వెస్ట్ బెంగాల్‌లో టిఎంసిని ఓడించేందుకు బిజెపికి సుస్పష్టమైన వ్యూహం ఉన్నట్లు కన్పించలేదు. ఏమైనా వ్యూహం రచించినా.. విజయవంతంగా అమలుచేసే పరిస్థితి లేదు. బిజెపికి అర్థబలం, అంగబలం దండిగా ఉన్నా.. గత ఏడేళ్లుగా బిజెపి బలమైన నాయకత్వాన్ని రూపొందించలేక పోయింది. 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలిపే స్థితికి ఎదగలేక పోయింది. రాష్ట్ర స్థాయిలో నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటోంది కమలదళం. మమతా బెనర్జీ తప్పిదాలను, బలహీనతలను దుమ్మెత్తి పోవడమే బిజెపి ఏకైక ఎజెండాగా ఉంది. కమలనాథుల ఆశలన్నీ.. ఉచితాలతో ఓటర్లను ఆకట్టుకోవడం పైనే ఉన్నాయి. 75 లక్షల మంది రైతులకు పిఎం కిసాన్ యోజన కింద రూ. 18 చెల్లింపు, ఏటా పది వేల రూపాయల చొప్పున ప్రతి శరణార్థి కుటుంబానికి ఐదేళ్ల పాటు సహాయం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫార్సుల అమలు, ఆయుష్మాన్ భారత్ పథకం, మహిళలకు ప్రభుత్వోద్యోగాలలో 33% రిజర్వేషన్లు వంటి పథకాలపైనే ఆశలు.
పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు లెఫ్ట్ ఫ్రంట్‌కు తిరుగులేని అడ్డా. 1977 నుంచి 2011 వరకూ 34 ఏళ్ల పాటు వామపక్షాలు అధికారంలో కొనసాగాయి. అలాంటి వెస్ట్ బెంగాల్ ప్రస్తుతం రైటిస్ట్ రాజకీయ పార్టీల కురుక్షేత్రంగా మారింది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ(బిజెపి), మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) పార్టీలే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు నువ్వా.. నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. వెస్ట్ బెంగాల్‌లో మారిన రాజకీయాల నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలు తమ ఉనికిని నిలుపుకునేందుకు.. తంటాలు పడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సెక్యులరిజాన్ని అందిపుచ్చుకుని, మైనారిటీలను ఆకట్టుకుని, వారి ప్రయోజనాలను పరిరక్షిస్తూ ప్రబలశక్తిగా ఎదిగింది.. అధికారాన్ని హస్తగతం చేసుకుంది.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత భారతీయ జనతా పార్టీ బెంగాల్‌లో బలమైనశక్తిగా పూర్తి స్థాయిలో ఎదగలేకపోయింది. బెంగాల్‌లో బిజెపి అంతర్గత కీచులాటలతో కుదేలవుతోంది. సంస్థాగత లోపాలకూ కొదవలేదు. ఫలితంగా పలువురు ఎంఎల్‌ఎలు.. ఇద్దరు ఎంపిలు కూడా టిఎంసి పంచన చేరారు. అర్జన్ సింగ్ అన్న ఒక్క ఎంపి మాత్రం బిజెపి కండువా కప్పుకున్నాడు. 2024 పార్లమెంటు ఎన్నికల్లోనూ కమలనాథులు పెద్దగా రాణించలేకపోయారు. పొరుగునున్న బంగ్లాదేశ్‌లోని హిందువులతో జరుగుతున్న దాడులు, విధ్వంసకాండతో స్థానికంగా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి లబ్ధి పొందేయత్నం చేస్తోంది బిజెపి. మరోపక్క మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టిఎంసి సర్కార్ జిహాదీలకూ, మతోన్మాద శక్తులకు రక్షణ కల్పిస్తూ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శనాస్త్రాలు సంధిస్తూ పబ్బం గడుపుతోంది.
మరో పక్క బిజెపి కేంద్ర నాయకత్వం ఎలాగైనా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో అధికారాన్ని కైవసం చేసుకుని, టిఎంసిని శంకరగిరిమాన్యాలు పట్టించాలన్న పట్టుదలతో ఉంది. ఈ లక్ష్యసాధన కోసం పెద్ద ఎత్తున యువతను ఆకట్టుకునేందుకు పార్టీ అభ్యర్థిత్వం నమోదు చేపట్టింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2024 అక్టోబర్ 27న కోల్ కతాను సందర్శించి కనీసం కోటి మందిని పార్టీలో చేర్చుకోవాలని బెంగాల్ బిజెపికి టార్గెట్ నిర్దేశించారు. పార్టీ విస్తరణ కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. అయితే సభ్యత్వ నమోదు.. నత్తనడకన సాగుతోంది.. డిసెంబర్ నెలాఖరుకు సభ్యత్వ నమోదు 35 లక్షలు కూడా దాటలేదు. దీంతో సభ్యత్వ నమోదు తుది తేదీని 2025 జనవరి వరకూ పొడిగించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, హింసాకాండతో.. పశ్చిమ బెంగాల్ బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం కాస్త ఊపు అందుకున్నా.. కోటి మందికి కాషాయ ఖండువా కప్పాలన్న లక్ష్యం దూరంగానే ఉంది.
