు, గతంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించిన ఒక ముఖ్యమంత్రి చరిత్ర, సామాజిక శాస్త్రాల బోధన, అధ్యయనాలు వ్యర్థమని ప్రకటించిన సందర్భముంది. ఏ ఇజమూ లేదు, ఉన్నదంతా టూరిజమే అని ఉద్బోధించిన గతమూ తెలిసిందే. ఇటువంటి పోకడలు మనలను కళ్ళుండీ లేని వారిగా చేస్తాయి. చరిత్ర మన కళ్ళు, చెవులు కూడా. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) పాఠ్యగ్రంథాల్లో చేసిన మార్పులను తీవ్రంగా నిరసిస్తూ దేశ విదేశీ విశ్వ విద్యాలయాలకు చెందిన 250 మంది చరిత్రవేత్తలు శుక్రవారం నాడు ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారన్న వార్త దేశంలో విద్య కాషాయీకరణ కంపు ముక్కుపుటాలను అదరగొడుతున్న చేదు వాస్తవాన్ని చాటుతున్నది.

ఎవరి విశ్వాసాలు, రాజకీయాలు ఏమైనప్పటికీ చరిత్రను మార్చడం అందులో కల్లబొల్లి కట్టుకథలను చేర్చడం మానవాళి మనుగడకే హానికరమైనది. గతం నుంచి నేర్చుకొనేవారే సరైన ముందడుగు వేయగలుగుతారు. గతానికి సంబంధించిన ఆనవాళ్లే లేకుండా చేసినప్పుడు భవిష్యత్తు ఇంకెక్కడిది? దేశంలో గత చరిత్రను పురాణాల్లోంచి వెతుక్కోమనేవాళ్ళు తరచూ తారసపడుతుంటారు. కల్పన నుంచి వాస్తవాలను ఏరుకోడం ఎలా సాధ్యం! 12 తరగతి పాఠ్యగ్రంథం నుంచి మొత్తంగా మొగల్ చరిత్ర అధ్యాయాన్నే ఎన్‌సిఇఆర్‌టి తొలగించిందని ఈ పని ప్రస్తుత భారత పాలకుల మతతత్వ దృక్కోణం నుంచే జరిగిందని, వారి కుహనా చరిత్ర కోణంలో ఇమడని అంశాలను తొలగించారని తమ ప్రకటనలో ఆ 250 మంది చరిత్రవేత్తలు పేర్కొన్నారు. ఇంకొక వైపు 12వ తరగతి రాజకీయ శాస్త్రం పాఠ్యప్రణాళిక నుంచి సిక్కుల చరిత్రకు సంబంధించిన విషయాలను ఎన్‌సిఇఆర్‌టి తప్పుగా పేర్కొన్నదని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జిపిసి) శుక్రవారం నాడు ఒక ప్రకటనలో అభ్యంతరం తెలిపింది. స్వాతంత్య్రానంతర భారత రాజకీయాల పాఠ్యగ్రంథంలో ప్రాంతీయ ఆకాంక్షలు అనే ఉప శీర్షిక కింద ఆనందపూర్ సాహిబ్ తీర్మానం గురించి తప్పుడు సమాచారమిచ్చారని ఎస్‌జిపిసి అధినేత హర్జిందర్ సింగ్ ధామి అభిప్రాయపడ్డారు.

1973 నాటి ఆనందపూర్ సాహిబ్ తీర్మానం రాష్ట్ర హక్కుల గురించి, సమాఖ్య వ్యవస్థను పటిష్ఠం చేయడం గురించి ప్రస్తావించిందని సిక్కులను వేర్పాటువాదులుగా చిత్రించడం తగదని అత్యంత అభ్యంతరకరమైన ఈ మార్పులను పాఠ్యగ్రంథాల నుంచి ఎన్‌సిఇఆర్‌టి తొలగించాలని ఎస్‌జిపిసి డిమాండ్ చేసింది. 12వ తరగతి చరిత్ర పాఠ్యగ్రంథం నుంచి మహాత్మా గాంధీ గురించి వుండిన కొన్ని భాగాలను తొలగించినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. హిందు ముస్లింల మధ్య ఐక్యత కోసం గాంధీజీ చేసిన కృషి హిందు తీవ్రవాదులను ఏ విధంగా రెచ్చగొట్టిందో వివరించిన భాగాన్ని, అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పై నిషేధం విధింపు సమాచారాన్ని తొలగించినట్టు ఆ వార్తలు తెలియజేశాయి. చరిత్రకు బిజెపి వెల్ల వేస్తున్నదని దానిని వక్రీకరిస్తున్నదనే విమర్శలు అప్పుడే వచ్చాయి.

సిబిఎస్‌ఇ సిలబస్‌లోని 11వ తరగతి సోషియాలజీ పాఠ్యగ్రంథం నుంచి గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ప్రస్తావనలను కూడా ఎన్‌సిఇఆర్‌టి తొలగించింది. ఈ మార్పులను కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ సమర్థించుకొన్నాయి. భారత దేశ చరిత్రకు తప్పుడు భాష్యాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట అని అది చేసిన తప్పులను బిజెపి సరిదిద్దుతున్నదని కేంద్ర మంత్రి సోభా కరండ్లజే అప్పట్లో ప్రకటించారు. ఇండియా ప్రపంచంలోనే అతి గొప్ప దేశంగా పరిణామం చెందుతున్నదని అభిప్రాయపడిన మహారాష్ట్ర బిజెపి ప్రముఖుడు చంద్ర శేఖర్ బవంకులే ఈ సమయంలో వ్యతిరేక అంశాలు చరిత్రలో వుండకూడదని అభిప్రాయపడడం ఎంత హాస్యాస్పదం!

చరిత్ర తనంతట తాను ఆవిష్కృతమవుతుందేగాని దానిని ఎవరూ సృష్టించజాలరు. అలా సృష్టించేవి పురాణాలే అవుతాయిగాని చరిత్ర కాలేవు. భారత దేశ చరిత్ర సుసంపన్నమైనది, వైవిధ్యభరితమైనది. వివిధ, విభిన్న శక్తులు సంచరించి దానిని గొప్పదిగా చేశాయి. ఆ బహుళత్వాన్ని బలి తీసుకోడం, ఒకే విశ్వాసుల ఇష్టావిలాసానికి దానిని ఎర చేయడం ఘోరాపరాధమవుతుంది. ఇప్పుడున్న పాలకులు తమ ఆత్మానందం కోసం చరిత్రను ఎంతగా మార్చివేసినా వాస్తవ చరిత్ర చెరిగిపోదు, కనుమరుగు కాదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ లోకమంతా కళ్ళుమూసుకునే వుందని అనుకుంటుందట. దేశ చరిత్రను తమకు తోచిన విధంగా మార్చివేయదలచుకొన్న బిజెపి పాలకులు కూడా అటువంటి వారే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News