తీరు మారకపోతే వేటు తప్పదు.. బీజేపీ అధిష్టానం తెలంగాణ నాయకులకు జారీ చేసిన హెచ్చరికతో కూడిన సందేశమిది. ‘అహమేవ బ్రహ్మాస్మి’అనే వైఖరితో వ్యవహరిస్తున్న రాష్ట్ర నేతలకు, అంతర్గత విభేదాలను రాజేస్తున్న నాయకులకు ఆ పార్టీ అధిష్టానం హుకుం జారీ చేసింది. గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కీలక నాయకులతో ప్రధాని నరేంద్ర మోడీ సుమారు అరగంట సేపుసమావేశమయ్యారు. ఈ భేటీపై అనేక ఊహాగానాలు నడిచినా.. సారాంశం మాత్రం ఒక్కటే. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నప్పటికీ చేజేతులా జారవిడిచామని..ఇప్పటికైనా అంతర్గత విభేదాలు, వ్యక్తిగత ప్రయోజనాలు పక్కనబెట్టి సమైక్యంగా ముందుకు సాగకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని… తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అధిష్టానం తీసుకునే నిర్ణయాలను నీరుగార్చే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత కూర్పు జోరందుకుంది. మండల, జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇక మిగిలింది రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక. అధ్యక్ష రేసులో పలువురు సీనియర్ల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ అనుభవం, సమర్ధత ప్రాతిపదికగా ఈటల రాజేందర్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
మోడీ హెచ్చరిక వెనుక ఆంతర్యమేంటి ..?
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక సీటుతో సరిపెట్టుకున్న బీజేపీ,2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ పార్టీలో కొత్త జోష్ తీసుకొచ్చారు. అప్పటి వరకు కేవలం నగరానికే పరిమితమైన బీజేపీని తెలంగాణలోని పల్లెలకు విస్తరించడంలో బండి సఫలీకృతులయ్యారు. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు పార్టీ శ్రే ణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. అదే సమయంలో తెరాస లో ముసలం మొదలైంది. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుం చి కేసీఆర్ కుకుడి భుజంగా వ్యవహరిస్తూ వచ్చిన ఈటల రాజేందర్ పై ప్రగతి భవన్ ఒక్కసారిగా యుద్ధమే ప్రకటించింది. రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడమే కాదు, ఏకంగా ఈటలపై పలు ఆరోపణలు చేస్తూ కేసులు కూడా బనాయించింది కేసీఆర్ ప్రభుత్వం. దీంతో ఢీల్లీ పెద్దల భరోసా మేరకు ఈటల బీజేపీలో చేరారు.
అప్పటికే దుబ్బాక, జిహెచ్ఎంసి ఫలితాలతో ఊపు మీదున్న బీజేపీ శ్రేణులకు హుజురాబాద్ ఉప ఎన్నిక మరో అవకాశంగా పరిణమించింది. అటు హుజురాబాద్ లో ఈటలను ఎలాగైనా ఓడించి, తనకు ఎదురొచ్చిన వారికి తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు ఉండబోదని పార్టీలోని అసమ్మతి వర్గానికి హెచ్చరిక జారీ చేయాలని కేసీఆర్ సర్వ శక్తులు వినియోగించి యుద్ధ మైదానం సిద్ధం చేశారు. ఇంకా చెప్పాలంటే దళిత బంధు లాంటి ఒక ప్రత్యేక పథకాన్నే రూపొందించి ప్రధానాస్త్రంగా ప్రయోగించారు. అయినప్పటికీ ఈటల అనుభవం, వ్యక్తిగత ఛరిష్మాకు బీజేపీ అధిష్టానం అండదండలు, కార్యకర్తల బలం తోడవ్వడంతో కేసీఆర్ పాచికలు పారలేదు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల విజయ దుందుభి మోగించారు.
