Tuesday, January 21, 2025

నేనంటే ప్రతిపక్షాలకు భయం: సిద్ధరామయ్య

- Advertisement -
- Advertisement -

అందుకే నేను లక్ష్యం అయ్యాను
ఇది‘రాజకీయ కేసు’
నా రాజానామా ప్రసక్తి లేదు
కర్నాటక సిఎం సిద్ధరామయ్య

మైసూరు : ప్రతిపక్షాలకు తాను అంటే ‘భయం’ కనుకే మైసూరు పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎంయుడిఎ ముడా) స్థలం కేటాయింపు కేసులో తనను లక్షం చేసుకుంటున్నాయని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ఆరోపించారు. ఇది తనపై అటువంటి తొలి ‘రాజకీయ కేసు’ అని ఆయన మైసూరులో విలేకరులతో అన్నారు. తాను ఏ తప్పూ చేయనందున ఈ కేసులో తనపై దర్యాప్తునకు కోర్టు ఆదేశించినా రాజీనామా చేయబోనని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. తాను చట్టపరంగా కేసులో పోరాడుతానని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల్లో సిబిఐ, ఇడి వంటి కేంద్ర సంస్థలను, గవర్నర్ పదవులను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని సిద్ధరామయ్య ఆరోపిస్తూ, పరిపాలనలో గవర్నర్ల ‘జోక్యం’పై జాతీయ చర్చ జరగవలసిన అగత్యం ఉందని ఆయన సూచించారు.

‘నేను ఏ తప్పూ చేయలేదు. నాపై ఒక రాజకీయ కేసు నమోదు చేయడం ఇదే మొదటి సారి. ఇది రాజకీయ కేసు. దయచేసి గుర్తు పెట్టుకోండి’ అని సిద్ధరామయ్య అన్నారు. మిమ్మల్ని ఎందుకు లక్షం చేసుకుంటున్నారని ప్రశ్నించగా, ‘వారికి (ప్రతిపక్షాలకు)నేనంటే భయం’ అని ఆయన సమాధానం ఇచ్చారు. మూడు రోజుల పర్యటనపై సిద్ధరామయ్య మైసూరు వచ్చినప్పుడు పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. మరొక వైపు ఈ కేసు సందర్భంగా ప్రత్యేక కోర్టు ఆదేశం మేరకు ఆయనపై ఒక ఎఫ్‌ఐఆర్ నమోదుకు లోకాయుక్త పోలీసులు సిద్దమయ్యారు. సిద్ధరామయ్య భార్య బిఎం పార్వతికి ముడా 14 స్థలాల కేటాయింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయనే అరోపణలపై ఆయనపై దర్యాప్తు నిర్వహణకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ మంజూరు చేసిన అనుమతిని హైకోర్టు ధ్రువీకరించిన మరునాడు ప్రత్యేక కోర్టు జడ్జి సంతోష్ గజానన్ భట్ లోకాయుక్త పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించారు.

తన రాజీనామా కోరుతూ బిజెపి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుండడం గురించి విలేకరులు ప్రస్తావించినప్పుడు ‘నేను ఎందుకు రాజీనామా చేయాలి? ఎవరైనా తప్పు చేసినట్లయితే అతను రాజీనామా చేయవలసి ఉంటుంది. ఏ తప్పూ జరగలేదని మేము అంటున్నప్పుడు రాజీనామా ప్రశ్న ఎందుకు వస్తుంది?’ అని సిఎం అన్నారు. జెడి (ఎస్) నేత, కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామిపై సిద్ధరామయ్య ప్రశ్నలు సంధిస్తూ, ‘ఆయన ఎఫ్‌ఐఆర్ తరువాత బెయిల్‌పై ఉన్నారు. ఆయన ఎందుకు రాజీనామా చేయలేదు? ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఒక మంత్రి’ అని అన్నారు. మరి మిమ్మల్ని ఎందుకు లక్షం చేసుకుంటున్నారని ప్రశ్నించినప్పుడు ‘ఇది రాజకీయం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన సమాధానం ఇచ్చారు. తాను ఆరోపణలపై చట్టపరంగా పోరాడతానని ఆయన చెప్పారు.

వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ల పని తీరు గురించి, ‘దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రచారం’ ఆవశ్యకత ఉన్నదా అని ప్రశ్నించినప్పుడు ‘జాతీయ చర్చ ఉండాలి. పాలనలో గవర్నర్ల జోక్యం చేసుకోరాదు. రాజ్యాంగంచెప్పేది అదే’ అని సిద్దరామయ్య సమాధానం ఇచ్చారు. అవినీతి, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై తనను, తన ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీ హర్యానాలో ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేయడంపై ప్రశ్నకు సిద్ధరామయ్య సమాధానం ఇస్తూ, ‘ఆయన (గుజరాత్) సిఎంగా ఉన్నప్పుడు గోధ్రా ఘటన సంభవించింది, ఆయన అప్పుడు రాజీనామా చేశారా? అప్పుడు గోధ్రా ఘటనలో ఎంత మంది మరణించారు?’ అని పేర్కొన్నారు.

సిబిఐకి అనుమతి రద్దుపై ఖర్గే సమర్థన

ఇది ఇలా ఉండగా, కర్నాటకలో కేసుల దర్యాప్తునకు సిబిఐకి ఇచ్చిన సార్వత్రిక అనుమతిని రాష్ట్రంలోన తన పార్టీ ప్రభుత్వం ఉపసంహరించడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం సమర్థించారు. అది ప్రభుత్వ అధికార పరిధిలోనిదేనని ఖర్గే అన్నారు. ‘అది ఇప్పుడే జరిగింది కాదు. మీరు ఇంకా చిన్నవారు. దేవరాజ్ అర్స్ (సిఎంగా) ఉన్నప్పుడు దానిని (సిబిఐని) దుర్వినియోగం చేసినప్పుడు కూడా సిబిఐకి ఇచ్చిన అనుమతిని అప్పటి సార్వత్రిక అనుమతిని ఉపసంహరించడమైంది. అందువల్ల అది సాధారణమే’ అని ఖర్గే కర్నాటక మంత్రివర్గం నిర్ణయంపై విలేకరులతో చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News