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న అత్యాచారాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, రాష్ట్రంలో హిందువుల మద్దతు కూడగడుతున్నా.. రాష్ట్ర బిజెపిలో సంస్థాగత లోపాలు, అంతర్గత లుకలుకలు, అధికార టిఎంసి ఎత్తుగడలు.. బిజెపికి అడుగడుగునా.. ఇబ్బందిగానే తయారయ్యాయి. భారతీయ జనతా పార్టీలో మద్దతు ఇస్తున్న వారిని టిఎంసి నాయకత్వం బెదిరిస్తూ.. భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని, వారికి సామాజికంగా, ఆర్థికంగా పుట్టగతులు లేకుండా చేస్తానని భయపెడుతోందని స్థానిక బిజెపి నాయకుడు ఒకరు అన్నారు. టిఎంసి గూండా ఎత్తుగడలు ఎన్ని ఎదురైనా బిజెపి బెంగాల్ ప్రజల కోసం నిర్విరామంగా పోరాటం సాగిస్తుందని, తమ పార్టీ బలాన్ని పెంచుకునేందుకు కృతనిశ్చయంతో ఉందని, 2026లో బెంగాల్‌లో అధికారం హస్తగతం చేసుకునేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామని, మమతా బెనర్జీని ఓడించేందుకు అన్ని విధాలా యత్నిస్తామని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం బిజెపియే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. లెఫ్ట్ ఫ్రంట్,- కాంగ్రెస్ అలయన్స్ కన్నా బలంగా ఉంది. అందువల్ల మమతా బెనర్జీ వ్యతిరేక ఓట్లను గంపగుత్తగా సాధించడం ద్వారా అధికారం హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది. మమతా బెనర్జీ అన్ని విధాలుగా ఇరుకున పెట్టేందుకు టిఎంసికి బలమైన సవాల్ విసిరేందుకు బెంగాల్ బిజెపి సంసిద్ధమవుతోంది. మమతా ప్రభుత్వంలో అవినీతిని ఎండగట్టేందుకు నిర్విరామంగా పోరాటం సాగిస్తోంది. అవినీతికి పాల్పడుతున్న స్థానిక టిఎంసి నాయకులను ప్రజల్లో చాలా మంది వ్యతిరేకిస్తున్నా.. మమతా బెనర్జీకి ప్రస్తుతానికి ప్రజాదరణ చెక్కుచెందలేదు. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి ఎదుర్కొంటున్న మరో పెద్ద లోపం బలమైన నాయకత్వం లేకపోవడం. మమతా బెనర్జికి దీటుగా నిలిచే నాయకుడే బెంగాల్‌లో లేడు. 1980 నుంచి ఆర్‌ఎస్‌ఎస్ బెంగాల్‌లో చిత్తశుద్ధితో పని చేస్తోంది. తమ బలాన్ని బాగానే పెంచుకుంది. ఆర్ ఎస్‌ఎస్ కృషి పుణ్యమా అని బిజెపి రాజ్‌బన్ శీస్, నామశుద్రాస్ వంటి పలు కమ్యూనిటీల మద్దతు కూడగట్టుకోగలిగింది. దేశంలో ఎక్కడాలేని విధంగా దళిత్ కమ్యూనిటీలలో బేస్ ఏర్పాటు చేసుకోగలిగింది. మమతను ముస్లింల సానుభూతిపరురాలిగా ముద్ర వేయడంలోనూ బిజెపి విజయం సాధించింది.
మరోపక్క మమతా బెనర్జీ తనపై యాంటీ హిందూ ఇమేజ్ పడకుండా తనవంతు కృషి చేస్తున్నారు. అయితే ఇదంతా ఒక రోజులో అయ్యేపని కాదన్నది నిజం. అయితే మమత సెక్యులర్ భావాలు గల ప్రజల మద్దతు మాత్రం పొందగలగడం ఓ విశేషం. పశ్చిమ బెంగాల్ ప్రజలు గత వందేళ్లలో ఎన్నో మతపరమైన అల్లర్లు, హింసాకాండ చూశారు. అనుభవించారు. ప్రస్తుతం రామ్ లేదా రహీమ్ పేర్న మరో మారణహోమం ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేరు. బెంగాలీ మాట్లాడే హిందువులు, ముస్లింల జీవినశైలి ఒకే మాదిరిగా ఉంది. అందువల్ల వారిని విభజించే ఎత్తుగడలు అంతగా పని చేయవు.