ఇదే పంథాను మునుగోడులో కూడా కొనసాగించి బీఆరెస్ కు ప్రత్యామ్నాయం తామేనని రుజువు చేసి.. ఇతర పార్టీల నుంచి కీలక నాయకులను చేర్చుకుని ఒక బలమైన శక్తిగా అసెంబ్లీ బరిలో నిలిచి అధికారం సాధించాలని బీజేపీ అధిష్టానం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, బీజేపీలో చేరడం చకచకా జరిగిపోయాయి. ఓవైపు తెలంగాణలో అధికారం కోసం బీజేపీ అధిష్టానం భారీ వ్యూహరచన చేస్తుంటే మరోవైపు కొత్త నాయకుల చేరికలపై రాష్ట్ర బీజేపీలో అంతర్గతంగా విభేదాలు మొదలయ్యాయి. అదే సమయంలో అప్పటిదాకా పలువురు నాయకులను బీజేపీలోకి చేర్చుకోవడంలో కీలక పాత్ర వహించడమే కాదు..పార్టీ శ్రేణులను సమన్వయపరుస్తూ సంస్థాగత వ్యవహారాలను చక్కబెడుతూ వచ్చిన బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్ ను పంజాబ్ కు బదిలీ చేశారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికల్లో సమన్వయ లోపం ప్రధాన సమస్యగా మారింది.
కేసీఆర్ పకడ్బందీ ప్రణాళికలకు బీజేపీ అంతర్గత విభేదాలు తోడవడంతో ఆ పార్టీకి మునుగోడులో ఓటమి తప్పలేదు. వెనువెంటనే జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. దీంతో అటు కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండితే ఇటు బీజేపీలో మాత్రం వర్గపోరు తారాస్థాయికి చేరింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత పెద్ద ఎత్తున ఆయా పార్టీల నాయకులను చేర్చుకుని ఒక బలమైన శక్తిగా అసెంబ్లీ బరిలో దిగాలని భావించిన బీజేపీ అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వ వైఖరి కొరకరాని కొయ్యగా పరిణమించింది. దీంతో అప్పటిదాకా బీజేపీలో చేరడానికి సంప్రదింపులు జరిపిన పలువురు కీలక నేతలు పార్టీలోని కొందరు నాయకుల తిరస్కార ధోరణిని చూసి వెనక్కి తగ్గారు. బీజేపీలోకి ఇతర పార్టీల నాయకుల్ని చేర్చుకోవాలని పలుమార్లు కేంద్ర నాయకత్వం సూచించినా రాష్ట్ర నాయకత్వం వాటిని పెడచెవిన పెట్టడమే కాదు.. కొంతమంది నాయకులను ప్రోటోకాల్ పేరిట అవమానించిన ఘటనలూ ఉన్నాయి. ఈ అవమానాలు కేవలం కొత్తవారికే పరిమితం కాలేదు. దశాబ్దాలుగా సంఘ్‌లో పనిచేసి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించిన వారికి సైతం రాష్ట్ర బీజేపీలో గౌరవం దక్కట్లేదని వాపోతున్న సీనియర్లు కూడా ఉన్నారు. ఈ సందిగ్ధ వాతావరణంలో కొత్త వారు పార్టీలో చేరాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా అప్పటికే బీజేపీలో చేరిన నాయకుల్లో అంతర్మధనం మొదలైంది. రాష్ట్ర పార్టీ వైఖరి ఇలాగే కొనసాగితే మళ్ళీ బీఆరెస్ కు అవకాశమిచ్చినట్టేనని నిర్ధారించుకున్న వారు అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
బీజేపీ రాష్ట్ర నాయకత్వ ఈ అనాలోచిత దూకుడును త మకు అనుకూలంగా మార్చుకోవడానికి రేవంత్ కూడా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఆ క్రమంలో వచ్చిందే బీఆరెస్ – బీజేపీ ఒక్కటేననే వాదన. లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్ట్ తథ్యమని పదే పదే ప్రకటించిన బీజేపీ నాయకులను నిలదీస్తూ కాంగ్రెస్ విమర్శల దాడిని తీవ్రం చేసింది. కవిత అరెస్ట్ పై ఢీల్లీలో ఇరు పా ర్టీల మధ్య డీల్ కుదిరిందని, బీఆరెస్‌కు మరోసారి అధికారం ఇవ్వడానికే బీజేపీ అధ్యక్షున్ని మార్చారన్న కాంగ్రెస్ ఆరోపణకు అనుగుణంగా కొందరు బీజేపీ నాయకులే తెరవెనుక ప్రచారం చేయడం… దీన్ని ఆ పార్టీ శ్రేణులూ విశ్వసించడం… నాయకుల మధ్య వైషమ్యాలకు ప రాకాష్ట.అటు నిరంతరం వర్గ విభేదాలతో సతమతమయ్యే కాంగ్రెస్‌లో నాయకులంతా ఏకతాటిమీదికొచ్చి కలసికట్టుగా పని చేస్తుంటే.. ఇటు బీజేపీలో మాత్రం ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుని అంది వచ్చిన అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాలను అధ్యయనం చేసిన బీజే పీ అధిష్టానం పెద్దలు ఈసారి సీరియస్ గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారం సాధించాలనే పట్టుదలతో ప్రతి విషయా న్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
భవిష్యత్తు బీజేపీదే..!
