హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితున్ని తానేనని మాజీ మంత్రి, మల్కాజిగిరి బిజెపి ఎంపి అభ్యర్థి ఈటల రాజేం దర్ స్పష్టం చేశారు. తమ కుటుంబ సభ్యులందరి ఫోన్లు ట్యాప్ చేశారని, కొన్ని సంసారాలు కూడా ఫోన్ ట్యాపింగులతో పాడయ్యాయని ధ్వజ మెత్తారు. ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర చర్చ జరపాలన్నారు. మల్కాజ్‌గిరిలో నిర్వహించిన ’మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పక్షాల సూచనలను ప్రభు త్వాలు పాటించాలన్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు బిఆర్‌ఎస్‌లానే కాంగ్రెస్ సర్కార్ కూడా ప్రజా సమస్యలు పట్టించుకో వడం లేదని విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు నెరవేర్చలేదని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.
ప్రధాని మోడీ ని పెద్దన్న అన్న సిఎం రేవంత్‌రెడ్డి వెంటనే మళ్లీ మోడీ ఏంటీ? అని మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కింత మెజార్టీ వచ్చి, అరుదైన అవకాశం వస్తుందని కాంగ్రెస్ నాయకులు అనుకోలేదని వెల్లడించారు. బిఆర్‌ఎస్ హయాం లో ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ ఇప్పటికీ రాలేదని మండిపడ్డారు. మహాలక్ష్మీ పేరిట నగదు సాయం అమలు కావడం లేదన్నారు. రైతు భరోసా, కౌలు రైతు లకు సాయం , రైతులకు బోనస్ ఇస్తామన్నారు కానీ, ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. కేంద్రంలో అధికారంలోకి రాలేని కాంగ్రె స్, హామీలు ఎలా అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలను వంచించడానికే గ్యారెంటీలు ప్రకటించిందని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్నికల్లో బిజెపిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.