——వెస్ట్ బెంగాల్‌లో టిఎంసిని ఓడించేందుకు బిజెపికి సుస్పష్టమైన వ్యూహం ఉన్నట్లు కన్పించలేదు. ఏమైనా వ్యూహం రచించినా.. విజయవంతంగా అమలుచేసే పరిస్థితి లేదు. బిజెపికి అర్థబలం, అంగబలం దండిగా ఉన్నా.. గత ఏడేళ్లుగా బిజెపి బలమైన నాయకత్వాన్ని రూపొందించలేకపోయింది. 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలిపే స్థితికి ఎదగలేకపోయింది. రాష్ట్ర స్థాయిలో నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటోంది కమలదళం. మమతా బెనర్జీ తప్పిదాలను, బలహీనతలను దుమ్మెత్తి పోవడమే బిజెపి ఏకైక ఎజెండాగా ఉంది. కమలనాథుల ఆశలన్నీ.. ఉచితాలతో ఓటర్లను ఆకట్టుకోవడం పైనే ఉన్నాయి. 75 లక్షల మంది రైతులకు పిఎం కిసాన్ యోజన కింద రూ. 18 చెల్లింపు, ఏటా పది వేల రూపాయల చొప్పున ప్రతి శరణార్థి కుటుంబానికి ఐదేళ్ల పాటు సహాయం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫార్సుల అమలు, ఆయుష్మాన్ భారత్ పథకం, మహిళలకు ప్రభుత్వోద్యోగాలలో 33% రిజర్వేషన్లు వంటి పథకాలపైనే ఆశలు.
ప్రతి మత్స్యకార కుటుంబానికి ఏటా రూ. 6 వేలు, మహిళలకు ఉచిత విద్య, ఆశావర్కర్ల మౌలిక వేతనం రూ. 20 వేలకు పెంపు, భూమేలేని రైతులకు రూ. 4 వేల సాయం వంటి పలు పథకాలు అమలుకు బిజెపి వాగ్దానాలు చేస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రచారం బరువు బాధ్యతలన్నీ ప్రధాని వహించాల్సిన పరిస్థితి. అలాగే కొందరు స్టార్ ప్రచారకులు ప్రచారం చేయవచ్చు. దశాబ్ద కాలంగా బిజెపి రాష్ట్ర ప్రజలకు చక్కటి అభివృద్ధి మోడల్‌ను చూపలేకపోయింది. ప్రధాని మోడీ చరిష్మానే బిజెపికి ఏకైక బలం. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రధాని ర్యాలీకి లకు, సభలకు రైళ్లలో జనాల్ని తరలించుకు వచ్చారంటే.. బిజెపి స్థానిక నాయకత్వం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రధాని మోడీ.. కూడా మమతను దుమ్మెత్తి పోయడం తప్ప.. స్పష్టమైన ప్రాజెక్టులను కానీ, ఏమీ వాగ్దానం చేయలేకపోయారు. పలు ఉచిత ఫథకాలనే ఏకరువు పెట్టారు. ప్రస్తుతం ఉన్న ఏకైక ప్రశ్న టిఎంసికి ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించడంలో బిజెపి వైఫల్యం చెందితే.. బెంగాల్ పరిస్థితి ఏమిటి.. బెంగాల్‌లో మమతా బెనర్జీ అధికారాన్ని సవాల్ చేసేది ఎవరు.. లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ ఏ మేరకు సవాల్‌గా నిలవగలవు అన్నది ప్రశ్న.
2011 అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఓట్ షేర్ 40 శాతం ఉంటే.. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి 7 శాతానికి దిగజారింది. 2024 నాటికి కేవలం 5.67 శాతానికి పడిపోయింది. ఇక కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసుకట్టుగా మారింది. ఇటీవల పెరుగుతున్న హిందుత్వ పోకడలను దీటుగా ఎదుర్కొనేందుకు లెఫ్ట్ ముఖ్యంగా సిపిఐఎం వద్ద సుస్పష్టమైన వ్యూహం కన్పించడంలేదు. ఇటువంటి నేపథ్యంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజేతగా నిలుస్తుందో అనూహ్యమే..
గీతార్థ పాఠక్