Monday, December 23, 2024

మోడీ కారు వద్ద బిజెపి జెండాల రెపరెపలు

- Advertisement -
- Advertisement -

BJP flag came close to PM Modi’s car in Punjab

భటిండా పర్యటన తాజా వీడియో కలకలం

న్యూఢిల్లీ : భద్రతా వైఫల్యం వల్ల పంజాబ్ నుంచి తిరిగి ఢిల్లీ బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవహారంపై మరో ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. బటిండాకు సమీపంలో ఫ్లైఓవర్ వద్ద మోడీ కాన్వాయ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే మోడీ కారుకు కొద్ది మీటర్ల దూరంలోనే బిజెపి కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబట్టుకుని ‘బిజెపి జిందాబాద్’ నినాదాలు చేస్తూ తిరగడం కలకలం సృష్టిస్తోంది. ప్రధాని కూర్చున్న టయోటా ఫార్చునర్ కారుకు అతి సమీపంలో కార్యకర్తలు అటూ ఇటూ తిరుగుతూ నినాదాలు చేస్తుండడం వీడియో క్లిప్ లో స్పష్టంగా కనిపిస్తోంది.

కొంత మంది నిరసనకారులు తన కాన్వాయ్‌ని నిలిపివేసినట్లు స్వయంగా మోడీనే వెల్లడించారు. అయితే ఈ సమయంలో కొంత మంది మోడీ కాన్వాయ్‌కి సమీపంలో భారతీయ జనతా పార్టీ జెండాలు పట్టుకుని, మోడీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి మోడీని ఎన్నికల ర్యాలీలో పాల్గొనకూడదని కాంగ్రెస్ సహా కొంత మంది కుట్రపన్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్న తరుణంలో ఈ వీడియో బయటికి రావడం విశేషం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుని ఉన్నారు. పదుల సంఖ్యలో ఉన్న సమూహం నరేంద్రమోదీ జిందాబాద్, బిజెపి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తోంది.

మోడీకి అత్యంత సమీపంలో వీళ్లు మాత్రమే కనిపించడం గమనార్హం. కాగా, ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. భద్రతా కారణాలో, నిరసనలో మోడీని ఆపలేదని దానికి ఈ వీడియోనే సాక్ష్యం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. భద్రతా కారణాలను సాకుగా చూపి మోడీ వెనక్కి వెళ్లారని, వాస్తవానికి ఆయన వెనక్కి వెళ్లడానికి కారణం బిజెపి నిర్వహించబోయే సభకు ఎవరూ రాకపోవడమే మరికొందరు విమర్శిస్తున్నారు. ఆ

మాటలు మోడీ గిమ్మిక్కు : సిఎం చన్నీ

ప్రాణ హానిని ఎదుర్కొన్నానని ప్రధాని మోడీ అనడాన్ని పంజాబ్ సిఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ గిమ్మిక్కుగా అభివర్ణించారు. ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ప్రధాని గౌరవనీయ దేశ నాయకుడని, ఆ స్థాయి వ్యక్తి ఇలాంటి అల్ప నాటకానికి దిగడం ఆయన హోదాకు తగదని చన్నీ పేర్కొన్నారు. రైతులు ఏడాది పొడవునా ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ప్రతికూలతల నడుమ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కొనసాగిస్తే పట్టలేదు కాని 15 నిమిషాలు ప్రధాని రోడ్డుపై వేచి ఉండాల్సి వస్తే ఇంత రాద్దాంతమా? ఇవెక్కడి ద్వంద్వ ప్రమాణాలు అని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ ధ్వజమెత్తారు. మోడీ పాల్గొనాల్సిన ఫిరోజ్‌పూర్ ర్యాలీకి కేవలం 500 మంది మాత్రమే వచ్చారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News