Monday, December 23, 2024

పారదర్శకత కోసమే ఈ పథకాన్ని తీసుకువచ్చాం

- Advertisement -
- Advertisement -

ఎన్నికల బాండ్ల తీర్పుపై బిజెపి వివరణ

న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకాన్ని బిజెపి గురువారం సమర్థించింది. సుప్రీంకోర్టు గురువారం ఈ పథకాన్ని రద్దు చేస్తూ వెలువరించిన తీర్పును గౌరవిస్తున్నామని బిజెపి తెలిపింది. అయితే ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సేకరించే నిధులలో పారదర్శకతను తీసుకురావడానికి ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని బిజెపి పేర్కొంది. రాజకీయ పార్టీల విరాళాల సేకరణలో సంస్కరణలను ప్రధాని మోడీ చేపట్టారని, అందులో భాగంగానే ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టారని గురువారం విలేకరులతో మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.

కార్పొరేట్ కంపెనీల నుంచి అధికార బిజెపి ముడుపులు తీసుకోవడానికి ఎన్నికల బాండ్లు ఉపయోగపడ్డాయంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణను ఆయన తిప్పికొడుతూ అవినీతి, ముడుపులనే డిఎన్‌ఎ చేసుకున్న రాజకీయ పార్టీలు కూడా బిజెపిపై అటువంటి ఆరోపణలు చేయడం తగదని వ్యాఖ్యానించారు. ఎన్నికల బాండ్ల వల్ల ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు సమ న్యాయాన్ని పొందలేకపోతున్నాయన్న వాదనను ప్రస్తావిస్తూ ఎవరు ఎన్నికల క్షేత్రంలో ఉన్నారో, ఎవరు బయట ఉన్నారో ప్రజలే నిర్ణయిస్తారని రవిశంకర్ వ్యాఖ్యానించారు. కొన్ని పార్టీలను ప్రజలే ఎన్నికల క్షేత్రం నుంచి బయటకు విసిరారని, తమ కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలలోనే ఒక్క సీటును కూడా గెలుచుకోలేని స్థితిలో అవి ఉన్నాయని పరోక్షంగా కాంగ్రెస్ ఉద్దేశించి ఆయన విమర్శించారు. ఎన్నికల బాండ్లపై సుప్రీం తీర్పును రాజకీయం చేయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని బిజెపి అధికార ప్రతినిధి నళిన కోహ్లి ఆరోపించారు.

మోడీ నాయకత్వానికి, ఆయన ప్రభుత్వం చేసిన సానుకూల పనులకు వారి వద్ద ప్రత్యామ్నాయం లేదని ఆయన పేర్కొన్నారు. తాము కోర్టులలో ప్రాక్టీసు చేస్తుంటామని, కొన్ని కేసులను గెలుస్తామని, కొన్ని ఓడతామని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పునైనా తాము ఆమోదించి, గౌరవిస్తామని కోహ్లి చెప్పారు. ఎన్నికలలో నల్ల ధనాన్ని నిరోధించాలన్న సదుద్దేశంతోనే మోడీ రభుత్వం ఎన్నికల బాండ్లను తీసుకువచ్చిందని ఆయన చెప్పారు. పార్టీలకు విరాళాలు ఇచ్చే వ్యక్తుల గుర్తింపునకు సంబంధించిన ఆందోళనలను దృష్టిలో ఉంచుకునే ఈ పథకాన్ని తీసుకువచ్చామని ఆయన వివరించారు. ఈ పథకం ఈ రూపంలో ఉండకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని, అందుకే కొన్ని మార్గదర్శకాలను జారీచేసిందని ఆయన వివరించారు. ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉండరాదని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొందని, సుప్రీంకోర్టు ఇచ్చే ఏ తీర్పునైనా తాము గౌరవిస్తామని కోహ్లి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News