హైదరాబాద్: బిజెపికి ఓటమి భయం పట్టుకుందని టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ బాల్కసుమన్ విమర్శించారు. బిజెపి గెలిచే పరిస్థితి ఉంటే దాడులకు దిగుతుందా? అని ప్రశ్నించారు. బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన స్థాయిని మరిచి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బిజెపికి ఓటమి పట్టుకోవడంతో సిఎం కెసిఆర్ సభను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకొని బిజెపి డ్రామాలు చేస్తోందని దుయ్యబట్టారు. టిఆర్‌ఎస్ ప్రతీ మీటింగ్‌లో బిజెపి కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కూడా తాము శాంతియుతంగా ఉండి సమాధానం ఇచ్చామన్నారు. టిఆర్‌ఎస్ కార్యకర్తలు సమన్వయం పాటించాలని పలుమార్లు తాను కోరానని బాల్క సుమన్ తెలిపారు. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరగాలని టిఆర్‌ఎస్ పార్టీ కోరుకుంటుందన్నారు. బిజెపికి దమ్ముంటే ప్రజల వద్దకు వెళ్లి అభివృద్ధి పనులు చేస్తానని చెప్పి ఓట్లు అడిగాలని నిలదీశారు. బిజెపికి భయం పట్టుకుందని కాబట్టే దళిత బంధు, కెసిఆర్ సభను ఆపుతున్నారని విమర్శించారు.