Wednesday, January 22, 2025

దుర్భర దారిద్య్రం

- Advertisement -
- Advertisement -

వరుసగా రెండు సార్లు దేశాధికారాన్ని గెలుచుకొన్న భారతీయ జనతా పార్టీ మూడోసారి కూడా తనదే విజయమని చెప్పుకొంటున్నది. అందు కోసం విరామం లేకుండా ప్రయత్నిస్తున్నది. అయితే ప్రజలు కొత్తగా ఒక పార్టీకి అధికారాన్ని అప్పగించడానికి, ఒకసారి ఎన్నుకొన్న దాన్ని మళ్ళీ గెలిపించడానికి తేడా వుంటుంది. 2014-19 మధ్య ఐదేళ్ళ కాలానికి బిజెపికి పాలనా పగ్గాలు అప్పజెప్పిన ప్రజలు 2019 ఎన్నికల్లో కూడా దానినే అధికార అందలం ఎక్కించారు. అది కూడా కొత్త సంప్రదాయం కాదు. అంతకు ముందు కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ (ఐక్యప్రజాస్వామ్య కూటమి) కూడా వరుసగా రెండు పదవీ కాలాల పాటు దేశాన్ని పాలించింది. ముచ్చటగా మూడోసారి ప్రజల హృదయాలను గెలుచుకొని అధికారంలోకి రాగలగడమే విశేషం అవుతుంది. బిజెపి రెండోసారి గెలుచుకొన్నప్పుడే ప్రజలకు అది ఏ మంచి చేసిందని వారు దానికి మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టారు అనే ప్రశ్న తలెత్తింది.

Also Read: కశ్మీర్‌లో బుల్డోజర్ రాజకీయాలు

అచ్ఛేదిన్ వాగ్దానాన్ని నెరవేర్చక పోయినా, నిరుద్యోగం, అధిక ధరలు వంటి సమస్యలను ఏ కొంచెమైనా పరిష్కరించలేకపోయినా ప్రజలు తననే నెత్తిన పెట్టుకొన్నారన్న సంబరాన్ని అది బిజెపిలో కలిగించింది. కమలనాథులవి భావోద్వేగ రాజకీయాలు. జన జీవితంలో గుణాత్మకమైన, మెరుగైన మార్పు తీసుకు రావడం వారికి తప్పనిసరి కాదు. అందుకే రష్యా నుంచి చవకగా లభిస్తున్న క్రూడాయిల్‌ను దేశంలో పెట్రోల్, డీజెల్ ధరలు తగ్గించడానికి ఉపయోగించకుండా రిలయన్స్ బాగుపడడం కోసం మళ్ళించిందన్న వాస్తవం ప్రజలకు తెలిసినా తనకు జరిగే హాని ఏమీ వుండదనే ధీమాతో అది వ్యవహరిస్తున్నది.

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ అటువైపుగా ఏమీ చేయకపోయినా ఢోకా లేకుండా అధికారం ఆయన ఒడిలో వాలిపోతున్నది. అందుచేత భావోద్వేగాలు రెచ్చగొట్టగలిగితే అందలం తమదేననే ధీమా బిజెపి అగ్ర నాయకుల్లో దండిగా వుంది. ఎన్నికల ముందు, ఆ తర్వాత రాజకీయ క్షుద్ర క్రీడ వీలైనంత మేరకు ఆడగలిగితే అది తమ అధికారాన్ని మరింతగా పటిష్ఠం చేస్తుందనే ధైర్యమూ వారికి వుంది. ఇన్నేళ్ళ స్వాతంత్య్రం తర్వాత భారత దేశం ఎక్కడ వుంది, పేదరిక నిర్మూలనలో అది ఎంత వరకు సఫలమైంది అనే ప్రశ్న వేసుకొంటే ఎదురయ్యే సమాధానం అమిత విషాదాన్ని కలిగిస్తుంది. 15 మాసాల క్రితం 2022 జనవరిలో ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం అప్పటికి ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన పేదల సంఖ్యలో సగం మంది భారత దేశంలోనే తయారయ్యారు. అంటే 2020లో ఇండియాలో 4.6 కోట్ల మంది భారతీయులు కొత్తగా పేదలయ్యారు.

Also Read: మోడీ సిబిఐని ఏమన్నారో తెలుసా!

అదే సమయంలో 2020 మార్చి నుంచి 2021 నవంబర్ 30 వరకు సాగిన కొవిడ్ కాలంలో దేశంలోని బిలియనీర్ల సంపద రూ. 23.1 లక్షల కోట్ల నుంచి రూ.53.2 లక్షల కోట్లకు పెరిగింది. బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 143కి ఎగబాకింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాలను తరచి చూసినా దేశంలో పేదరికం మరింతగా పేరుకుపోతున్న విషయం బోధపడుతుంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఏడాది కాలం దేశంలోని 81.35 కోట్ల మందికి ఆహార ధాన్యాలను ఉచితంగా సరఫరా చేయాలని 2022 డిసెంబర్ 23న ప్రధాని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే అంత మంది పేదలు దేశంలో వున్నారని స్పష్టపడుతున్నది. 40 ఏళ్ళలో మొదటిసారిగా 201718లో దేశంలో నెలవారీ తలసరి వినియోగ ఖర్చు పడిపోయిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) నిర్ధారించిన నివేదిక 2019లో అనధికారంగా బయటపడింది.

2017-18లో నిర్వహించిన కార్మిక శక్తి సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్) ప్రకారం ఆ ఏడాది 45 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ పెరుగుదల రేటు 6.1 శాతానికి చేరుకొన్నదని మరో ఎన్‌ఎస్‌ఒ నివేదిక వెల్లడించింది. 201112 నుంచి 201718 కాలంలో దేశంలో 90 లక్షల ఉద్యోగాలు కోల్పోయామని చెప్పింది. మన పరిస్థితి ఇలా వుండగా, చైనా 80 కోట్ల మందిని దారిద్య్ర రేఖ నుంచి పైకి తీసుకురాగలగడం ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా నిలిచిపోయింది. 1980 నుంచి అక్కడ గల భూమిని 30 కోట్ల మంది భూమిలేని పేదలకు సమానంగా పంచి పెట్టడం వల్ల ఇది సాధ్యమైందని సమాచారం. ఆ విధంగా చైనాలో భూమిలేని తనాన్ని నిర్మూలించగలిగారు. ఇండియాలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతున్నది. ఇక్కడ భూ సంస్కరణలు విఫలమై ఇప్పుడు భూ కేంద్రీకరణ హద్దులు మీరి సాగిపోతున్నది. ఇంకొక వైపు ప్రధాని మోడీ ప్రభుత్వం పేదలను ఆకలికి, నిరుద్యోగానికి ఎర వేసి కార్పొరేట్ శక్తుల వద్ద సంపద పోగు పడేలా చేస్తున్నది. తయారీ రంగాన్ని, ఎగుమతులను ప్రభుత్వమే నిర్లక్షం చేస్తున్న చోట పేదరికం పెరగకుండా వేరే ఏమి జరుగుతుంది?.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News