కేసీఆర్ పదేళ్ల పాలనపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడంలో కాంగ్రెస్‌కు కలసి వచ్చినవి ఆరు గ్యారెంటీలు. ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి‘ అన్న నినాదంతో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పలు సంక్షేమ పథకాలను గ్యారెంటీలుగా ప్రచారం చేసి అధికారంలోకొచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ప్రస్తుతం అధ్వాన్నంగా ఉందన్నది కఠోర వాస్తవం. దీంతో గ్యారెంటీల అమలు ప్రభుత్వంపై తీవ్ర భారంగా మారుతోంది. దీనికి తోడు కాంగ్రెస్ అధిష్టానానికి నిధులు పంపడంలో రాష్ట్ర మంత్రులు తలమునకలవుతున్నారని… ఇప్పటికే వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ తంతు ఇలాగే కొనసాగితే అనతికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నాయకుల అవినీతి ఆ పార్టీ పుట్టి ముంచే అవకాశాలున్నాయి. అయితే అటు బీఆరెస్ ఎంత ప్రయత్నించినా ఆ పార్టీ పట్ల అనుకూల వాతావరణాన్ని నిర్మించలేకపోతోందని ఒక పరిశీలన.
గ్రామాల్లో పదేళ్ల బీఆరెస్ పాలన పట్ల ఇప్పటికీ ఏవగింపు తగ్గలేదు. ఇటువంటి సమయంలోనే బీజేపీ గనక సరైన పంథాలో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలపై ఒక కార్యాచరణ రూపొందించగలిగితే బీఆరెస్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలున్నాయి. అందుకే బీఆరెస్ ను ఖాళీ చేయగలిగే నాయకుడివైపే అధిష్టానం దృష్టి సారించినట్టు సమాచారం. ఇంతకాలం ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులను తయారు చేయకుండా పార్టీని కేవలం ముగ్గురు, నలుగురి గుత్తాధిపత్యంగా మార్చడం వల్లనే నేడు ఇతర పార్టీల నాయకులపై ఆధారపడాల్సి వచ్చిందని… ఇంతకాలం పార్టీ ఎదగకపోవడానికి బాధ్యత వహించాల్సింది పోయి ఇప్పుడు విలువల గురించి, సిద్ధాంతం గురించి మాట్లాడడమేంటని ఒక జాతీయ నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్ర బీజేపీలో ఎక్కడ, ఎవరు, ఏం చేస్తున్నారనే విషయంలో ఢిల్లీ పెద్దలకు కచ్చితమైన సమాచారం, అవగాహన ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం అధ్యక్ష ఎంపిక ద్వారా రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని ప్రమాణాల ప్రాతిపదికగా ఈ కసరత్తు ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. నూతన అధ్యక్షుడికి తెలంగాణ రాజకీయ పరిణామాలపై అవగాహనతో పాటు పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా స్పష్టమైన అజెండా ఉండాలి. ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలను చిత్తు చేయగల రాజకీయ చతురత ఉండాలి. పాత, కొత్తలతో సంబంధం లేకుండా సమర్థులైన నాయకులను ఎంపిక చేయడంపై దృష్టి సారించాలి. ఇతర పార్టీల వారిని బీజేపీలో చేర్చుకోవడంలో చొరవ చూపించడమే కాదు… అంతర్గతంగా ఉన్న విభేదాలను తొలగించగల పరిణతి ఉండాలి. మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వ విజయాలను, పార్టీ విధానాలను క్షేత్ర స్థాయిలోకి బలంగా తీసుకెళ్లగలిగేలా శ్రేణులను నడిపించగలిగే వ్యక్తికే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
-లోపలి మనిషి