Thursday, November 14, 2024

కశ్మీర్‌ను తట్టి చూస్తున్న బిజెపి

- Advertisement -
- Advertisement -

Putin Declares Annexation Of 4 Ukrainian Regions జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయా, 2018 నుంచి అక్కడ కొరవడిన ప్రజా ప్రాతినిధ్య పాలన పునరుద్ధరణ కానున్నదా? కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా అక్కడ జరిపిన పర్యటన ఈ వైపుగా ఆశలను కలిగిస్తున్నది. ఈ నెల 5వ తేదీన అమిత్ షా రజౌరీ బహిరంగ సభలో ప్రసంగించారు. దానికి విశేషంగా ప్రజలు హాజరయ్యారని, ఆయనకు మంచి స్పందన వచ్చిందని చెప్పుకుంటున్నారు. అక్కడ గల పహాడీలకు గుజ్జర్లతో సమానంగా ఎస్‌టి హోదా కల్పిస్తామని, అందుకు పాలనాపరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని అమిత్ షా ఆ సభలో ప్రకటించారు. అది అక్కడ గణనీయంగా వున్న పహాడీలలో ఆశలను రేకెత్తించిందని బిజెపి వర్గాలు చెప్పుకుంటున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే తమ పార్టీ విజయం సాధించడం ఖాయమనే ధీమా వారిలో కనిపిస్తున్నది. పహాడీలకు ఎస్‌టి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తే ఆ కోటాలో తమ వాటా తగ్గిపోతుందని గుజ్జర్లు, బకెర్వాలాలు భయాందోళనలు వ్యక్తం చేశారు. అయితే అటువంటిదేమీ జరగబోదని పహాడీలను ఎస్‌టిలుగా గుర్తించినందువల్ల గుజ్జర్ల కోటాకు ఎటువంటి ముప్పు కలగబోదని అమిత్ షా వాగ్దానం చేశారు. జమ్మూకశ్మీర్‌కు చిరకాలం పాటు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగం 370ని కేంద్రం 2019లో రద్దు చేసింది. అక్కడి ఆస్తులను బయటి వారు కొనుగోలు చేయడాన్ని నిషేధించిన ఆర్టికల్ 35ఎ కి కూడా చరమ గీతం పాడింది. రాష్ట్ర హోదాను ఊడబెరికి జమ్మూకశ్మీర్‌ను, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది. దీనితో అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్రం నిర్బంధ కాండకు తలపడింది. అయితే కశ్మీర్ ప్రజలను చేరువ చేసుకోడానికి ప్రయత్నం చేస్తూనే వుంది. ఒక వైపు జమ్మూకశ్మీర్‌లో ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చేసే ఉద్దేశంతో నియోజకవర్గాల పునర్వవస్థీకరణను చేపట్టింది. అధిక జనాభా గల కశ్మీర్‌కు అదనంగా ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే చేర్చి, జమ్మూ ప్రాంతానికి ఆరు స్థానాలను కలిపింది. ఇంకొక వైపు వీలైన మేరకు అక్కడి ప్రజల్లో విభజన తెచ్చి కొన్ని వర్గాల వారిని ఆకట్టుకునే వ్యూహాన్ని కూడా అవలంబిస్తున్నది. పహాడీలను ఎస్‌టిలుగా గుర్తించాలని తీసుకున్న నిర్ణయం ఇందులో భాగమే. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. 2020 డిసెంబర్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ల (డిడిసిలు) ఎన్నికల్లో బిజెపి ఘోరంగా ఓడిపోయింది. ఫరూక్ అబ్దుల్లా నాయకత్వంలోని ఏడు పార్టీల గుప్కార్ కూటమి విజయాన్ని సాధించింది.

278 స్థానాల్లో గుప్కార్ కూటమి 110 గెలుచుకోగా, బిజెపి 75 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది, ఇండిపెండెంట్లు 50, కాంగ్రెస్ 26, అప్నీ పార్టీ 12 స్థానాలను గెలుచుకున్నాయి. 2018 అక్టోబర్‌లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో స్థానిక పార్టీలైన నేషనల్ కానరెన్స్, పిడిపి పోటీ చేయలేదు. కనుక ఆ ఫలితాలకు విలువ లేదు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామనే తాయిలాన్ని కేంద్రం అక్కడి ప్రజలకు చూపిస్తున్నది. స్వయం ప్రతిపత్తిని తిరిగి కల్పించాలనే డిమాండ్‌ను వదులుకోవాలని స్పష్టం చేస్తున్నది. స్వయం ప్రతిపత్తి మినహా మరి దేనికీ తాము సంతృప్తి చెందబోమని భీష్మించుకున్న స్థానిక పార్టీలు నెమ్మది నెమ్మదిగా రాష్ట్ర హోదా పునరుద్ధరణతో సరిపెట్టుకుంటాయని బిజెపి ఆశిస్తున్నది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణ జరగాలని అక్కడి రాజకీయ శక్తులు చేస్తున్న డిమాండ్‌ను కేంద్రం అంగీకరించే సూచనలు కనిపించడం లేదు.

కశ్మీర్ ప్రజల్లో మార్పు వచ్చిందని గతంలో పాకిస్థాన్ వైపు, ఉగ్రవాదుల వైపు మొగ్గిన స్థితి నుంచి ఇప్పుడు చాలా దూరం వచ్చారని, వాస్తవిక దృష్టితో ఆలోచిస్తున్నారని బిజెపి గట్టిగా అనుకున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు తెర లేచే అవకాశం వుంది. ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా అక్కడ తాను తీసుకున్న ఆర్టికల్స్ 370, 35ఎ ల రద్దు చర్యకు ప్రజలు మద్దతు తెలిపారని ప్రపంచానికి చాటుకోవాలని బిజెపి ఆరాటపడుతున్నది. కశ్మీర్‌లో మానవ హక్కులను హరిస్తున్నదనే అపఖ్యాతిని ఆ విధంగా తొలగించుకొని అంతర్జాతీయ సమాజం మెప్పు పొందాలని కోరుకుంటున్నది.

ప్రధాని మోడీ గాని, అమిత్ షా గాని అక్కడ చేస్తున్న పర్యటనల ఆంతర్యం అదే. అయితే తీవ్ర నిర్బంధ కాండ ద్వారా కశ్మీర్ ప్రజలకు కలిగించిన కష్టాలు వారు అంత తొందరగా మరిచిపోయి బిజెపి వైపు మొగ్గుతారా, నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపిలకు గుడ్ బై చెబుతారా? ఇదంత సులువు కాదు. జమ్మూకశ్మీర్ నుంచి ఉగ్రవాదులను తరిమి తీరవలసిందే. అందుకు అక్కడి ప్రజల హృదయాలను గెలుచుకోవాలి. ఏమైనప్పటికీ జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి స్వేచ్ఛాయుతమైన, స్వచ్ఛమైన ఎన్నికలు జరిగితే, అక్కడి ప్రజల అభీష్టం వెల్లడవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News