Wednesday, January 22, 2025

కమలంలో తిరుగుబాట్లు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిజెపిలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. గత ఏడాది నుంచి తెలంగాణలో బలం పుంజుకుందని ఆశల్లో ఉన్న కమలం పార్టీకి కర్నాటక ఎన్నికల తరువాత పార్టీకి ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నేతలంతా మళ్లీ సొంతగూటికి వెళ్లుతున్నారని ప్రచారం పెద్ద ఎత్తున జరగడంతో వలసలను నివారించేందుకు హస్తిన పెద్దలు అసమ్మతి నాయకులైన ఈటెల రాజేందర్, రాజగోపాల్‌రెడ్డిలో ఢిల్లీకి పిలుపించుకుని రెండు గంటల పాటు సమావేశం నిర్వహించి పార్టీలో జరుగుతున్న పరిస్థితుల వివరాలను తీసుకుని తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయిన ఈ ఇద్దరు నాయకులు పార్టీకి అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తూ దీనికంతటికి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఒంటెద్దు పోకడలే కారణమని, ఆయనను పదవి నుంచి తప్పిస్తే పార్టీ గ్రూపులు, కుమ్ములాటలకు తెర పడుతుందని అగ్రనేతలకు చెప్పినట్లు తెలిపారు.

పార్టీ కార్యవర్గం మార్చకపోతే చాలామంది నేతలు పార్టీకి దూరమైతారని, వచ్చే ఎన్నికల్లో మూడు సీట్లు కూడా గెలవడం కష్టంగా మారుతుందని వెల్లడించారు. రెండు రోజుల నుంచి కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని, కేబినెట్‌లోకి బండి తీసుకున్నట్లు, ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటెల రాజేందర్ నియమిస్తున్నట్లు సోషల్ మీడియా వేదిక ప్రచారం కావడంతో దానికి చెక్ పెట్టేందుకు సీనియర్ నాయకుడు మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి ట్విట్ చేయడంతో పార్టీలో కలకలం రేగింది. దీంతో అసంతృప్తులు సంఖ్య పెరుగుతుందని పార్టీలో చర్చ సాగుతుంది. ఇంతలోనే దుబ్బాక ఎమ్మెల్యే రఘనందర్‌రావు కూడా పార్టీలో తనకు అడగడునా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాష్ట్ర కమిటీతో పాటు కేంద్ర కమిటీ కూడా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారు. నేషనల్ స్పోక్స్ పర్సన్ కావాలని స్వయంగా అడిగానని అయినా తనకు ఎలాంటి పదవి ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు.

బీజేపీలో ఫ్లోర్ లీడర్ పదవి కావాలని అడిగిన ఇవ్వలేదని, స్వయంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్ చేసి తాను పార్టీలో లేనని, రఘునంద్‌రావుకు ఫ్లోర్ లీడర్ ఇవ్వాలని కోరినా తనను పట్టించుకోవలేదని పేర్కొన్నారు. అసలు పార్టీ పక్ష నాయకుడు లేకుండా అసెంబ్లీ నడుస్తుందా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఇటీవలే పార్టీలో చేరిన ఈటలకు సైతం జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చోటు దక్కిందని, విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్‌కు సైతం చోటు కల్పించారు. నాకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డారు. ఇటీవలే అమ్నేషియా పబ్బుకు సంబంధించిన అంశంపై తాను పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తానంటే కూడా బండి సంజయ్ వద్దని వారించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో నాయకుడు పార్టీపై విమర్శలు చేస్తుంటే గతంకంటే ఎక్కువ బలహీనమైతుందని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు పేర్కొంటున్నారు.

పార్టీలో ఇంత జరుగుతున్న బండి సంజయ్ అసమ్మతి నేతలకు సర్ది చెప్పడం లేదని విరుచుకు పడుతున్నారు. వీలైనంత త్వరగా ఢిల్లీ పెద్దలు రాష్ట్రంలో పార్టీ ఉనికి ఉండాలంటే రంగంలోకి దిగి నాయకుల మధ్య విబేధాలను చర్చించి అందరు కలిసి పనిచేసేలా సమన్వయం చేస్తే వచ్చే ఎన్నికల్లో పరువు నిలబడుతుందని, ఇదే విధంగా నాయకులు తగవులాడుతుంటే బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News